బాదుడే బాదుడు | Prices of essential commodities have increased under Chandrababu Naidu rule | Sakshi
Sakshi News home page

బాదుడే బాదుడు

Oct 31 2026 5:17 AM | Updated on Oct 31 2026 5:17 AM

Prices of essential commodities have increased under Chandrababu Naidu rule

నారా పాలన.. నరులకు నరకయాతన 

పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో జనం గగ్గోలు

స్థానిక ఎన్నికల్లో ప్రధాన ప్రచారంగా మారిన ధరలు పెరుగుదల 

ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలను నిలదీసిన ఓటర్లు 

తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి భారీగా పెంచేశారంటూ ప్రశ్నల వర్షం 

కేజీ బియ్యం గతంలో రూ.56.. ఇప్పుడు రూ.95 

రూ.30 ఉన్న కేజీ పంచదార ఇప్పుడు రూ.65కు చేరిందని ఆవేదన 

కేజీ రూ.15 ఉన్న ఉల్లిపాయలు ఇప్పుడు రూ.80 దాటాయని ఆగ్రహం 

ఏడాది క్రితం రూ.825గా ఉన్న గ్యాస్‌ బండ ఇప్పుడు రూ.964 

బాబు అధికారంలోకి వచ్చాక రూ.109 నుంచి రూ.117కు పెరిగిన లీటరు పెట్రోల్‌ ధర 

ధరలు మండిపోతుంటే కార్పొరేట్లకు 99 పైసలకే భూములా అంటూ ప్రశ్నించిన ఓటర్లు 

తమ ఓటు హక్కుతో ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపుతామని హెచ్చరిక

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నా చంద్రబాబు సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. ఎక్కడికక్కడ ప్రభుత్వం మాఫియాకు మద్దతు పలుకుతుండటంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపించింది. కేజీ వంద రూపాయలు పెట్టి బియ్యం ఎలా కొనాలి.. ఏం తినాలంటూ అధికార పార్టీ నేతలను ఓటర్లు ఎక్కడికక్కడ నిలదీశారు. సార్వత్రిక ఎన్నికల్లో నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామంటూ ఊరు వాడా హామీ ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ధరల బాదుడుతో తమ నడ్డి విరిచిందంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అడ్డూ అదుపు లేకుండా బియ్యం మొదలు ఉల్లిపాయల వరకు.. పెట్రోల్‌ దగ్గర నుంచి వంట గ్యాస్‌ వరకు అన్ని వస్తువుల ధరలు చుక్కల్ని అంటుతున్నా, చంద్రబాబు సర్కారులో చలనం లేకపోవడంపై సామాన్యుడు రగలిపోతున్నాడు. రోజూ వంటలో వినియోగించే నూనెల దగ్గర నుంచి పప్పు దినుసులు, కూరగాయలు.. ఇలా అన్ని రకాల వస్తువులు దేశంలో కంటే మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయంటూ కేంద్ర గణాంకాలు ప్రతి వారం వెల్లడిస్తున్నా చంద్రబాబు సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదు.  

ప్రజలకు కేజీ బియ్యం రూ.100.. కార్పొరేట్లకు 99 పైసలకే భూములు 
ప్రజల కడుపుకొట్టి కార్పొరేట్లకు దోచి పెడుతున్న చంద్రబాబు సర్కారుపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. పేదలకు కడుపు నిండటానికి అవసరమైన బియ్యం కేజీ రూ.100కు చేరితే పట్టించుకోని చంద్రబాబు సర్కారు.. రూ.కోట్ల కోట్ల లాభాలు గడించే కార్పొరేట్లకు మాత్రం కేవలం 99 పైసలకే గంపగుత్తగా భూములు ఇవ్వడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నూనెలు, పçప్పుల ధరలు చుక్కలనంటుతూ నెల వారీ ఆదాయంలో ఆహార పదార్థాలకే అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోందని సామాన్య మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గడిచిన రెండు నెలల్లో బియ్యం ధరలు రెట్టింపు అవుతున్నా చంద్రబాబు సర్కారులో ఉలుకూ పలుకూ లేదు. కనీసం ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. గత ప్రభుత్వంలో రూ.1,400గా ఉన్న సన్నరకం పాత బియ్యం 25 కిలోల బస్తా ధర ఇప్పుడు రూ.2,375 దాటేసింది. కరువు పేరు చెప్పి సిండికేట్‌గా ఏర్పడిన మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ రిటైల్‌ మార్కెట్‌లో ధరలను పెంచేస్తుంటే చంద్రబాబు సర్కారు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోంది. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కానీ, ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్న మిల్లర్లపైగానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి. రోజువారీ తనిఖీల జోలికి పోవడం లేదు. మార్కెట్‌లో బియ్యం, ఇతర నిత్యావసరాల నిల్వలను పరిశీలించడం, కృత్రిమ కొరతను అరికట్టడం, మిల్లర్ల ధరల నిర్ణయ విధానాలను పర్యవేక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు మొక్కుబడి తంతుగా మారింది. స్థానిక ఎమ్మెల్యేల నుంచి ముఖ్య నేత వరకు భారీగా నెలవారీ ముడుపులు అందుతుండడం వల్లే ప్రభుత్వం ధరల పెరుగుదలను అరికట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. 

మంట పుట్టిస్తున్న ఉల్లి  
సామాన్యులకు ఉల్లిపాయ, టమాటా లేనిదే పూట గడవదు. అలాంటిది కోయకుండానే ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రూ.15గా ఉన్న ఉల్లి రేటు ఇప్పుడు కేజీ రూ.80 దాటడంతో కొనడానికే ప్రజలు భయపడిపోతున్నారు. టమాటా అయితే కొన్ని నెలలుగా రూ.55 దిగి రావడం లేదు. ఇక పాలు, కోడిగుడ్లు, కందిపప్పు, చికెన్, పంచదార ఇలా అన్నింటి ధరలు విపరీతంగా పెరిగి పోవడంతో మధ్య తరగతి ప్రజలు పెరిగిన బడ్జెట్‌తో అప్పులపాలవుతున్న పరిస్థితి. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత పాలు ధర లీటరుకు రూ.36పైనే పెరిగింది. 4.5 రూపాయ­లకు దొరికే కోడిగుడ్డు ఇప్పుడు రూ.8 దాటింది.

పంచదార కూడా కిలో రూ.30 నుంచి రూ.65కు పెరిగిపోయిందని జనం దుమ్మెత్తి పోస్తున్నారు. చివరకు కూరగాయల ధరలు కూడా సామాన్యు­లకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. బీ­న్స్, చిక్కుడు, బీరకాయ, కాకరకాయ ఇలా ఏ కూ­ర­గాయ ధర చూసినా మార్కెట్లో మండిపోతోంది. రోజు వారీ నిత్యావసర వస్తువులు భారీగా పెరి­గినా పట్టించుకోకుండా నీకింత నాకింత అంటూ రా­ష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్న వెన్నుపోటు పార్టీకి బ్యాలెట్‌ ద్వారా గట్టిగా సమాధానం చెప్తామంటూ ప్రజలు ఊరూరా హెచ్చరిస్తున్నారు.

దోచుకునేందుకు ఈ ప్రభుత్వం వచ్చిందా! 
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పేదల బతుకులు ఛిద్రమయ్యాయి. గతంలో 26 కిలోల బియ్యం బస్తా ధర రూ.1,400 ఉండగా ఇప్పుడు రూ.2,400 వెచ్చించాల్సి వస్తోంది. పప్పుల ధరలు కూడా భారీగా పెరిగాయి. కూరగాయల ధరలు ఎన్నడూ లేనివిధంగా కిలోకు రూ.60 నుంచి రూ.70 పెరిగాయి. ప్రజలను దోచుకునేందుకే కూటమి ప్రభుత్వం వచ్చిందా.. అనిపిస్తోంది. రోజురోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది.    – కాకర్లమూడి చంద్రకళ, గృహిణి, ఏలూరు

చాలా ఇబ్బంది పడుతున్నాం  
బియ్యం, పప్పుల ధరలు దారుణంగా పెరిగిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. కుటుంబ జీవనం కష్టంగా మారింది. అన్నింటి ధరలు పెరిగిపోతే పేదలు బతికేదెలా? రేషన్‌ షాపుల్లో తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందించాలి. బియ్యం ధరలు చూస్తే భయమేస్తోంది. ఈ ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. చేస్తున్నది మరొకటి.  – కె.కృష్ణవేణి, కొండేపూడి, పాలకోడేరు మండలం, పశ్చిమగోదావరి జిల్లా  

సరకులు కొనాలంటే అప్పులు చేయాల్సిందే.. 
బియ్యం 26 కిలోల బస్తా ధర రెట్టింపు అయ్యింది. నూనె ధరలు కిలోకు రూ.60 వరకు పెరిగింది. దీంతో కూరలు వండుకునే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. నిత్యం ఉపయోగించే టమాట, ఉల్లిపాయల ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. పనులు లేకపోవటంతో ఒకపూట కూర, మరోపూట పచ్చడితో గడపాల్సి వస్తోంది. అన్ని సరకులు కొందామంటే అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరలు అదుపు చేయలేకపోతున్నారు.. ఇదేమి ప్రభుత్వం? – పి.శ్రీలక్ష్మీకాంతం, గృహిణి, అన్నవరప్పాడు, పెరవలి మండలం, తూర్పుగోదావరి జిల్లా

పేదల జీవనం దారుణం 
పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. రెక్కాడితే గాని డొక్కాడని పేదల జీవనం దయనీయంగా తయారైంది. గత రెండేళ్ల నుంచి విపరీతంగా కూరగాయలు, వంట నూనెలు, ఇంటి సరుకుల ధరలు పెరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. బియ్యం కేజీ రూ.100 పైన పలుకుతోంది. ఇలాగైతే మాలాంటి కూలి చేసుకునే వారి పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే ప్రయత్నం చేయాలి.  – సుభద్రమ్మ, గృహిణి, తిరుపతి

వామ్మో! నారా చంద్రబాబు పాలనలో ధరలు చూస్తే షాక్‌ 
కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇలా అన్ని ఛార్జీలు, ధరల పెంపుతో బాదుడే బాదుడు 
‘ఎక్స్‌’లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పోస్టు 
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి, ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. విద్యుత్‌ ఛార్జీలు అమాంతం పెంచేశారు. ఇలా అన్నింటి ధరల పెరుగుదలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. 

‘‘వామ్మో నారా చంద్రబాబు పాలనలో ధరలు చూస్తే షాక్‌ కొడుతున్నాయి. గ్యాస్‌ బండ రేటు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇలా అన్ని ఛార్జీలు, ధరల పెంపుతో బాదుడే బాదుడు’’ అని పోస్టు చేశారు. 2024లో తన పాలనలో ధరలు, 2026లో కూటమి ప్రభుత్వంలో ధరల పెరుగుదలతో కూడిన ఓ పట్టికను వైఎస్‌ జగన్‌ ఆ పోస్టుతో జత చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement