సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో భక్తురాలు అత్యుత్సాహం ప్రదర్శించింది. కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసింది. దీంతోహుండీలో నోట్లకు నిప్పు అంటుకుంది. శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో ఘటన జరిగింది. హుండీ నుండి పొగలు రావడాన్ని గమనించిన ఆలయ సిబ్బంది.. నీళ్లు పోసి మంటల్ని ఆర్పివేశారు. కాలిన నోట్లను వేరు చేసిన సిబ్బంది.. నోట్లను హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టారు.
శృంగార వల్లభస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకోవడానికి ఆలయానికి తరలివచ్చారు. సుమారు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు.
ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,45,750, అన్నదాన విరాళాలకు రూ.78,315, కేశ ఖండన ద్వారా రూ.5,920, తులాభారం ద్వారా రూ.450, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.29,895లతో రూ.3,60,330 ఆదాయం వచ్చిందని చెప్పారు. 4,200 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. దేవస్తాన సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.



