తీవ్ర విషాదం: ఆస్తుల్ని పంచేసి.. బలవన్మరణం | Retired Teacher Commits Suicide Along With Wife And son In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏం కష్టమొచ్చింది.. మాస్టారు!

Jun 16 2026 8:03 AM | Updated on Jun 16 2026 9:44 AM

Retired Teacher Commits Suicide Along With Wife And son In Andhra Pradesh

కుమారుడితో కలిసి భార్యాభర్తల ఆత్మహత్య

కాళ్లు, చేతులు కట్టేసుకుని ఉరితాళ్లకు వేలాడిన వైనం

ఆస్తుల్ని బంధువులు, రెడ్‌క్రాస్‌కు పంపకాలు చేస్తూ వీలునామా

మానసిక, శారీరక సమస్యలే కారణమంటూ సూసైడ్‌ నోట్‌

అంతిమ నిర్ణయం.. అనంత విషాదం!

ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబం అంతిమ నిర్ణయం.. అనంత విషాదంగా మారింది. మండలంలోని దువ్వూరు గ్రామంలో ఉపాధ్యాయుడిగా కొంత కాలం క్రితం ఉద్యోగ విరమణ చేసిన చీర్ల మధుసూదన్‌రావు (65), ఆయన భార్య రత్నావళి (60), కుమారుడు సాయి సుకృత్‌ (25) బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం సోమవారంజిల్లాలో సంచలనంగా మారింది.

సాయిసుకృత్‌ తిరుపతిలో ఉద్యోగం చేస్తుండగా, తల్లిదండ్రులు సైతం అక్కడే ఉంటూ శనివారం స్వగ్రామానికి రావడం, ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడడం వెనుక మానసిక మనోవేదన బలీయంగా మారడంతో శారీరకంగా బలహీనులయ్యారు. ముగ్గురు ఒకేసారి మరణించాలనే నిశ్చయంతో చేతులు, కాళ్లను కట్టేసుకుని మరీ ఫ్యాన్‌ ఇనుప రాడ్‌కు ఉరేసుకున్నారు. దీనికి ముందు తన అక్క కు ఫోన్‌ చేసి సోమవారం దువ్వూరుకు రావాలని, మరో అక్కకు ఫోన్‌ పే ద్వారా డబ్బులు పంపడం, ఆస్తులు, బంగారానికి సంబంధించి తన అక్కలు, వారి పిల్లలకు పంపకాలు చేస్తూ వీలునామా రాయడం చూస్తే ఆ దంపతులు అంతులేని మానసిక మనోవేదనకు గురయ్యారనేది స్పష్టమవుతోంది. ఆయన విశ్రాంత ఉపాధ్యాయుడు కావడంతో నెల నెలా పెన్షన్‌ సైతం వస్తోంది. స్వగ్రామంలో సొంతింటితోపాటు ప్లాట్లు, బంగారం, నగదుకు ఏ లోటు లేదు. కానీ కుటుంబం మొత్తం ఏకకాలంలో ఆత్మహత్యకు పాల్పడడంతో ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు.

ఆస్తులను పంపకాలు చేస్తూ వీలునామా..
మృతులు ముగ్గురు తమ మరణానికి కారణం చెబుతూ రాసిన లేఖలో మానసికంగా, శారీరకంగా గట్టిగా లేమని, తమ కుమారుడి పరిస్థితి కూడా అలాగే ఉందంటూ చనిపోవాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఆ లేఖలో తమ ఆస్తుల పంపకం చేస్తూ ఓ వీలునామా కూడా రాశారు. తమకు బుచ్చిరెడ్డిపాళెంలో రెండు ప్లాట్లు ఉన్నాయని తన భార్య రత్నావళి కోరిక మేరకు ఒక ప్లాటును నెల్లూరులోని రెడ్‌క్రాస్‌కు, మరో ప్లాట్‌ను తన అక్క భువనేశ్వరికి ఇవ్వాలని రాశారు. దువ్వూరులోని తన ఇంటిని మరో అక్క మంజులకు ఇవ్వాలని, తమ ఇంట్లోని 17 సవర్ల బంగారాన్ని చనిపోయిన పెద్దక్క పిల్లలకు ఇవ్వాలని కోరారు. అయితే చావులో కూడా తమ ఆస్తిలో కొంత రెడ్‌క్రాస్‌కు ఇవ్వాలని సామాజిక బాధ్యతగా మధుసూదన్‌రావు కుటుంబం తీసుకున్న నిర్ణయంపై బంధుమిత్రులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.

కలవరపడిన దువ్వూరు..
అందరితో కలివిడిగా ఉండే మధుసూదన్‌రావు కుటుంబం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో దువ్వూరు గ్రామం ఒక్కసారిగా కలవర పడింది. ఎన్నడూ ఎవరితోనూ వివాదాలు, మనస్పర్థలు లేని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడంపై గ్రామం మొత్తం విషాద వదనాలతో కనిపించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు ఏమి లేకపోయినా వారు ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను కలిచి వేసింది. వీరు ఆత్మహత్య చేసుకోవాలని తిరుపతిలోనే నిర్ణయించుకుని శనివారం దువ్వూరుకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. గూడూరు సబ్‌ డివిజన్‌ డీఎస్పీ గిరిధర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ దశరథరామారావు, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు, క్లూస్‌ టీం వివరాలు సేకరించారు.

చివరి శ్వాసలోనూ సేవా సంకల్పం
భావిభారత పౌరుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు తన కుటుంబంలో చీకట్లను నింపుకున్నారు. ఉన్నతమైన ఆదర్శమైన ‘గురువు’గా ఖ్యాతి గడించి విశ్రాంత జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఆస్తులకు కొదవ లేదు. అనుబంధాలకు కొరత లేదు. అంతకంటే ఆర్థిక సమస్యలూ లేవు. తాను కన్న బంగారు భవిష్యత్‌ కలలు కల్లలుగా మారడంతో మానసికంగా, శారీరకంగా కుంగిపోయారు. బతుకులు భారంగా వెళ్లదీస్తూ.. బంధాలను జ్ఞాపకాలుగా మిగుల్చుతూ.. మరణశయ్య ఎక్కారు. ఆ కుటుంబం అంతిమ నిర్ణయం.. అనంతమైన విషాదంగా మారింది. అంతిమ ప్రయాణంలోనూ తోబుట్టువులపై ఆప్యాయతలను వీలునామా రూపంలో కనబరిచారు. చివరి కోరికలతో కన్నీరు పెట్టించి.. బతుకులను ముగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement