కాపు కార్పొరేషన్ రుణాల పరిస్థితి ఏమిటి?
కూటమి ప్రభుత్వంలో జనసైనికులకు ఒరిగిందేమీ లేదు
అమరావతి మునిగిపోయే ప్లేస్.. అక్కడికి ఒక్క పరిశ్రమా రాదు
వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అంటున్నారు.. ఆంధ్రాలో రోడ్లన్నీ గోతులమయం
సోషల్ మీడియా వచ్చింది.. ఎల్లో మీడియాను జనం నమ్మరు
పోలవరం జనసేన నాయకుడు బల్లె మురళి సెల్ఫీ వీడియోలు వైరల్
జంగారెడ్డిగూడెం: సీఎంచంద్రబాబు పాలనను ఎండగడుతూ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన నాయకుడు బల్లె మురళికి సంబంధి రెండు సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు, కాపు కార్పొరేషన్‌కు నిధులుండవు కానీ, ఎన్టీఆర్ విగ్రహానికి ఉంటాయా? చంద్రబాబు వైఖరి మార్చుకుంటే చాలా మంచిది. సోషల్ మీడియా వచ్చింది. ఎల్లో మీడియాను నమ్మరు. మీరు చెప్పే అబద్ధాలు, నిర్లక్ష్యాన్ని సహించే పరిస్థితి లేదు. మాలాంటి వారితో జనసేనలో మార్పు మొదలైంది’ అంటూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘రూ.1,700 కోట్లతో ఎర్టీఆర్ విగ్రహం పెడతారంట. ప్రభుత్వ నిర్ణయం ఘోరాతి ఘోరం. దీన్ని జనసైనికులంతా వ్యతిరేకించాలి.
పవన్‌కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల్లో కాపు యువత సొంత డబ్బు రూ.లక్ష–రూ.2 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు కాపు కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తారేమో అని చూస్తున్నారు. కార్యకర్తలు రాకుండా పార్టీ ఆఫీస్‌కు తాళం వేశారు. ఈ ప్రభుత్వంలో జన సైనికులకు ఒరిగింది ఏమీ లేదు. అమరావతి సెల్ఫ్ ఫండ్ ప్రాజెక్టు, టీడీపీ సెల్ఫ్ ఫండ్ పార్టీ అన్నారు కదా. ఎర్టీఆర్ విగ్రహం కూడా అలాగే కట్టండి. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ (యూకే) అన్నీ మా చేతుల్లో ఉన్నాయని చెప్పుకొనే టీడీపీ వారు ఎర్టీఆర్ విగ్రహాన్ని ప్రజల సొమ్ముతో కట్టడం ఏంటి? చంద్రబాబు హైదరాబాద్ కట్టేశాడంట.. అమరావతి కట్టలేకపోతున్నాడు. అది మునిగిపోయే ప్లేస్. అట్టర్ ఫ్లాప్. ఒక్క పరిశ్రమ రాదు. వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అంటున్నారు. ఆంధ్రాలో రోడ్లన్నీ గోతులమయం.
పవన్.. మీరు చంద్రబాబుకు చేసే భజన చూసి సిగ్గుపడుతున్నాం. ఇంత దిగజారతామా?’ అని మురళి ధ్వజమెత్తారు. మొదటి వీడియో సంచలనంగా మారడంతో రెండో వీడియో విడుదల చేశారు. ‘ఎర్టీఆర్ విగ్రహం ప్రజల సొమ్ముతో కట్టడానికి జనసేన వ్యతిరేకం. దీనిపై సోషల్ మీడియాలో నన్ను తిడుతున్నారు. నా నంబర్ ఉంది. దమ్ముంటే కాల్ చేయండి. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఒక్కొక్కడి చర్మం తీస్తా. వైఎస్ జగన్‌కు భయపడి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ వారు పారిపోయారు. అప్పుడు పోటీ చేసింది జనసేన. మేం లేకపోతే మిమ్మల్ని జగన్ ఆడుకుంటారు. కానీ, మీరు పదవిలోకి వచ్చాక జనసేనను జీరో చేయాలని చూస్తున్నారు. కాపు కార్పొరేషన్ నిధులు ఆపేశారు. ఇది టీడీపీ చేస్తున్న తప్పు’ అని పేర్కొన్నారు.


