‘చంద్రబాబు ముఖంలో మార్పు వచ్చింది.. మారిన మనిషంటూ జనాన్ని నమ్మించి, గ్యారెంటీ బాండ్లని చేతిలో పెడితే.. మురిసిపోయి ఓట్లేసినందుకు మన బతుకులు బస్టాండ్ అయ్యాయి మామా!’ అంటూ బద్వేలు నియోజకవర్గం కలసపాడు పీర్ల చావిడి రచ్చబండ కాడ కూర్చుని జనం కూటమి సర్కార్‌ను ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఏ ఒక్క పథకం డబ్బులు అకౌంట్లలో పడకపోగా, నిబంధనల పోట్లతో ఉన్న పథకాలకు తూట్లు పొడుస్తున్న చందాన సాగుతున్న అరాచక పాలనపై పల్లెల్లో జనం తిరగబడుతున్నారు.
ఇటీవల ఊర్లో శుభకార్యానికి హైదరాబాద్ నుంచి వచ్చిన రామచంద్రుడిని చూసి రచ్చబండ కాడ ఉన్న వెంకన్న పలకరించాడు. ‘ఏమిరా రామచంద్రా! ఎట్లుంది హైదరాబాద్‌ల నీ ఉద్యోగం? జీతం బాగానే ఇస్తున్నారా, ఏమన్నా ఎనకేస్తున్నావా? బంగ్లాలు, ఇండ్లు ఏమన్నా కట్టినావా సామీ?’ అని గుక్కతిప్పుకోకుండా అడిగేశాడు.దానికి రామచంద్రుడు నిట్టూరుస్తూ.. ‘ఏం సరిపోతాదిలే మామా! జీతాలు చూస్తే అణాపైసలు.. ఖర్చులు చూస్తే కొండంత! ఏది ముట్టుకున్నా రేట్లు సెగలు పుట్టిస్తున్నాయి. అంత సీన్ ఉంటే పిల్లోలను ఊర్ల ముసలోళ్ల కాడ ఎందుకు వదిలిపోతా? నా సామిరంగా.. ఈ రెండేళ్ల నుంచి నడ్డి విరిగిపోతాంది మామా! వెనకటికి మన జగనన్న సీఎంగా ఉన్నప్పుడు మనకు ‘వైఎస్‌ఆర్ ఆసరా’, ‘సున్నా వడ్డీ రుణాలు’ టైమ్‌కు వచ్చేవి. ఏడాదికి రూ.18 వేలకు పైగా ఒకేసారి చేతికొస్తే ఆడోళ్లు పొదుపుగా దాచుకునేవాళ్లు.
పిల్లకు ‘అమ్మ ఒడి’ వచ్చేది, పెద్ద పిల్లోనికి ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ వచ్చేది. ఇంటి పెద్దన్నగా జగనన్నే ఉండి ఆదుకునేటోడు. ఆ డబ్బులతో పిల్లల చదువులే కాకుండా ఇంట్లో ముసల్లోళ్ల వంటా వార్పుకు కూడా సాయపడేవి. ఊర్లో ఉపాధి పనులు ఉండి కూలి గిట్టుబాటయ్యేది. దాంతో పండగలకు మేం కూడా ఎంతో సంతోషంగా ఊరికొచ్చేవాళ్లం. కానీ ఇప్పుడేమైందో ఏమో గానీ.. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ‘తల్లికి వందనం’ పోయింది, ‘వైఎస్‌ఆర్ ఆసరా’ పోయింది, ‘సున్నా వడ్డీ’ కూడా పోయింది! ఇక కడప దగ్గర్లో ఇంజినీరింగ్ చదువుతున్న నా కొడుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదని కాలేజీ వాడు రూ.75 వేలు కట్టమన్నాడు, లేకుంటే పరీక్షలు రాయనీయమన్నారట! చేసేది లేక నీ కూతురు పుస్తెల గొలుసు, ఇంకొన్ని చిన్న చిన్న వెండి సొమ్ములు ఉంటే బ్యాంకులో తాకట్టు పెట్టి ఫీజు కట్టినాం మామా..
జగనన్న ఉన్నప్పుడు ఇట్టాంటి తిప్పలు అస్సలు ఉండకపోయేవి, హాయిగా నిద్రపోయేవాళ్లం. మన బావమరిది కూడా అప్పట్లో ‘రైతుభరోసా’ డబ్బులతో హాయిగా వ్యవసాయం చేసుకునేటోడు. ఇప్పుడు వాడికీ వ్యవసాయంలో తీరని నష్టాలు వచ్చాయట. ఈసారి యూరియా దొరక్క వాడు వేసిన మొక్కజొన్న పంట అంతా ఎండిపోయిందట, వాడు కూడా దిగాలుగా కూర్చున్నాడు. ఏదో పిల్లలను, ముసల్లోళ్లను చూద్దామని ఆశగా ఊరికొస్తే.. ఇక్కడ ఎవరి ముఖంలోనూ సంతోషమనేదే కనిపిస్తలేదు మామా..!’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అక్కడే కూర్చుని ఉన్న యుగంధర్ మాటలో మాట కలిపాడు. ‘నిజమేరా రామచంద్రా..! మా అన్న భార్యకు గతంలో ‘వైఎస్‌ఆర్ ఆసరా’, ‘సున్నా వడ్డీ’ డబ్బులు చక్కగా వచ్చేవి. ఇప్పుడు అవేవీ రావడం లేదు. మా అన్న పాడెక్కి ఏడాది కావస్తోంది. ఇంతవరకు నా వదినకు వితంతు పింఛన్ ఇవ్వలేదు! 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్న చంద్రబాబు.. వితంతువులను ఇలా నడిరోడ్డున పడేశాడు. మేం గ్రామ పెద్దను తీసుకుని సచివాలయానికి వెళ్తే.. ‘మీ అన్నకు ఇదివరకు పింఛన్ లేదు కాబట్టి, మీ వదినకు కొత్త పింఛన్ రాదు’ అని సాకులు చెప్తున్నారు. ఏం చేయాలో తెలియక నా వదిన కూలి పనులకు వెళ్లి బతుకీడుస్తోంది.గతంలో ఆమె కొడుక్కి వాలంటీర్ ఉద్యోగం ఉండేది. నెలకు రూ.5 వేలు వస్తే ఇల్లు గడిచేది.
ఇప్పుడా ఉద్యోగం లేదు, వాడు కూడా రోడ్డున పడ్డాడు. అటు ఉద్యోగమూ లేదు, ఇటు నిరుద్యోగ భృతీ లేదు. జాబ్ క్యాలెండర్ రాకపోయే సరికి వాడు బతుకుదెరువు కోసం పట్టణం వెళ్లిపోయాడు. ఈ పండుగకు కూడా వాడు ఊరికి రాలేదు. ఇక్కడేమో నా వదిన మంచం పట్టింది. ఏందిరా రామచంద్రా..! ఇప్పుడు ఊర్లో రేషన్ కార్డు కావాలన్నా జన్మభూమి కమిటీ నాయకుల కాళ్లు పట్టుకోవాలి. పిల్లల చదువుల కోసం ‘ఇ.డబ్ల్యూ.ఎస్’ సర్టిఫికెట్ కావాలన్నా నెలల తరబడి ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రెండేళ్లకే ఎంత దారుణమైన మార్పు వచ్చిందిరా అబ్బా! నాడు సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు.. ఇప్పుడు మాయమాటలు చెప్పి మనందరికీ వెన్నుపోటు పొడిచాడు! పాలిచ్చే బర్రెను కాదనుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకుని ఇంట్లో కట్టేసుకున్నాం. ఇదేం కర్మరా రామా.. రెండేళ్లలోనే ఇట్లయిపాయె!’ అంటూ యుగంధర్ నిట్టూర్చాడు.
అక్కడే కూర్చుని అన్నీ వింటున్న శ్రీకాంత్ ఒక్కసారిగా నోరు తెరిచి.. ‘నిజమేరా బావా..! జగనన్న పాలనలో మాకు కుట్టుపని నిమిత్తం ప్రతి ఏడాది రూ. 10 వేలు ‘జగనన్న చేదోడు’ పథకం కింద ఇచ్చేటోళ్లు. ఇప్పుడవి రాకుండా పోయాయి. ఊర్లో ఎక్కడైనా బతుకుదామన్నా అసలు పనే దొరకడం లేదు. చేసేది లేక కట్టుకున్న భార్యను, పిల్లలను, ముసలోళ్లను ఊర్లోనే వదిలేసి, బతుకుదెరువు కోసం హైదరాబాద్ పోయి దొరికిన కాడ కమిషన్‌కు బట్టలు కుడుతున్నా. ఓటు ఈ మోసగానికి వేసి పెద్ద తప్పు చేశామా అనిపిస్తోంది’ అని ఆవేదన చెందాడు. రాజశేఖర్ ఏకబిగిన అందుకొని.. ‘చంద్రబాబు పాలన అంతా ఉత్తుత్తిదేరా అబ్బా..! జనాన్ని నమ్మించడం, ఓట్లు దండుకొని మోసం చేయడం ఎలాగో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఇటు నిరుద్యోగ భృతి లేదు, అటు సూపర్ సిక్స్ హామీల అమలు అంతంతమాత్రమే.
పేద పిల్లలు డాక్టర్లు కావాలని జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ఈ కూటమి సర్కార్ ప్రైవేట్ పరం చేసి, పేదల వైద్యాన్ని అంగట్లో అమ్మేసింది! ఆరోగ్యశ్రీని పూర్తిగా బొంద పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల నుంచి అమరావతి జపం చేయడం, ప్రజలకు మాయమాటలు చెప్పి దోచుకోవడం తప్ప ఇంకేం కనిపించడంలేదు’ అని ఊదరగొట్టాడు. దాంతో రచ్చబండ కాడ ఉన్న జనం అంతా ‘అవునురో అబ్బా.. ఇవన్నీ అక్షరాలా నిజాలేరో! ఓటేసి నిలువునా మోసపోయాం’ అంటూ తలలు పట్టుకున్నారు.
– కాతా వెంకట నరసింహారెడ్డి, బద్వేలు
మా ఉసురు తగులుతుంది!
జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, నాలాంటి నిరుద్యోగులు లక్షలాది మందికి గౌరవంగా జీవనోపాధి కల్పించారు. అలాంటి ఉపాధిని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి లాగేసుకుంది. నమ్మించి మా బతుకులను రోడ్డున పడేసిన ఈ కూటమి సర్కార్‌కు మా ఉసురు తగులుతుంది.
– షేక్ అర్షియా, మాజీ వలంటీర్, కలసపాడు.
జీవనోపాధినే లాగేసుకున్నారు!
వలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించబోమని, పైగా జీతం రూ. 10 వేలు చేస్తామని ఎన్నికలపుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థే లేకుండా చేశారు. వలంటీరుగా ఉన్నప్పుడు నెలకు రూ. 5 వేలు వచ్చినా మా సొంత ఊర్లోనే ఖర్చులకు సరిపోయేవి. ఇప్పుడు ఆ కాస్తా లేకుండా చేసి ఘోరంగా మోసం చేశారు.
– మల్లిఖార్జున, మాజీ వలంటీర్, బ్రాహ్మణపల్లె.
నేడు ఆఫీసుల చుట్టూ తిప్పలు!
మేము వలంటీర్లుగా ఉన్నప్పుడు నెలలో మొదటి ఐదు రోజులు ఎక్కడికెళ్లినా వెతికి పట్టుకొని మరీ అవ్వతాతల చేతుల్లో పింఛన్లు పె ట్టేవాళ్లం. ఇప్పుడు ఆ పరి స్థితి లేదు. రేషన్ కార్డు కావాలన్నా, ఇతర ప్రభుత్వ సేవ లు కావాలన్నా పేదలు తమ రెక్కాడితే గాని డొక్కాడరని తెలిసి కూడా ఉపాధి పనులు వదిలేసి నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.’
– శ్రీనివాసులు, మాజీ వలంటీర్, కలసపాడు.


