నీట్‌ కఠినం | NEET UG-2025 ended peacefully: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నీట్‌ కఠినం

May 5 2025 5:25 AM | Updated on May 5 2025 5:25 AM

NEET UG-2025 ended peacefully: Andhra Pradesh

ఫిజిక్స్‌ అత్యంత సంక్లిష్టం.. జేఈఈ మెయిన్‌ స్థాయి దాటి ప్రశ్నలు 

బయాలజీ సులువు, కెమిస్ట్రీ మధ్యస్తం 

గతేడాదితో పోలిస్తే చాలా కఠినంగా ప్రశ్నాపత్రం 

ప్రశాంతంగా ముగిసిన నీట్‌ యూజీ–2025

సాక్షి, అమరావతి: నీట్‌ యూజీ–2025 ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఫిజిక్స్‌ విభాగంలో అత్యంత సంక్లిష్టంగా, బయాలజీలో సులువుగా, కెమిస్ట్రీలో మధ్యస్తంగా ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించారు. 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ యూజీ పరీక్షను ఆదివారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించింది. జాతీయ స్థాయిలో 22.7 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, దేశంలో 552, దేశం వెలుపల 14 నగరాలు, పట్టణాల్లో పరీక్ష రాశారు.

రాష్ట్రంలో నీట్‌ ప్రశాంతంగా ముగిసింది. గతేడాది పేపర్‌ లీక్, అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే కేంద్రాల్లోకి అనుమతించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉందని నిపుణులు స్పష్టం చేశారు. గతేడాది జాతీయ స్థాయిలో 17 మంది విద్యార్థులు 720కు 720 స్కోర్‌ చేశారు. ఈ దఫా 720కు 720 స్కోర్‌ చేసే అవకాశం ఏ మాత్రం లేదంటున్నారు. మొత్తంగా ప్రశ్నాపత్రం సరళి గతానికి పూర్తి భిన్నంగా ఉందని మెజారిటీ అభిప్రాయం వ్యక్తమైంది. 2016, 2017ల్లో ఈ తరహాలో ప్రశ్నాపత్రం సరళి ఉందని కొందరు చెప్పారు.  

విద్యార్థులను నిరుత్సాహపరిచిన ఫిజిక్స్‌ 
ఈ దఫా ఫిజిక్స్‌ విభాగం విద్యార్థులను పూర్తిగా నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. జేఈఈ మెయిన్స్‌ స్థాయిలో ఈ విభాగంలో ప్రశ్నలు ఉన్నాయి. సాధారణంగా కోచింగ్‌ సెంటర్లలో కూడా ఈ తరహా ప్రశ్నలు బోధించరని, మాక్‌ టెస్ట్‌లలోనూ ఉండవని తెలిసింది. గతేడాది ఫిజిక్స్‌ విభాగంలో ఏడు ప్రశ్నలు థియరీ విధానంలో జవాబులు గుర్తించేలా ఉన్నాయి. ఈ సారి థియరీ ఆధారంగా జవాబులిచ్చే ప్రశ్నలు ఒక్కటి కూడా లేవని సబ్జెక్ట్‌ నిపుణులు వెల్లడించారు. సుదీర్ఘమైన ప్రశ్నలు, ప్రతి దానికీ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

దీంతో ఫిజిక్స్‌ ప్రశ్నలకు సమాధానాల కోసమే విద్యార్థులు ఎక్కువ సమయం తీసుకున్నారని వివరించారు.  ముఖ్యంగా 10 ప్రశ్నలు ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులూ జవాబు ఇవ్వడానికి వీల్లేకుండా ఉన్నాయన్నారు. దీంతో మెజార్టీ విద్యార్థులు ఈ 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉండటం/తప్పు సమాధానం ఇవ్వడం చేసి ఉంటారని పేర్కొన్నారు. కెమిస్ట్రీలో ఎన్‌సీఈఆర్‌టీ స్థాయిని దాటి ప్రశ్నలు ఉన్నాయని చెబుతున్నారు.

ఒక ప్రశ్నకు సమాధానంగా రెండు ఆప్షన్‌లు ఉంటాయని సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ పేర్కొంటున్నారు. బయాలజీలో ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పరిధిలోనే వచ్చాయని,  దీంతో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులు సులువుగా సమాధానాలిచ్చారని పేర్కొంటున్నారు. పేపర్‌ కఠినంగా ఉన్న క్రమంలో గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు బాగా తగ్గే అవకాశ ఉందని కోచింగ్‌ సెంటర్ల నిపుణులు అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement