ఆ డబ్బు అడిగితే టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నేత వేమన సతీష్ చంపేస్తామంటున్నాడు
మీడియా సమావేశంలో రైల్వే కోడూరు టీడీపీ కార్యకర్త సుధామాధవి రోదన
సాక్షి,అమరావతి: రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తానని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నేత వేమన సతీష్ తన వద్ద రూ.7 కోట్లు తీసుకున్నారని టీడీపీ కార్యకర్త సుధామాధవి రోదించారు. జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌తో కలిసి శనివారం ఆ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆమె ఏమన్నారంటే..
‘‘నేను ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేశా. చంద్రబాబు సార్ జైల్లో ఉన్నప్పుడు 53 రోజుల పాటు నిరాహార దీక్ష చేశా. సొంత వాహనాలు పెట్టుకుని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరిగి బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతోపాటు టీడీపీ గెలవాలని కార్యక్రమాలు చేపట్టా.
నేను చేపట్టిన కార్యక్రమాలను దగ్గరగా గమనించిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నేత వేమన సతీష్ నా దగ్గరకు వచ్చి తనకు చంద్రబాబు సార్, లోకేశ్, భువనేశ్వరమ్మ బాగా తెలుసని, రైల్వే కోడూరు ఎమ్మెల్యే (టీడీపీ) టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికారు. దీంతో పెద్దలు సంపాదించిన ఆస్తులు అమ్మి.. తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి సీటు కోసం సతీష్ అన్నతో పాటు అతను సూచించిన వారికి పలుదఫాలుగా రూ.7 కోట్లు ఇచ్చాం. తీరా ఎన్నికల సమయానికి టికెట్ ఇవ్వలేదు.
ఈ విషయం తెలిసి మా గ్రామస్తులంతా టీడీపీ కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధపడినా.. నేనే వారిని సముదాయించి బాబు సార్ సీఎం కావాలని చెప్పాను. టికెట్ కోసం నేను ఇచి్చన డబ్బు ఇవ్వాలని కోరితే సతీష్ అన్న బెదిరించారు. మాకు జరిగిన అన్యాయం గురించి చెబుదామని టీడీపీ కార్యాలయానికి వెళితే నంబర్‌లేని కారులో నా భర్తను, నన్న తీసుకెళ్లిపోయారు.
మా పిల్లలు శ్రావణ్ సార్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పడంతో ఆయన కేసు పెట్టడం వల్ల మేము బయటకు వచ్చాం. డబ్బులు ఇవ్వాలని అడిగితే తనకు టీడీపీ పెద్దలందరూ తెలుసు అని ఫొటోలు చూపించడంతోపాటు తన మామ పోలీస్ ఆఫీసర్ అని డబ్బులు అడిగితే నన్ను, నా పిల్లలను చంపేస్తామని సతీష్, అతని అనుచరులు బెదిరిస్తున్నారు.’’ అని సుధా మాధవి కన్నీటి పర్యంతమయ్యారు.
విచారణ చేసి న్యాయం చేయండి
జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ మాట్లాడుతూ బాధితురాలు సుధామాధవి కుటుంబం ఎన్నికల ముందు నుంచి తనకు తెలుసని చెప్పారు. టికెట్, డబ్బు లావాదేవీలకు సంబంధించి సతీష్ పెట్టిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లు ఉన్నాయని వివరించారు. రూ.50 లక్షలు సతీష్‌కు చెందిన ఖాతాల్లో వేశారని, మరో రూ.50 లక్షలు ఆయన చెప్పిన వారి ఖాతాకు వేశారని చెప్పారు.
మరో 2.5 కోట్లు సతీష్ అనుచరులకు ఇచ్చేటప్పుడు వీడియోలు తీశారని వెల్లడించారు. సతీష్ పీఏకి దఫదఫాలుగా రూ.1.5 కోట్లు ఇచ్చేటప్పుడు కూడా వీడియోలు తీశారని తెలిపారు. ఇలా సతీష్ కు మొత్తం రూ. 7 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ చేయించి సుధామాధవి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్బందికర పరిస్థితిలో వారు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు? అని శ్రావణ్ ప్రశ్నించారు.
కుటుంబం రోడ్డున పడింది.. భర్త మంచాన పడ్డాడు
‘టికెట్ కోసం మొత్తం డబ్బు పోగొట్టుకున్నాం.. ఇల్లు లేదు.. రోడ్డున పడ్డాం. అనారోగ్యంతో నా భర్త మంచాన పడ్డాడు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. పార్టీ కోసం ఇంత కష్టపడిన మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. మాకు ప్రాణ రక్షణ కల్పించండి.. సతీష్ నుంచి మా డబ్బులు మాకు ఇప్పించండి చంద్రబాబు సార్.. మాకు జరిగిన అన్యాయం ఏ ఒక్క ఆడబిడ్డకు జరగకూడదు.
సతీష్ అన్నకు ఖాతాల్లో రూ.50 లక్షలు వేశాం. దానికి ఆధారాలు ఉన్నాయి. మిగిలినవి నగదు రూపంలో ఇచ్చాం. మాకు ఏం జరిగినా సతీష్ అన్నకే సంబంధం. సతీష్ ను మందలించి మా డబ్బులు మాకు ఇప్పించండి చంద్రబాబు సార్’ అని సుధామాధవి వేడుకున్నారు.


