వేటగాళ్ల నయా ట్రెండ్‌

The new trend of hunters - Sakshi

తుపాకులు, ఉచ్చులు కాకుండా వేట కుక్కలతో వన్యప్రాణుల వేట 

నిందితులను అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు 

ద్విచక్ర వాహనం, రెండు వేట కుక్కలు స్వాదీనం

చంద్రగిరి (తిరుపతి జిల్లా): వన్యప్రాణుల వేటలో వేటగాళ్లు కొత్త రూటులు వెతుకుతున్నారు. గతంలో వన్యప్రాణులను వేటాడేందుకు తుపాకులు, ఉచ్చులను వాడేవారు. అయితే ఇప్పుడు వేట కుక్కలను ఇందుకు వినియోగిస్తున్నారు. వీటితో వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఇందుకోసం వేట కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వన్యప్రాణులను వేటాడాక వాటి మాంసాన్ని భారీ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి తిరుగు ప్రయాణమవుతున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వేటగాళ్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు రెండు వేట కుక్కలను అదుపులోకి తీసుకుని పనపాకం అటవీ కార్యాలయానికి తరలించారు. 

పనపాకం పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా వేట.. 
గత కొంతకాలంగా పనపాకం పరిసరాల్లోని ఈటలదొడ్డి, బొప్పి­గుట్ట, వెదురుల కొండ, కందరవారి గుట్ట, మొరవగట్టు, నచ్చు బండ, గుడిసె గుట్ట, దొంగలబండ, మాలవాడి చెరువు ప్రాంతాల్లో విచ్చలవిడిగా వేట సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి వచ్చిన మంజు, సాయిలకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి సహకరిస్తున్నట్లు చెబుతున్నారు. వీరు ఆదివారం రాత్రి వేటకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో సోమవారం తిరుగు ప్రయాణంలో అటవీ అధికారులకు పట్టుబడ్డారు.

వేటగాళ్ల సెల్‌ఫోన్లను పరిశీలించిన అటవీ అధికారులు ఆశ్చర్యపోయారు. వాటిలో వేట కుక్కలకు శిక్షణ ఇచ్చే వీడియోలు, కుక్కలు.. అడవి పందులను వేటాడే వీడియోలు ఉన్నాయి. గతంలోనూ పనపాకం పరిసర ప్రాంతాల్లో స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలవారు వేట సాగించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

కఠిన చర్యలు తీసుకుంటాం..  
అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడితే ఎంతటివారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం పనపాకం అటవీ చెక్‌పోస్టు వద్ద స్వా«దీనం చేసుకున్న కుక్కలు పెంపుడు జంతువులే. వేటకు శిక్షణ ఇచ్చేందుకు వీటిని తీసుకొ చ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పూచీకత్తుపై విడుదల చేశాం. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాం. స్వా«దీనం చేసుకున్న శునకాలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టాం.  – మాధవీలత, ఎఫ్‌ఆర్‌వో, పనపాకం రేంజ్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top