Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. మత్స్యకారులకు వార్నింగ్‌

Rain Alert For Andhra Paresh - Sakshi

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్‌ జె. నివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారన్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి 45నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రం లోపలకు వేటకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని కలెక్టర్‌ నివాస్‌ సూచించారు. సముద్రంలో ఈతకు వెళ్లవద్దని సాగర తీర ప్రాంత వాసులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అల్ప పీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు ఒంగోలు, కడప, అనంతపూర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top