breaking news
Pasarlapudi lanka village
-
పాశర్లపూడి సమీపంలో ఓఎన్జీసీ ఆయిల్ లీక్
కోనసీమ: మరొకసారి కోనసీమ వాసుల్లో ఓఎన్జీసీ ఆయిల్ లీక్ ఘటన కలవరం పుట్టిస్తోంది. తాజాగా మామిడికుదురు మండలం పాశర్లపూడి ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైటు సమీపంలో ఆయిల్ లీకవుతున్న ఘటన వెలుగుచూసింది. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 29వ తేదీ) పాశర్లపూడికి అత్యంత సమీపంలోని పంట కాల్వలోకి ఓఎన్జీసీ ఆయిల్ లీకవుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. దాంతో ఆందోళన చెందిన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. అయితే ఓఎన్జీసీ ఆయిల్ లీవ్ అవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజలను కలవరపెడుతున్న నేపథ్యంలో మరొకటి చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తరుచుగా జరుగుతున్న ఘటనలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. పాశర్లపూడి ప్రాంతంలో ఓఎన్జీసీ (ONGC) ఆయిల్ , గ్యాస్ లీకేజీలు అనేక సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. ప్రధాన లీకేజీ ఘటనలు ఇవే..1995–96: పాశర్లపూడిలో ఓఎన్జీసీ బావిలో భారీ బ్లోఅవుట్ (Blowout) జరిగింది. ఈ ప్రమాదంలో 60 రోజుల పాటు మంటలు చెలరేగాయి,ఇది ఓఎన్జీసీ చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదంగా గుర్తించబడింది.2014 జూన్ 28: నాగారం వద్ద గ్యాస్ పైప్ లైన్ లీక్ కారణంగా 15 మంది సజీవ దహనమయ్యారు, మరో 15 మంది గాయపడ్డారు.2022 సెప్టెంబర్ 27: పాశర్లపూడి వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ జరిగింది. అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.2025 సెప్టెంబర్ 23: పాశర్లపూడి వెళుతున్న పైప్ లైన్ వద్ద మరోసారి గ్యాస్, ఆయిల్ లీక్ జరిగింది. స్థానికులు వాసనను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. 2025 ఆగస్టు: డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ పైకి రావడంతో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. అధికారులు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశారు. ఇదీ చదవండి: హోంమంత్రి అనితకు నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డగింత -
నదిలోకి దూకిన ప్రేమజంట
సాక్షి, పాశర్లపూడి: పెద్దలు తమ పెళ్లికి నిరాకరించారన్న కారణంతో యువజంట తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామ పరిధిలోని వైనతేయ వారధి పైనుంచి గోదావరి నదిలో దూకి శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. జంటలో యువకుడి మృతదేహం లభ్యమైంది. యువతి ఆచూకీ కోసం మత్స్యకారుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరం గ్రామానికి చెందిన యెలిశెట్టి నాగశివదుర్గ (21) ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. పెదపట్నం గ్రామానికి చెందిన 14 ఏళ్ల ముత్యాల నాగ సుజిత తొమ్మిదో తరగతి చదువుతోంది. నగరంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పిన సుజిత పెదపట్నంలోని తన ఇంటి నుంచి సైకిల్‌పై బయటకొచ్చింది. మోటార్ సైకిల్‌పై వచ్చిన నాగశివదుర్గ తనను ఎక్కించుకుని పాశర్లపూడి వచ్చి వైనతేయ వారధిపై నుంచి గోదావరి నదిలోకి దూకి అత్మహత్యకు పాల్పడ్డారు. మోటార్ సైకిల్లో సెల్‌ఫోన్, కొంత నగదు, చాక్లెట్ ప్యాకెట్లు ఉన్నాయి. గమనించిన స్థానికులు మోటార్ సైకిల్లో ఉన్న సెల్‌ఫోన్ నుంచి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యువతి తండ్రి నర్సింహమూర్తి, తల్లి కనకదుర్గ, యువకుడి తండ్రి రాము, తల్లి కుమారి, వారి కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకొని తీవ్రంగా విలపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుని మృతదేహం లభ్యమైంది. యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
పాసర్లపూడిలంకలో గ్యాస్ పైప్ లీకు
మామిడికుదురు (తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడిలంక గ్రామంలో ఒఎన్జీసీ సంస్థకు చెందిన గ్యాస్ పైపు లైన్ లీకైంది. శుక్రవారం పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. గ్రామంలోని 18 వ బావి వద్ద ఉన్న గ్యాస్ పైపు లైన్ పేలడంతో కొద్దిగా ముడిచమురుతో పాటూ, గ్యాస్ కూడా లీకైంది. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలిసిన ఒఎన్జీసీ సంస్థ అధికారులు పైప్‌లైన్‌ను బాగుచేసేందుకు వెళ్లారు. కాగా భయాందోళనలకు గురైన గ్రామస్తులు ఒఎన్జీసీ అధికారులను నిర్బంధించారు.


