సాక్షి, ఎన్టీఆర్: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో జూన్ 18వ తేదీన ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే వెరికోస్ వెయిన్స్‌తో బాధపడుతున్న ఆయన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆయన అరోగ్య స్థితిపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మొదటి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వాదిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఆస్తులను ఎటాచ్ చేయాలని జరుగుతున్న ప్రయత్నాలను ఖండిస్తూ ఆయన జడ్జి ఎదుట వాపోయారు కూడా.
‘‘నేను లిక్కర్ వ్యాపారం చేయలేదు. ఒక్క రూపాయి కూడా లిక్కర్ నుంచి సంపాదించలేదు. రియాల్ ఎస్టేట్ చేసి నేను సంపాదించుకున్నా. లిక్కర్ స్కాం కేసుతో నాకు ప్రమేయం లేదు. నా కుటుంబం అంతా మద్యం కేసు వల్ల చిన్నాభిన్నం అయ్యింది. వందల ఏళ్ల నుంచి సంక్రమించిన ఆస్తులను అటాచ్‌మెంచ్‌లోకి తెవడం ధర్మం కాదు. నేను కష్టపడి సంపాదించిన వాటిని లిక్కర్ ద్వారా సంపాదించానని చెప్తున్నారు. నేను మీకు ఇప్పుడు చెప్పకపోతే నేను నిజంగా తప్పు చేశాననుకుంటారు. నిజం ఏంటీ అనేది ప్రజల్లోకి వెళ్లాలి. మీకు తెలియాలి. కూటమి ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు నన్ను జైల్లో పెట్టినా నాకు భయం లేదు. ఎన్ని రోజులు అయినా జైల్లో ఉంటాను అని ఆవేదన వ్యక్తం చేశారాయన.


