సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురంలో ఎక్సైజ్ శాఖ చర్యలపై తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. స్థానిక మద్యం వ్యాపారి ప్రశాంత్ గౌడ్‌పై అక్రమంగా కేసు నమోదు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్రమ కేసు పెడుతున్నామంటూ బహిరంగంగా ప్రకటించి మరీ ఆయన్ని అదుపులోకి తీసుకోవడాన్ని రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి.
ప్రశాంత్ గౌడ్‌ను కొన్ని రోజులుగా స్థానిక టీడీపీ నేతలు బెదిరిస్తూ, మద్యం షాపును తమకు అప్పగించాలని ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ కావడం గమనార్హం. అంతేకాదు.. కేసు నమోదు సమయంలో “నీపై అక్రమ కేసు పెడుతున్నాం.. నన్ను క్షమించు” అని ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య అన్నారని ప్రశాంత్ గౌడ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
టీడీపీ నాయకుల ఒత్తిడితోనే పోలీసులు ఈ కేసు పెట్టారని వైఎస్సార్ సీపీ వర్గాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. హిందూపురం శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, స్థానిక టీడీపీ నేతల బరితెగింపు పెరిగిందని వైఎస్సార్‌సీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ తీరును హిందూపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దీపిక, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తప్పుబట్టారు. టీడీపీ నేతల సూచన మేరకు అక్రమ కేసులు నమోదు చేయడం విచారకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ గౌడ్‌పై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.


