మీ ప్రోత్సాహం మరువలేను  | Sakshi
Sakshi News home page

మీ ప్రోత్సాహం మరువలేను 

Published Sat, Nov 11 2023 4:39 AM

A review of the development of Pulivendula Constituency - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప:  పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కోసం అలుపెరగకుండా శ్రమిస్తూ ప్రజలకు సహకారం అందిస్తున్న వేముల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో రూ.1.75 కోట్లతో నిర్మించిన పోలీస్‌ స్టేషన్, రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్‌ స్టేషన్లను ప్రారంభించారు.

అనంతరం నెమళ్ల పార్కు వద్ద వైఎస్‌ ఫ్యామిలీ ప్రేయర్‌ హాలు ప్రాంగణంలో వేముల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థాని­కులు, స్నేహితులు, సన్నిహితులను ఒకేచోట కలుసుకున్న సీఎం జగన్‌ వారిని పేరుపేరునా ఆప్యా­యంగా పలకరించారు. వైఎస్సార్‌ హఠాన్మరణం అనంతరం మీరంతా అందించిన ప్రోత్సాహం, సహకారం, మనోధైర్యంతో ఈరోజు సీఎంగా అందరి మేలు కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. పులివెందుల నియోజకవర్గం, వేముల మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా చర్చించారు.  

‘పాడా’ అభివృద్ధిని వివరించిన కలెక్టర్‌ 
పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్‌కు కలెక్టర్‌ వి.విజయరామరాజు వివరించారు. వేముల మండల పరిధిలో పాడా, ఇతర శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలియచేశారు. మండలంలో చేపట్టాల్సిన మరిన్ని అభివృద్ధి పనులతోపాటు వివిధ అంశాలపై పలువురు నాయకులు వినతి పత్రాలను అందించి నేరుగా ముఖ్యమంత్రికి విన్నవించారు.

పీబీసీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌లో లైనింగ్‌ పనులు చేపట్టాలని వేముల మండల నాయకులు కోరారు. మైక్రో ఇరిగేషన్‌ పరిధిలో మంజూరైన 76 సంపులను త్వరితగతిన పూర్తి చేస్తే 15 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు దోహదం చేస్తుందని తెలిపారు. పెండ్లూరు చెరువు కాలువల ఆధునికీకరణతో మరో 11 వందల ఎకరాలు ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. గాలేరు–నగరి కెనాల్‌ నుంచి నారేపల్లి చెరువుకు నీటిని లిఫ్ట్‌ చేస్తే మరిన్ని ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. ఇవన్నీ పూర్తయితే మెట్ట ప్రాంతంలో 60 శాతం భూమి సాగునీటి పరిధిలోకి వస్తుందని వివరించారు.

వేముల సమీపంలో బెరైటీస్, లైమ్‌ స్టోన్, బెలుకు లాంటి ఖనిజాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకునేలా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని మరికొందరు విన్నవించారు. పత్తికి సీజనల్‌ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ వర్తింప జేయాలని, రబీలో మినుములు, పెసర రైతులకు రాయితీలు కల్పించాలని కోరారు. 

ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు 
రెండు రోజుల జిల్లా పర్యటన ముగించుకుని గన్నవరం వెళ్లేందుకు మధ్యాహ్నం కడప ఎయిర్‌పోర్టు చేరుకున్న సీఎం జగన్‌ దంపతులకు పలువురు ఘనంగా వీడ్కోలు పలికారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, డీఐజీ సెంథిల్‌కుమార్, కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్, కడప మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప మేయర్‌ కె.సురేశ్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఎమ్మె­ల్యేలు దాసరి సుధా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లి­కార్జునరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారుడు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు.   

భూ పరిహారంపై సమీక్షించండి 
యూసీఐఎల్‌ యాజమాన్యం రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, తుమ్మలపల్లె ప్రాంతాల పరిధిలో 250 ఎకరాలను తీసుకుని పరిహారం ఇవ్వలేదని, భూములు కోల్పోయినవారికి ఉద్యో­గాలు ఇవ్వలేదని స్థానికులు సీఎం జగన్‌ దృష్టికి తేవడంతో తక్షణమే స్పందించారు. దీనిపై సీఎస్‌ జవహర్‌రెడ్డి నేతృత్వంలో సమీక్ష నిర్వహించాలని తన వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయరెడ్డిని ఆదేశించారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో పాటు ఆయా గ్రామాల రైతులను కూడా సమావేశానికి ఆహా్వనించి సమీక్ష నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమం చివరలో ఈ నెల 14వతేదీ నుంచి 20 వరకు జరిగే 56వ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ లింగాల ఉషారాణి, వేముల జడ్పీటీసీ కేవీ బయపురెడ్డి, మండల ఇన్‌చార్జి నాగెళ్ల సాంబశివారెడ్డి, వేముల మాజీ మండల ఉపాధ్యక్షుడు లింగాల రామలింగారెడ్డి, పొల్యూషన్‌ బోర్డు మెంబర్‌ మరకా శివకృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ మోరంరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రైతులకు అండగా నిలుస్తాం 
వేముల మండల నాయకులు ప్రస్తావించిన అంశాలను సావధానంగా ఆలకించిన సీఎం జగన్‌ వీటిపై స్పందిస్తూ గత సర్కారు హయాంలో రైతుల ఇన్‌పుట్‌ సబ్సిడీ,  ఇన్సూరెన్స్‌పై అతి తక్కువ ఖర్చు చేశారని, మన ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లలో రూ.7,800 కోట్లు వ్యయం చేశామని గుర్తు చేశారు. వేముల పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు, రైతుల సమస్యలను పూర్తి వివరాలతో స్వీకరించాలని, పరిష్కార మార్గాలు  సంతృప్తి కలిగించాయో లేదో నిర్ధారించుకొని ముందుకు సాగాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. వారికి అందాల్సిన పరిహారం ప్రక్రియ నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గ్రామ లోగిళ్లలోనే సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావివ్వకూడదని సూచించారు. పరిపాలన పారదర్శకంగా సాగినపుడే వ్యవస్థ పటిష్టంగా సాగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అలుపెరుగకుండా శ్రమిస్తున్న పార్టీ నాయకులు, అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement