మీరు మమ్మల్ని రద్దు చేస్తే.. మేం మీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం | Ration delivery vehicle drivers protest at Dharna Chowk in Vijayawada | Sakshi
Sakshi News home page

మీరు మమ్మల్ని రద్దు చేస్తే.. మేం మీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం

May 29 2025 2:09 AM | Updated on May 29 2025 2:28 AM

Ration delivery vehicle drivers protest at Dharna Chowk in Vijayawada

విజయవాడలో ధర్నాచౌక్‌లో రేషన్‌ డెలివరీ వాహనాల డ్రైవర్ల ఆగ్రహం

సాక్షి, అమరావతి: ‘‘మీరు మొబైల్‌ డెలివరీ యూనిట్‌ (ఎండీయూ) వ్యవస్థను రద్దు చేశారు. మాకు సమయం వచ్చినప్పుడు మీ ప్రభుత్వాన్ని మేం రద్దు చేస్తాం. నిండా మునిగిన మాకు చలేమిటి..? ఎండీయూలో 9,260 మంది వ్యక్తులం కాదు.. మా కుటుంబాలు, రేషన్‌ వాహనాల హె­ల్ప­ర్ల కుటుంబాలు..1.45 కోట్ల రేషన్‌ లబ్ధిదారుల కుటుంబాలున్నాయి. వైఎస్‌ జగన్‌ ఎండీయూల ద్వారా మాకు జీవనోపాధి కల్పిస్తే.. కూ­టమి ప్రభుత్వం జీవితాలను కూల్చేస్తోంది. 

వరదల్లో, వానల్లో, అమరావతి శంకుస్థాపనల్లో రేయింబ­వళ్లు పనిచేసిన మాకు రేషన్‌ వాహనాల రద్దును రి­టర్న్‌ గిఫ్ట్‌గా ఇచ్చింది’’ అంటూ రేషన్‌ డెలివరీ వాహనాల డ్రైవర్లు  మండిపడ్డారు. ఎండీయూల రద్దు నిర­్ణయానికి వ్యతిరేకంగా, పునరుద్ధరించాలని డి­మాండ్‌ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో మూడు రో­జుల శాంతియుత నిరసనల్లో భాగంగా నినదించారు.

ప్రభుత్వ సర్వేల్లోనూ రేషన్‌ సరఫరా వాహనాల వ్యవస్థ ఉండాలని ప్రజలు చెప్పారని, రాజ­కీయ కుట్రతో రద్దు చేశారని మండిపడ్డారు. సా­క్షాత్తూ సీఎం చంద్రబాబే 74 శాతం మంది ప్రజ­లు ఎండీయూలను కోరుకుంటున్నందున తాము ఏమీ చేయలేపోతున్నామని చెప్పినా.. ఎందుకు ఎత్తివేశారని నిలదీశారు. ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది. రేషన్‌ డెలివరీ వాహనాల వ్యవస్థ వచ్చాకే రేషన్‌ పంపిణీ 90 శాతానికి చేరింది. డీలర్లు ఇచ్చేటప్పుడు 64 శాతం కూడా ఉండేది కాదు. ఇంటి వద్దకే నాణ్య­మైన బియ్యం వెళ్తే ప్రజలు హాయిగా తీసుకున్నారు. 

పంపిణీ పెరగడాన్ని కూడా అక్రమ రవాణాతో ము­డిపెట్టేశారు. ఎండీయూలను రద్దు చేసి వాహనా­ల­ను ఊరికే ఇస్తున్నట్టు ప్రభుత్వం కలరింగ్‌ ఇస్తోంది. మేం కట్టిన 10 శాతం సొమ్మును మర్చిపోతోంది. ఇంతకాలం పనిచేసిన మేము 2027 జనవరి వరకు అగ్రిమెంట్‌ ప్రకారం పనిచేయలేమా? విజ­య­వాడ వరదల్లో రోజుకు రూ.1500 ఇస్తామని చెప్పి చేతులెత్తేశారు. వరద బాధితులకు ఒక రోజు జీతం కింద రూ.56 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తే.. మా సేవలు వాడుకుని బయటకు నెట్టేస్తారా. 

స్కూళ్లకు బియ్యం రవాణా చేసినందుకు కమీషన్లు రాలేదు. గత ప్రభుత్వం బీమా కడితే.. ఈ ప్రభుత్వం ఇవ్వబోమని చెప్పింది. 3 రోజుల్లో సానుకూల నిర్ణయం రాకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. మేం మాత్రమే కాదు.. ఉద్యోగాలు కోల్పోయిన వలంటీర్లతో పాటు ప్రతి ఒక్కరిని కలుపుకొని త్వరలో 26 జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడిస్తాం’’ అని ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ చెప్పారు.  

మా కడుపుపై కొట్టారు..
‘నేను, నా భార్య నెలంతా కష్టపడి పనిచేస్తే తప్ప ఇల్లు గడవదు. మాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. నా తల్లిదండ్రులు పెద్ద వయసు వారు కావడంతో ఏ పని చేయలేరు. ఎండీయూ వ్యవస్థను ఒక్క ప్రకటనతో ప్రభుత్వం రద్దు చేసి మమ్మల్ని రోడ్డుపైకి లాగేసింది. బీఎస్సీ స్టాటిస్టిక్స్‌ చేసిన నేను బ్యాంక్‌ జాబ్‌ కోసం ప్రయత్నిస్తున్నా. నెలలో నిర్దిష్ట సమయంలో రేషన్‌ పంపిణీ చేస్తూ.. ఖాళీ వేళల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నా. 

ఇప్పుడు జీవనోపాధితో పాటు జీవితంలో మరో మెట్టు ఎక్కే అవకాశం కూడా కోల్పోయాను. ఇక రోజంతా కూలీ పనికి వెళ్లాల్సిందే. మా అబ్బాయి స్కూల్‌కే ఏడాదికి రూ.25 వేలు ఫీజు కట్టాలి. నెలకు రూ.30 వేల వరకు ఇంటి ఖర్చు వస్తుంది. గత ప్రభుత్వంలో వాహన మిత్ర ద్వారా రూ.10 వేలు సాయం అందించడంతో ఇన్సూరెన్స్‌ ఖర్చులు తగ్గాయి. కూటమి ఏడాది పాలనలో ఒక్క పథకం కూడా మా దరిచేరలేదు’ –విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఆర్‌.నవీన్‌ ఆవేదన

బయట కూలీ పనులు కూడా దొరకట్లేదు
ఏ ప్రభుత్వమైనా ప్రజల పక్షాన ఆలోచించాలి. వాళ్ల జీవన ఉన్నతికి పనిచేయాలి. కూటమి సర్కారు మాత్రం మా ఉపాధిపై దెబ్బకొట్టింది. పదో తరగతి చదువుకున్న నేను గతంలో తాపీ పనులకు వెళ్లేవాడిని. ఎండీయూ వ్యవస్థ రావడంతో సొంత ఊరిలో గౌరవప్రద జీవితం పొందాను. నెలనెల ప్రభుత్వం నుంచి వేతనం వస్తుండడంతో బ్యాంకు లోన్‌ పెట్టుకుని అవసరమైన వసతులు సమకూర్చుకున్నాం. ఇప్పుడు నా ఉద్యోగం ఊడగొట్టారు. బయట చూస్తే పనులు కూడా సరిగా దొరకట్లేదు. 

నాతో పాటు నా ముగ్గురు బిడ్డల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. గతంలో అమ్మఒడి, వాహన మిత్ర, ఆసరా వంటి ఏదో ఒక పథకం మా ఇంటికి వచ్చేది. నా కష్టానికి తోడు ప్రభుత్వ ఆర్థిక సాయంతో కుటుంబాన్ని నిలబెట్టుకున్నా. గత ప్రభుత్వం మాతో ఇంటి వద్దకే రేషన్‌ పంపిస్తూ.. రేషనడీలర్లకు కమీషన్లు ఇవ్వలేదా? ప్రతిదీ రాజకీయ, ఆర్థిక కోణంలో చూస్తే పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోతారు. – హెచ్‌.నాగరాజు, వీర్లపాడు, ఎన్టీఆర్‌ జిల్లా

జీవితాలు తల్లకిందులు..
ఇద్దరు డీలర్లు చేయాల్సిన పనిని ఒక ఎండీయూ చేస్తున్నాడు. ఏజెన్సీల్లో 2 వేలమంది పైగా కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేయాలి. ఇద్దరు హెల్పర్లను పెట్టుకోవాలి. మా చేతికొచ్చే రూ.18 వేలతోనే ఇవన్నీ చేస్తున్నాం. కానీ, ఇదంతా ఏదో మాకు ఉచితంగా ఇస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. 

మా కష్టాన్ని చిన్నచూపు చూస్తూ.. డీలర్‌కు కూర్చోపెట్టి కమీషన్‌ ఇచ్చి.. డీలర్ల దగ్గరే ప్రజలను క్యూలైన్‌లో నిలబెట్టడాన్ని గొప్పగా చెబుతోంది. డీలర్‌ అద్దె తప్ప ఏం ఖర్చు ఉంటుంది. అక్కడ బియ్యం తీసుకోవడంలో కష్టమంతా ప్రజలదే కదా. క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ ఎండీయూ ఆపరేటర్‌గా అవకాశం వస్తే జీవితానికి భరోసా దొరికిందని భావించాను. ప్రభుత్వం మారడంతో మా జీవితాలే తల్లకిందులు అవుతాయని అనుకోలేదు. – జనార్దన్, ఇసుక తోడు గ్రామం, సీతమ్మధార

గిరిజనులను కిలోమీటర్లు నడిపిస్తారా?
మా గిరిజన ప్రాంతంలోని ఒక్కో రేషన్‌ డిపో పరిధిలో పదులకు పైగా గ్రామాలు ఉంటాయి. నా ఎండీయూ రెండు డిపోల్లో రేషన్‌ పంపిణీ చేస్తుంది. ఒక డిపోలో 34, మరోదాంట్లో 14 గ్రామాలున్నాయి. వెయ్యికార్డులు పైనే ఉన్నాయి. ఇవన్నీ డిపోలకు 15–20 కిలోమీటర్లు దూరం. ఎండీయూలను ఆపేయడంతో గిరిజనులు ప్రభుత్వం ఇచ్చే ఐదు కేజీల బియ్యం కోసం రోజంతా పనులు మానుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి వస్తుంది.

మేమైతే ముందు రోజు గిరిజనులకు చెప్పి వాళ్లు ఉండే సమయంలోనే వెళ్లి రేషన్‌ ఇచ్చేవాళ్లం. ఎండీయూ వ్యవస్థ ప్రజలతో పాటు నాలాంటి అనాథలకు ఆసరాగా నిలిచింది. నేను బీఏ బీఈడీ చేశాను. ఎండీయూ నడుపుకొంటూ డీఎస్సీకి సన్నద్ధం అవుతున్నాను. నాకు ఇది ఎంతో ఆర్థిక భరోసాగా నిలిచింది. ఇప్పుడు ఉపాధి పోవడంతో మళ్లీ వ్యవసాయ పనులకు వెళ్లాల్సిందే. – జి.భగత్‌రామ్, దుప్పిలివాడ, అల్లూరి సీతారామరాజు జిల్లా

మా సత్తా చూపిస్తాం..
నా పెద్ద బిడ్డ బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధ పడుతుంటే మమ్మల్ని చూసిన నాథుడు లేడు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో గోడు చెప్పుకొన్నాం. సాయంత్రానికి రూ.లక్ష ఆర్థిక సాయం ఇంటికి పంపించారు. మాలాంటి పేదల కోసమే అన్నట్టు.. అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్‌కు ఆరోగ్యశ్రీలో ఎంత ఖర్చయినా ఉచిత వైద్యాన్ని ప్రకటించారు. ఇప్పుడు నా బిడ్డ క్యాన్సర్‌ను జయించి.. సెంచూరియన్‌ వర్సిటీలో అనస్థీషియా మొదటి ఏడాది పూర్తి చేశాడు. 

హెవీ వెహికల్‌ డ్రైవర్‌గా పని చేసే నేను ఎండీయూ ఆపరేటర్‌గా సొంత వాహనానికి ఓనర్‌ అయ్యాను. నా కుటుంబంలో అమ్మఒడి వచ్చింది. డ్వాక్రా రుణమాఫీ జరిగింది. ఇళ్ల పట్టా ఇచ్చారు. సొంత ఊరిలో పేదలకు మేలు చేసే పథకంలో పనిచేస్తూ హాయిగా జీవిస్తున్నా. కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా మా ఉపాధిని తొలగించింది. ఈ వయసులో నేను మళ్లీ హెవీ వెహికల్‌ డ్రైవర్‌గా దూర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి. – బి.సత్యనారాయణ, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా 

Advertisement
 
Advertisement
Advertisement