స్థానిక ఎన్నికల్లో తొలి డోసు ఇవ్వాలని ఉద్యోగ వర్గాలకు ఏపీ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి పిలుపు
చంద్రబాబు పాలన(చంపా) ఓ వైరస్‌లా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది
ఇది కరోనా కంటే వంద రెట్లు భయంకరమైనది
రాష్ట్ర ప్రజలను, ఉద్యోగులను పట్టి పీడిస్తోంది
చంపా వైరస్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది
సాక్షి,అమరావతి: ‘రాష్ట్రంలోని ఉద్యోగులారా మేలుకోండి.. ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కూటమి సర్కార్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పండి.. అని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. చంపా వైరస్ (చంద్రబాబు పాలన)కు మీ ఓటే వ్యాక్సిన్ అని స్పష్టం చేశారు. చంపా ఒక వైరస్‌లా మారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను భయంకరంగా పీడిస్తోందని చెప్పారు.
ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చంపా వైరస్ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పూర్తిగా పడిపోయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మీ ఓటు చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా వేయడం ద్వారా చంపా వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చని సూచించారు. మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో మీ ఓటు ద్వారా చంపా వైరస్‌కు మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వాలని ఉద్యోగులను కోరుతున్నట్లు చెప్పారు. చంపా వైరస్ వల్ల ఒక్కో ఉద్యోగికి ఎంత నష్టం జరిగిందో లెక్కగట్టి ఒక పట్టిక రూపొందించినట్లు తెలిపారు. బేసిక్ పే బట్టి ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవచ్చన్నారు. ఈ విషయం గుర్తు పెట్టుకుని ఓటు వేయాలని చేతులు జోడించి కోరుతున్నట్లు వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
కరోనాలోనూ 27 శాతం ఐఆర్ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చింది. కానీ చంపా వైరస్ వచ్చాక గత 28 నెలలుగా ఉద్యోగులకు ఐఆర్ లేదు. గత ప్రభుత్వం ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేసింది. చంపా వైరస్ వచ్చాక స్థానిక ఎన్నికలలో ఓట్ల కోసం 27 నెలల తర్వాత ఇపుడు పీఆర్‌సీ కమిషన్ వేశారు. అది రిపోర్ట్ ఇచ్చేది ఎప్పడు? ఉద్యోగులకు పీఆర్‌సీ వచ్చేది ఎప్పడు?
గత ప్రభుత్వం ఉద్యోగులకు డీఏలు పెండింగ్ పెట్టకుండా అన్నీ ఇచ్చింది. ఐదేళ్లలో గత ప్రభుత్వం 11 డీఏలు ఇచ్చింది. కానీ చంపా వైరస్ వచ్చాక 5 డీఏలు పెండింగ్‌లో పడ్డాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఓట్ల కోసం డీఏలు ఇచ్చారు. ఇంకా 3 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. చంపా వైరస్ వచ్చాక ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకు చేరుకున్నాయి.
జీపీఎస్ పక్కన పెట్టారు..
కోవిడ్ లాంటి ఇబ్బందులున్నా గత ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ ఇచ్చేలా జీపీఎస్ విధానం తెచ్చింది. అది బాగుందని కేంద్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో యూపీఎస్ విధానం తీసుకొచ్చింది. చంపా వైరస్ వచ్చాక జీపీఎస్ అమలు చేయకుండా పక్కన పెట్టారు. గత ప్రభుత్వం కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. చంపా వైరస్ వచ్చాక 2.7 లక్షల మంది వలంటీర్లు, 27 వేల మంది ఎండీయూ ఆపరేటర్లు, 12 వేల మంది ఎక్సైజ్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు.
గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చట్టం చేసి సుమారు 4,500 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేసింది. చంపా వైరస్ వచ్చాక కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఆగిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మాట ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి వారి జీవితాలలో వెలుగులు నింపింది. చంపా వైరస్ వచ్చాక ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తోంది. ఇప్పటికే 15 డిపోలు ప్రైవేట్‌కు అప్పగించింది
బాబు రూపాయైనా జీతం పెంచలేదు
వైఎస్ జగన్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు జీతం రూ.3 వేల నుంచి రూ.10 వేలు పెంచింది. శానిటేషన్ వర్కర్లకు రూ.18 వేలు పెంచింది. చంపా వైరస్ వచ్చాక ఆశా వర్కర్లకు గానీ శానిటేషన్ వర్కర్లకు గానీ ఒక్క రూపాయి జీతం పెరగలేదు. జగన్ ప్రభుత్వం వెలుగు ఎన్యుమరేటర్లకు జీతం రూ.3 వేల నుంచి రూ.8 వేలకు పెంచింది. హోంగార్డులకు, సమగ్రశిక్ష ఉద్యోగులకు, అంగన్‌వాడీలకు జీతాలు పెంచింది. చంపా వైరస్ వచ్చాక వెలుగు ఎన్యుమరేటర్లకు, హోంగార్డులకు, సమగ్రశిక్ష ఉద్యోగులకు, అంగన్ వాడీలకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు
టార్చర్ భరించలేక ఉద్యోగుల ఆత్మహత్యలు..
కరోనా సమయంలో వైరస్ సోకి అనారోగ్యంతో ఉద్యోగులు మరణించారు. కానీ చంపా వైరస్ వచ్చాక ప్రభుత్వ టార్చర్ భరించలేక మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు, హార్ట్ ఎటాక్‌లతో ఉద్యోగులు చనిపోయారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లేవు, మనశ్శాంతి లేదు, గౌరవం లేదు. సీనియర్ ఐపీఎస్లపైనే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. ఉద్యోగులను ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న చంపా వైరస్‌ను ఎంత త్వరగా తరిమి కొడితే అంత త్వరగా రాష్ట్రం బాగుపడుతుంది.
మొదటి డోసు వ్యాక్సిన్.. రేపటి స్థానిక ఎన్నికలే
చంపా వైరస్‌ను నిర్మూలించే వ్యాక్సిన్ మన చేతుల్లోనే ఉంది. మన ఓటే.. చంపా వైరస్‌ను కట్టడి చేసే బలమైన వాక్సిన్. కరోనా నియంత్రణకు రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లే.. చంపా వైరస్‌ను నిర్మూలించడానికి రెండు డోసుల వ్యాక్సిన్ అవసరం. రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు వేసే ఓటే చంపా వైరస్‌కు మొదటి డోసు వ్యాక్సిన్. చంపా వైరస్‌కు రెండో డోసు 2029 ఎన్నికలలో మీరు వేసే ఓటు. స్థానిక సంస్థల ఎన్నికలలో మీ ఓటు చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా వేయడం ద్వారా చంపా వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.


