
కోనసీమ: మరొకసారి కోనసీమ వాసుల్లో ఓఎన్‌జీసీ ఆయిల్ లీక్ ఘటన కలవరం పుట్టిస్తోంది. తాజాగా మామిడికుదురు మండలం పాశర్లపూడి ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ సైటు సమీపంలో ఆయిల్ లీకవుతున్న ఘటన వెలుగుచూసింది. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 29వ తేదీ) పాశర్లపూడికి అత్యంత సమీపంలోని పంట కాల్వలోకి ఓఎన్‌జీసీ ఆయిల్ లీకవుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. దాంతో ఆందోళన చెందిన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు.
అయితే ఓఎన్‌జీసీ ఆయిల్ లీవ్ అవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజలను కలవరపెడుతున్న నేపథ్యంలో మరొకటి చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తరుచుగా జరుగుతున్న ఘటనలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
పాశర్లపూడి ప్రాంతంలో ఓఎన్‌జీసీ (ONGC) ఆయిల్ , గ్యాస్ లీకేజీలు అనేక సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. ప్రధాన లీకేజీ ఘటనలు ఇవే..
1995–96: పాశర్లపూడిలో ఓఎన్‌జీసీ బావిలో భారీ బ్లోఅవుట్ (Blowout) జరిగింది. ఈ ప్రమాదంలో 60 రోజుల పాటు మంటలు చెలరేగాయి,
ఇది ఓఎన్‌జీసీ చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదంగా గుర్తించబడింది.
2014 జూన్ 28: నాగారం వద్ద గ్యాస్ పైప్ లైన్ లీక్ కారణంగా 15 మంది సజీవ దహనమయ్యారు, మరో 15 మంది గాయపడ్డారు.
2022 సెప్టెంబర్ 27: పాశర్లపూడి వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ జరిగింది. అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.
2025 సెప్టెంబర్ 23: పాశర్లపూడి వెళుతున్న పైప్ లైన్ వద్ద మరోసారి గ్యాస్, ఆయిల్ లీక్ జరిగింది. స్థానికులు వాసనను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.
2025 ఆగస్టు: డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ పైకి రావడంతో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. అధికారులు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశారు.
ఇదీ చదవండి:
హోంమంత్రి అనితకు నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డగింత