‘కాపులను అడ్డుపెట్టి కుట్ర రాజకీయాలు’

Politics Of Conspiracies Obstructing The Kapus Adapa Seshu - Sakshi

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ శేషు

సాక్షి, అమరావతి: కాపులను అడ్డుపె­ట్టుకుని మరోసారి కుట్ర రాజకీయాలకు ప్రయత్నాలు జరుగు­తున్నాయని, కాపు­లను మోసం చేసిన చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషగిరి (శేషు) విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాపులను మళ్లీ రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి, వారిని ఇబ్బందుల్లోకి నెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. చంద్రబాబు కుట్రలకు పవన్‌ తోడ్పాటునందిస్తున్నారని ఆరోపించారు. రంగాను టీడీపీ వాళ్లే హత్య చేయించారని తన పుస్తకంలో రాసిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఇప్పుడు కాపు జాతిని రెచ్చగొట్టేలా దీక్షకు దిగడం బాధాకరమన్నారు.

87 ఏళ్ల జోగయ్యతో పథకం ప్రకారం దీక్ష చేయిస్తున్నది ఎవరని అనుమానం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమం చేసినప్పుడు పవన్, జోగయ్య, జీవీఎల్‌ ఎక్కడున్నారని నిలదీశారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం తన చేతిలో లేని పని అని, వారికి ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సాహం అందిస్తానని కిర్లంపూడి సభలో ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఇచ్చిన మాటకు కట్టుబడి కాపుల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కాపుల సంక్షేమానికి రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తే సీఎం వైఎస్‌ జగన్‌ మూడున్నరేళ్లలోనే రూ.1,500 కోట్లు ఖర్చు చేశారన్నారు. బాబు పాలనలో జన్మభూమి కమిటీలు సిఫారసు చేస్తే పథకాలు అందేవని, సీఎం వైఎస్‌ జగన్‌ కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, చంద్రబాబు ఇద్దరిలో కాపులకు నిజమైన మేలు చేసింది ఎవరో బహిరంగ చర్చలకు తాను సిద్ధమని అడపా శేషు సవాల్‌ విసిరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top