పవన్‌ పోలవరం పర్యటనలో ఉద్రిక్తత | Polavaram Roads Protest Deputy CM Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ పోలవరం పర్యటనలో ఉద్రిక్తత

Nov 24 2025 3:47 PM | Updated on Nov 24 2025 4:06 PM

Polavaram Roads Protest Deputy CM Pawan Kalyan

సాక్షి, ఏలూరు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (AP Deputy CM Pawan Kalyan) పోలవరం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోందని.. త్వరగా బాగు చేయించాలని పవన్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం స్థానికులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 

రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని.. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవపోవడంతో నేరుగా పవన్‌ దృష్టికే సమస్యను తీసుకెళ్లాలని స్థానికులు భావించారు. ఈ క్రమంలోనే కొందరు స్కూల్‌ చిన్నారులతో కలిసి తల్లిదండ్రులను నిరసకు దిగారు. అయితే.. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు తోసేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

గెలిచాక తమ సమస్యలు గాలికి వదిలేశారని.. రోడ్ల సమస్యను విన్నవించేందుకు వస్తే అడ్డుకుంటున్నారని స్థానికులు ఈ సందర్బంగా పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాలకు ఆంబులెన్స్‌లు కూడా రావడం లేదంటూ పలువురు మీడియా ఎదుట వాపోయారు. 

వీటిని రోడ్లంటారా?
కొయ్యలగూడెం మండలం గవరవరం నుండి యర్రంపేట ప్రయాణించే రోడ్లు దారుణంగా పాడైపోయాయి. గవరవరం, కృష్ణం పాలెం,ఏడు వాడల పాలెం, గంగన్నగూడెం, గొల్లగూడెం, యర్రం పేట గ్రామాల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. సమస్యను స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకెళ్తున్నా.. ఆయన ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా గత ప్రభుత్వంపై నిందమోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌ దృష్టికే సమస్య తీసుకెళ్లాలని భావించారు. ‘‘జనసేన పార్టీ పదవుల కోసమే కాదు.. పని కూడా చేయడం.. అవసరమైతే ప్రశ్నించడం కూడా’’ అని స్థానికులు ఆందోళన బాట పట్టారు. 

అక్కడా అడ్డుకున్న పోలీసులు
ఇటు తూర్పుగోదావరి జిల్లాలోనూ పవన్‌ను నిరసన సెగ తప్పలేదు. ఆయన రాక గురించి తెలిసిన సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు  రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుని నిరసనకు దిగారు. తమకు 20 నెలల జీతాలు చెల్లించడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. 

బూతులు తిట్టుకున్న తమ్ముళ్లు.. 
పవన్‌ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. విమానాశ్రయంలో పవన్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌గా ఉన్న పెందుర్తి వెంకటేశ్ వర్గీయులు, రాజానగరం టీడీపీ నియోజవర్గ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయులు వచ్చారు. అయితే.. రాజానగర్ టీడీపీ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణను అనుమతించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీఎం ప్రోగ్రాం కమిటీ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్‌ను ఎలా అనుమతించారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం వాగ్విదానికి దిగాయి. బూతులు తిట్టుకోవడమే కాకుండా కొట్టుకునే స్థాయికి రెండు వర్గాల నేతలు వెళ్లారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల నేతలను విడదీయడంతో పరిస్థితి సర్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement