శుభ కార్యాలకు విరామం | No Shubh Muhurat For Conducting Marriage | Sakshi
Sakshi News home page

శుభ కార్యాలకు విరామం

Jun 8 2025 1:48 PM | Updated on Jun 8 2025 1:48 PM

No Shubh Muhurat For Conducting Marriage

    నేటి నుంచి 48 రోజులపాటు బ్రేక్‌ 

    జూలై 26 నుంచి మళ్లీ ముహూర్తాలు   

ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి): పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తారు. అటువంటి ముహూర్తాలకు 48 రోజుల పాటు బ్రేక్‌ పడింది. ఈ ఏడాది జనవరి 30 నుంచి జూన్‌ 7 వరకు వివాహాలు జోరుగా జరిగాయి. ఆయా ముహూర్తాల్లో జిల్లావ్యాప్తంగా వేలాది వివాహాలు నిర్వహించారు. ఈనెల 10 నుంచి గురు మూఢమి, 26 నుంచి ఆషాఢ మాసం కావడంతో జులై 25 వరకు పెళ్లి సందడికి విరామం వచ్చింది. తిరిగి వివాహ ముహూర్తాలు శ్రావణ మాసం జూలై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అప్పటివరకు వివాహాది శుభకార్యాలకు ఆగాల్సిందే. 

48 రోజులు పనులు లేనట్టే.. 
వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు, డెకరేషన్, షామియానా పందిళ్లు నిర్మించే వారు, వాయిద్యకారులు, క్యాటరింగ్, లైటింగ్‌ కార్మికులకు 48 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జులై 26 నుంచి బిజీ కానున్నారు.  

వివాహ ముహూర్తాలు : వివాహాలకు ఈ ఏడాది జూలై 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17, సెపె్టంబర్‌ 23, 24, 26, 27, 28, అక్టోబర్‌ 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబర్‌ 1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.  

శ్రావణం వరకూ ఆగాల్సిందే.. 
ఈనెల 10 నుంచి గురు మూఢమి. అలాగే 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. దీంతో ఆషాఢ మాసం ముగిసే వరకూ వివాహాలు చేసుకునే వారు ఆగాల్సిందే. శ్రావణ మాసమైన జూలై 26 నుంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. నవంబరు తర్వాత మళ్లీ ముహూర్తాలు లేవు.  
– గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల  

 

Advertisement
 
Advertisement
Advertisement