డ్రగ్స్‌ కట్టడిలో ఏపీ భేష్‌.. వాస్తవాలు ఇవే..

National Crime Records Bureau report On Andhra Pradesh Drugs Prevention - Sakshi

ప్రధాన రాష్ట్రాల కంటే మెరుగ్గా ఏపీ పనితీరు

డ్రగ్స్‌ వాడకంలో మొదటి 2 స్థానాల్లో యూపీ, పంజాబ్‌

తరువాత స్థానాల్లో తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర

సమర్థంగా కట్టడి చేస్తూ 18వ స్థానంలో ఏపీ

జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదిక వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది. డ్రగ్స్‌ కేసులతోపాటు దేశంలో అన్ని రకాల నేరాలకు సంబంధించి ఎన్‌సీబీ నివేదికే ప్రామాణికం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థంగా డ్రగ్స్‌ను కట్టడి చేస్తోందని ఆ నివేదిక స్పష్టం చేస్తుండగా చంద్రబాబు మాత్రం రాష్ట్రంపై బురద చల్లుతుండటాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. ఎన్‌సీబీ నివేదికలే వాస్తవాలను వెల్లడిస్తున్నాయని పేర్కొంటున్నారు.

టాప్‌లో యూపీ, పంజాబ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర
2020లో దేశంలో నేరాలకు సంబంధించి ఎన్‌సీబీ ఇటీవల నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం గతేడాది డ్రగ్స్‌ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. అక్కడ 10,852 కేసులు నమోదయ్యాయి. 6,909 కేసులతో పంజాబ్‌ రెండో స్థానంలో ఉంది. 5,403 కేసులతో తమిళనాడు మూడో స్థానంలో, 4,968 కేసులతో కేరళ నాలుగు, 4,714 కేసులతో మహారాష్ట్ర ఐదో స్థానంలో నిలిచాయి.  2020లోనే కాదు గత కొన్నేళ్లుగా ఆ ఐదు రాష్ట్రాలే అటూ ఇటూగా డ్రగ్స్‌ కేసుల్లో అగ్ర స్థానాల్లో ఉన్నాయి. 2018, 2019లో మహారాష్ట్ర, పంజాబ్, యూపీ, కేరళ, తమిళనాడు వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 2017లో మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, యూపీ, తమిళనాడు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. 

సమర్థంగా కట్టడి.. 18వ స్థానంలో ఏపీ
2020లో డ్రగ్స్‌ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ 18వ స్థానంలో ఉంది. 28 రాష్ట్రాలున్న జాబితాలో  మన రాష్ట్రం 18వ స్థానంలో ఉందంటే ప్రభుత్వం డ్రగ్స్‌ దందాను ఎంత సమర్థంగా కట్టడి చేస్తోందన్నది స్పష్టమవుతోంది. దేశంలో ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌ డ్రగ్స్‌ కేసుల్లో అంత చివరిలో ఉండటం ప్రభుత్వ సమర్థతకు నిదర్శమని నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్‌ వ్యవహారాలను మరింత సమర్థంగా కట్టడి చేస్తోంది. దీంతో ఏపీ ట్రాక్‌ రికార్డ్‌ 2020లో మరింత మెరుగైంది.

టీడీపీ హయాంలో 2017లో మన రాష్ట్రం డ్రగ్స్‌ కేసుల్లో 16వ స్థానంలో ఆ తరువాత ఏడాది 17వస్థానంలో నిలిచింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరింత సమర్థంగా డ్రగ్స్‌ వ్యవహారాలను కట్టడి చేసింది. దీంతో 2020లో మన రాష్ట్రం డ్రగ్స్‌ కేసుల్లో దేశంలో 18వ స్థానానికి తగ్గిపోయింది. అంటే రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవహారాలను ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్లేనన్నది స్పష్టమవుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top