తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు | NEET results released and Good ranks only for low marks | Sakshi
Sakshi News home page

తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు

Jun 15 2025 4:57 AM | Updated on Jun 15 2025 4:57 AM

NEET results released and Good ranks only for low marks

నీట్‌ ఫలితాలు విడుదల.. రాష్ట్రం నుంచి 36,776 మంది అర్హత 

టాప్‌–100 ర్యాంకుల్లో ఆరుగురు ఏపీ విద్యార్థులు

ఈ ఏడాది ఉత్తరాదికే టాప్‌ ర్యాంకులు

686 మార్కులతో రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌ కుమార్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌

రాష్ట్ర టాపర్‌ కార్తీక్‌ రామ్‌ కిరీటికి 19వ ర్యాంకు

సాక్షి, అమరావతి: నీట్‌ యూజీ–2025లో రాష్ట్రం నుంచి 36,776 మంది అర్హత సాధించారు. టాప్‌–100 మందిలో ఆరు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం గత నెల 4వ తేదీన నిర్వహించిన నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 22,09,318 మంది హాజరైన ఈ పరీక్షలో 12,36,531 మంది అర్హత సాధించినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈసారి 59,219 మంది దరఖాస్తు చేసు­కోగా, 57,934 మంది పరీక్షకు హాజరయ్యారు. 

వీరిలో 36,776 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో టాప్‌–100లో ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వీరిలో 19వ ర్యాంకుతో దర్భా కార్తీక్‌ రామ్‌ కిరీటి రాష్ట్ర టాపర్‌గా నిలిచాడు. అలాగే, కొడవాటి మోహిత్‌ శ్రీరామ్‌ 56వ ర్యాంకు.. దేశిన సూర్యచరణ్‌ 59, పొదిలపు అవినాష్‌ 64 (ఓబీసీ), యర్రా సమీర్‌ కుమార్‌ 70 (ఓబీసీ), తుమ్మూరి శివ మణిదీప్‌ 92వ (ఓబీసీ) ర్యాంకులు సాధించారు. వీరుగాక కారు మంచి విక్రాంత్‌ జాతీయ స్థాయిలో 262 ర్యాంకుతో పాటు ఎస్సీ కేటగిరీలో 9వ స్థానంలో నిలిచాడు.

టాపర్‌గా రాజస్థాన్‌ విద్యార్థి 
ఈసారి నీట్‌ యూజీ పరీక్షలో టాప్‌–10 ర్యాంకులు ఉత్తరాది విద్యార్థులు సొంతం చేసుకున్నారు. వీరిలో 9 మంది బాలురు, ఒక బాలిక ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన మహేష్‌ కుమార్‌ టాపర్‌గా నిలవగా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్‌‡్ష అవాధియా రెండో ర్యాంకు, మహరాష్ట్ర విద్యార్థి క్రిషంగ్‌ జోషి మూడో ర్యాంకు, ఢిల్లీకి చెందిన మృణాల్‌ కిషోర్‌ ఝా నాలుగో ర్యాంకు, అవికా అగర్వాల్‌ (ఢిల్లీ) ఐదో ర్యాంకు సొంతం చేసుకున్నారు.  

73 మందికి అత్యుత్తమ మార్కులు
ఈ ఏడాది నీట్‌ మార్కుల సాధనలో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. 144 నుంచి 686 మార్కుల వరకు సాధించిన విద్యార్థులను ప్రకటించింది. ఇందులో 73 మంది 651 నుంచి 686 మధ్య మార్కులు సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement