నివర్‌: నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం

Nivar Cyclone Heavy Rains In PSR Nellore Chittoor Districts - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీద నివర్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాయుడుపేటలోని స్వర్ణముఖి నది వరద నీటితో నిండిపోయింది. ఇక నాయుడుపేట ఎగువ ప్రాంతాలైన చిత్తూరు, తిరుపతి, కాళహస్తి తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో స్వర్ణముఖి నదికి గంట గంటకు  భారీ వరద చేరి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం, పోలీసులు స్వర్ణముఖి నది వద్దకు చేరుకున్నారు. నది ఒడ్డుకు, బ్రిడ్జి సమీపానికి వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. (చదవండి: తీరాన్ని దాటిన నివర్‌ తుపాను..)

కాగా తుపాను ప్రభావం ఇలాగే కొనసాగితే బ్రిడ్జి మునిగిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే నాయుడుపేట, మేనకూరు పరిశ్రమ వాడ, వెంకటగిరికి రాకపోకలకు అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. (చదవండి: తుపాను ప్రభావంపై సీఎం జగన్‌ సమీక్ష)


వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: ఎస్పీ
తుపాను ధాటికి జ‌య‌లలితా న‌గర్‌లో భారీవృక్షాలు కూలి ఇళ్లు ధ్వంస‌మై విషాదంలో మునిగిన బాధితుల‌ను నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్క‌ర్ భూష‌ణ్‌ పరామర్శించారు. స్థానిక 48 వార్డ్ ఇంఛార్జితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసుల‌రెడ్డి, సీఐలు మ‌ధుబాబు, అన్వ‌ర్ భాష‌, ఎస్ఐలు సుబాని, శ్రీహ‌రి, ఇత‌ర అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వేలమందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించామ‌ని వెల్ల‌డించారు.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
చిత్తూరు జిల్లాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. ఇప్పటి వరకు 16 వందల మందికి సురక్షిత ప్రాంతాలకు తరలించమన్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ప్రమాదంలో ఉంటున్న చెరువుల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top