
4 డీఏలు, ఐఆర్ ఇవ్వాల్సి ఉంది.. పీఆర్సీ ఊసేలేదు
రూ. 30 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి
రాష్ట్రవ్యాప్తంగా ఆవేదనతో ఉద్యోగులు
ఉద్యమబాట పట్టకముందే సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్
ఏలూరు (మెట్రో): ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలు, నాలుగు డీఏలు, మధ్యంతర భృతి ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర రెవెన్యూ ఆసోసియేషన్ (జేఏసీ) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం చంద్రబాబుఉద్యోగులపట్ల ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో అర్ధంకావడంలేదన్నారు. శనివారం ఏలూరులో రెవెన్యూ అసోసియేషన్ నాయకుడు తోట సుధాకర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ అనేక హామీలిచ్చారని, వాటిని అమలుచేయడానికి మాత్రం ముందుకు రావడంలేదని మండిపడ్డారు. పీఆర్సీ వేస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడంలేదన్నారు. అలాగే, దశలవారీగా బకాయిలు ఇస్తామన్నారని, అదీ లేదని చెప్పారు.
ఉద్యోగులపట్ల కూటమి నాయకులకు ఎందుకు చిన్నచూపని వారు ప్రశ్నించారు. ఉద్యోగులు కోరుకున్న 12వ పీఆర్‌సీ, 2023 జూలైలో వేయాల్సిన పీఆర్సీని నేటికీ వేయలేదని నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం నాలుగు డీఏలు ఇవ్వాలని, జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ దసరాకి ఒక్క డీఏ అయినా ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు.
గ్రాట్యుటీ, మెడికల్ బిల్స్ రావు..
ఇక రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు రాని పరిస్థితి ఉందని వారు వివరించారు. రిటైరైన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రాకుండానే వారు చనిపోతున్నారని బొప్పరాజు, వలిశెట్టి ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులు ఆక్రోశం, ఆవేదనతో ఉద్యమబాట పట్టక ముందే ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి దసరాకి ఉద్యోగుల బకాయిలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.