పులివెందుల ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరగాలి | Pulivendula elections should be held freely and peacefully says High Court | Sakshi
Sakshi News home page

పులివెందుల ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరగాలి

Oct 31 2026 5:40 AM | Updated on Oct 31 2026 5:40 AM

Pulivendula elections should be held freely and peacefully says High Court

వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకోండి 

రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం 

తదుపరి విచారణ నవంబర్‌ 2కి వాయిదా 

ఎన్నికల సంఘం నిర్లిప్తతపై హైకోర్టులో అవినాశ్, ప్రమీలమ్మ పిటిషన్‌ 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా, పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా తగిన ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సమర్పించిన వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు శుక్రవా­రం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ వినతిపై తగిన నిర్ణయాన్ని వెలువరించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

2025లో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు, బయటి ప్రాంతాల నుంచి వచ్చి­­న వారు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని, ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ము­ని­సిపల్‌ ఎన్నికలు ప్ర­శాం­తంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కోరు­తూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవి­నాశ్‌­రెడ్డి ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చారు. అయితే ఎస్‌ఈసీ ఈ వినతి పత్రాన్ని జిల్లా ఎస్‌పీకి పంపి చేతులు దులుపుకుంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్లిప్తతను ప్రశ్నిస్తూ అవినాశ్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీలమ్మ శుక్రవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం వాదనలు వినిపించారు. 

జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో విధ్వంసమే పునరావృతమయ్యే అవకాశం 
2025లో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో  అధికార పార్టీ నేతలు విధ్వంసం సృష్టించారు. పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.  ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలలో కూడా అలాంటి పరిస్థితులే పునరావృతమయ్యే అవకాశం ఉంది. పులివెందుల మున్సిపాలిటీకి సంబంధం లేని ఇతర ప్రాంతాల రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా మున్సిపల్‌ పరిధిలోనే తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారు.

పులివెందుల మున్సిపాలిటీలోని సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లను గుర్తించి తగిన పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయాలి.  ఓటర్లను భయపెట్టకుండా, పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకోకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. పులివెందుల స్థానికులు కాని ఇతర ప్రాంతాల రాజకీయ నాయకులు, కార్యకర్తలు ప్రచారం ముగిసిన వెంటనే మున్సిపల్‌ సరిహద్దులను దాటి వెళ్లిపోయేలా ఆదేశాలు ఇవ్వాలి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద నిరంతర సీసీటీవీ నిఘా, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి.  – పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం వాదనలు    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement