కీచక రాజ్యం.. ఆగని అఘాయిత్యాల పర్వం | Rising atrocities against women in andhra pradesh | Sakshi
Sakshi News home page

కీచక రాజ్యం.. ఆగని అఘాయిత్యాల పర్వం

Jun 9 2025 5:35 AM | Updated on Jun 9 2025 7:37 AM

Rising atrocities against women in andhra pradesh

బాలికలు, మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం అల్లకల్లోలం 

సగటున రెండు రోజులకొక అత్యాచారం

188 ఏడాదిలో అత్యాచారాలు

15 రేప్‌ చేసిన అనంతరం హత్యలు

సగటున రెండు రోజులకొక అత్యాచారం.. చంబల్‌ లోయ దురాగతాలను తలపిస్తున్న రాష్ట్రం చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. రెడ్‌బుక్‌ సేవలో తరిస్తున్న పోలీసు యంత్రాంగం రామగిరి మండలంలో 9వ తరగతి బాలికపై 14 మంది ఆరు నెలలపాటు అత్యాచారం.. బాధిత బాలికను స్వయంగా విచారించిన ఎస్పీ.. అయినా ఇప్పటిదాకా కేసే లేదు! మహిళలంటే టీడీపీ నేతలకు చిన్నచూపు.. అందుకే బాలికలు, మహిళల భద్రతకు కూటమి సర్కారు తిలోదకాలు

సాక్షి, అమరావతి: కీచక చంద్రబాబు ప్రభుత్వం గురివింద నీతిని వల్లె వేస్తోంది. మహిళల పట్ల ఒక్కసారిగా మొసలి కన్నీరు కారుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో అసాంఘిక శక్తులు.. మహిళలు, బాలికలపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరోవైపు మహిళల భద్రత, గౌరవం, ఆత్మాభిమానం అంటూ వైఫల్యాన్ని కప్పిపుచ్చేకునేందుకు యత్నిస్తోంది.

ఒకప్పటి చంబల్‌ లోయను తలపిస్తూ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై యథేచ్ఛగా అఘాయిత్యాలతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా భీతావహ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని కట్టడి చేయడం చేతగాని  చంద్రబాబు ప్రభుత్వం.. ఎవరో ఓ ప్రైవేటు వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి ఆపాదిస్తూ దుష్ప్రచారానికి తెగబడుతోంది. తమ ఏడాది పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ రాజకీయాల కుట్రకు తెగిస్తోంది. కానీ, రాష్ట్రంలో రోజు రోజుకూ దిగజారుతున్న మహిళల భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రం
బాలికలు, మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అత్యాచార పర్వం యావత్‌ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎంతగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఏకంగా 188 మంది బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇందులో అత్యాచారం ఆపై హత్యకు గురైన వారు 15 మంది ఉన్నారు. మరో తొమ్మిది మంది బాలికలు, మహిళలు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ లెక్కన దాదాపు ప్రతి రెండు రోజులకు ఓ అత్యాచారం జరుగుతోందని పోలీసు రికార్డులే వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు చంబల్‌ లోయలో మహిళలపై ఈ తరహాలో అఘాయిత్యాలకు పాల్పడేవారని పత్రికలు ప్రచురించేవి. ఆనాటి చంబల్‌ లోయలోని దారుణ పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొనడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది.  

మహిళల ఆక్రందనలు పట్టని చంద్రబాబు ప్రభుత్వం
రాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత రోజు రోజుకూ దిగజారుతున్నా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. బాలికలు, మహిళల భద్రత గురించి నామమాత్రంగా కూడా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో దిశ వ్యవస్థ ద్వారా మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆపదలో ఉన్నామని బాలికలు, మహిళలు ఆ యాప్‌ ద్వారా సమాచారం ఇస్తే చాలు కేవలం 5–10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని భద్రత కల్పించేవారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేయడం.. అక్రమ కేసులు నమోదు చేసి వేధించడమే పోలీసుల ఏకైక విధి అని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. పోలీసులు శాంత్రి–భద్రతల పరిరక్షణ, మహిళా భద్రత వంటి కీలకమైన తమ విధులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతలకు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా, ఇతర కాంట్రాక్టులు లభించేలా ప్రత్యర్థులు, పోటీదారులను బెదిరించడమే తమ విధి అని భావిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధించడమే ఏకైక పనిగా పెట్టుకున్నారు.

దాంతో రాష్ట్రంలో బాలికలు, మహిళా భద్రత గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేశ్‌ నియోజకవర్గం మంగళగిరి, హోమ్‌ మంత్రి అనిత నియోజకవర్గం పాయకారావుపేట.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమైపోయాయి. విద్యార్థినులు బడికి వెళ్లి ఇళ్లకు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 

టీడీపీ పెద్దల తీరే అంత.. అందుకే ఈ దుస్థితి
టీడీపీ కూటమి పెద్దలు, కీలక నేతలే మహిళల గౌరవానికి భంగం కలిగిస్తూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం ప్రభుత్వ మైండ్‌ సెట్‌కు నిదర్శనం.  ‘ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ‘కారు షెడ్డులో ఉండాలి.. ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి’ అని దివంగత కోడెల శివ ప్రసాదరావు తదితరుల వ్యాఖ్యలే రాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి తార్కాణం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఒక మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకొని ఈడ్చి.. దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోక పోగా, సదరు బాధితురాలినే తప్పు పట్టడం తెలిసిందే. ఇక నారా లోకేశ్‌ విదేశాల్లో మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించిన వీడియోలు, ఫొటోలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి. అప్పట్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

14 మంది రేప్‌ చేస్తే కేసు కట్టరా?
చీమ కుట్టినట్టుగా కూడా లేదా?
హోం మంత్రి ఎక్కడ?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతి పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత బాలికపై 14 మంది యువకులు కొన్ని నెలలపాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన యావత్‌ రాష్ట్రాన్ని తీవ్రంగా కలచి వేస్తోంది. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఆ దారుణం బయటకు పొక్కింది. అదే గ్రామానికి చెందిన బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసి గిరి, బాసి కార్తీక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజి, తలారి మురళి, రొద్దకంపల్లి మహేశ్, హెచ్‌.సురేశ్, హెచ్‌.హేమంత్‌ పేర్లు బయటపడ్డాయి. మరో ముగ్గురి పేర్లు తెలియరాలేదు. అందరూ టీడీపీ కార్యకర్తలే కావడంతో నిందితులకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తుండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

బాధిత బాలిక తండ్రి గతేడాది టీడీపీ గెలిచిన సంబరాల్లో తప్పెట వాయించుకుంటూ బొలెరో నుంచి జారి కింద పడి చనిపోయారు. బాలిక తల్లికి మతి స్థిమితం లేదు. అలాంటి ఆ బాలికపై వీడియోలు చూపి బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ 14 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లగా.. ఆరు నెలల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు.

దీంతో బాలికను బంధువులు నిలదీయగా.. అసలు విషయం వెలుగు చూసింది. బాధిత బాలికను స్వయంగా ఎస్పీనే విచారించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స, పరీక్షలు చేయిస్తున్నారు. ఇంత దారుణమైన ఘటనపై ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరు అడ్డు పడుతున్నారు? ఎంకా ఎన్నాళ్లు నాన్చుతారు? వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్న ఈ ఘటనలో ఇటు పోలీసులు, అటు పాలకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేకపోవడం దుర్మార్గం. స్థానిక మహిళా శాసన సభ్యురాలు సునీత, మహిళా హోం మంత్రి అనిత ఇప్పటి దాకా ఎందుకు నోరు విప్ప లేదు?  

కళ్లెదుటే ఎన్నో ఘటనలు..
అనంతపురానికి చెందిన ఓ యువతిని కొందరు యువకులు కిడ్నాప్‌ చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరుకు తీసుకువెళ్లి హత్య చేయడం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు తాజా ఉదాహరణ. 

⇒  2024 జూలై 7వ తేదీన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. 11 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ బాలిక మృతదేహాన్ని కూడా గుర్తించలేకపోయారు. నిందితులను శిక్షించనే లేదు. 

⇒ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేకుండాపోయింది. పిఠాపురం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్‌ దుర్గాడ విజయలక్ష్మి భర్త, దుర్గాడ జాన్‌ ఓ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  

⇒  బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం హిందూపురం మండలం తూమకుంట పరిధిలో 2024 ఆగస్టు 2వ తేదీన ఎనిమిదేళ్ల చిన్నారిని గంగాధర్‌ (45) అనే వ్యక్తి దారుణంగా చంపి ఇసుకలో పాతిపెట్టాడు. అంతకు ముందు అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.

⇒ వైఎస్సార్‌ జిల్లా గోపవరం మండలంలో ఇంటర్‌ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేశాడు. బద్వేలు పట్టణంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థినిని విఘ్నేష్‌ అనే వివాహితుడు ప్రేమ పేరుతో వేధించాడు. బాలికను గోపవరం మండలంలోని సెంచురీ పానెల్స్‌ పరిశ్రమ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి.. అనంతరం వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ ఆమెపై పోసి నిప్పు అంటించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు, మేకల కాపరులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతిచెందింది.

⇒  తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన భార్య, భర్త, తన ఇద్దరు పిల్లలతో కలిసి పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి చేరుకున్నారు. చిన్నారి మేనమామకు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. చిన్నారి తండ్రి, కుటుంబీకులు కలిసి సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. ఏఎం పురానికి చెందిన సుశాంత్‌ చిన్నారికి చాక్లెట్‌ తీసిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. చిన్నారిని తిరిగి నివాసానికి తీసుకెళ్లకుండా.. పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కిరాతకుడైన సుశాంత్‌.. చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి చంపేశాడు.

⇒  దర్శి సమీపంలోని గ్రామంలోని ఓ బాలికను టీడీపీ నేత కుమారుడు ఏనుగంటి చరణ్‌ సాయి తన స్నేహితుల రూమ్‌కు తీసుకుని వెళ్లి కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. 

⇒  అభంశుభం తెలియని చిన్నారులకు తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులు మద్యం తాగించి, వారిని లైంగికంగా వేధించిన అమానవీయ ఉదంతం నంద్యాల జిల్లా డోన్‌ మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలైన యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడి వీడియోలు కూడా చిత్రీకరించారు. టీడీపీ నేత ఈడిగె వీరాంజనేయులు గౌడ్‌ కుమారుడు ఈడిగె రాంబాబుగౌడ్‌ తన ఇద్దరు స్నేహితులతో కలసి బాలికలను బెదిరించి మద్యం తాగించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement