విజయవాడలీగల్/ములకలచెరువు: నకిలీ మద్యం కేసులో ఏ–1 అద్దేపల్లి జనార్ధనరావు, ఏ–2 అద్దేపల్లి జగన్మోహనరావు, ఏ–4 నకిరికంటి రవి, ఏ–7 బాదల్ దాస్, ఏ–8 ప్రదీప్ దాస్, ఏ–11 శ్రీనివాసరెడ్డి, ఏ–12 అంగలూరు కళ్యాణ్, ఏ–13 తిరుమలశెట్టి శ్రీనివాసరావు, ఏ–17 చెక్కా సతీష్‌కుమార్‌ల బెయిల్ పిటిషన్లపై డిఫెన్స్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని 6వ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లెనిన్‌బాబు ఆదేశిస్తూ ఈనెల 13కి వాయిదా వేశారు.
కస్టడీకి అనుమతి
నకిలీ మద్యం కేసులో ఏ–17గా ఉన్న చెక్కా సతీష్‌కుమార్‌ను విచారించేందుకు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి ఐదు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఇదే కేసులో అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహనరావులను మరోసారి కస్టడీ కోరుతూ ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం నెల్లూరు జైలులో జనార్దనరావు, విజయవాడ జైలులో జగన్మోహన్‌రావు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దీనిపై డిఫెన్స్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడంతో విచారణను న్యాయమూర్తి ఈనెల 17కి వాయిదా వేశారు. ఈ కేసులో ఏ–18 జోగి రమేష్, ఏ–19 జోగి రాములను కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై డిఫెన్స్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 13కి న్యాయమూర్తి వాయిదా వేశారు.
అలాగే నకిలీ మద్యం కేసులో రిమాండ్‌లో ఉన్న జోగి రమేష్ జైలులో ములాఖత్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు మంగళవారం ముగియడంతో న్యాయమూర్తి తీర్పును ఈనెల 13కి న్యాయమూర్తి వాయిదా వేశారు.
ముగిసిన పోలీసు కస్టడీ
నకిలీ మద్యం కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న బాదల్‌దాస్, ప్రదీప్‌దాస్, శ్రీనివాసరెడ్డి, అంగలూరు కళ్యాణ్, నకిరికంటి రవి, రమేష్‌బాబు, అల్లాభక్షుల ఐదు రోజుల పోలీసు కస్టడీ మంగళవారం ముగియడంతో ఎక్సైజ్ పోలీసులు న్యాయస్ధానంలొ హాజరుపరిచారు. అనంతరం వారిని జైళ్లకు తరలించారు.
నకిలీ మద్యం కేసులో నిందితుల పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి
రాష్ట్రంలో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టయిన నలుగురు నిందితులపై పీటీ వారెంట్‌కు మంగళవారం కోర్టు అనుమతించింది. ములకలచెరువు కేసులో ఏ2 కట్టారాజు, ఏ3 సయ్యద్ హాజీ, ఏ10 మిథున్‌దాస్, ఏ11 అంతాదాస్ మదనపల్లి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
విజయవాడ ఇబ్రహింపట్నంలో నమోదైన నకిలీ మద్యం కేసులోనూ వీరు నిందితులుగా ఉండడంతో విజయవాడ భవానీపురం పోలీసులు వీరిని తీసుకెళ్లేందుకు పీటీ వారెంట్ దాఖలు చేశారు. వాదనల అనంతరం తంబళ్లపల్లె జడ్జి వారికి రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
ఇప్పటికి 21 మంది అరెస్టు
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో 25 మందిని నిందితులుగా చేర్చి 21 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక టీడీపీ నేతలు దాసరపల్లి జయచంద్రారెడ్డి, మంత్రి గిరిధర్‌రెడ్డి, పీఏ రాజేష్, అన్బురసులను అరెస్టు చేయాల్సి ఉంది.
నిడుగుంట అరుణ కస్టడీ పిటిషన్ వాయిదా
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలుచేసి మోసం చేసిన కేసులో నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉన్న నిడిగుంట అరుణను(నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ పొందిన జీవితఖైదు శ్రీకాంత్ సన్నిహితురాలు) పోలీసు కస్టడీ విచారణకు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను న్యాయమూర్తి 12వ తేదీకి వాయిదా వేశారు.


