పీవీ సింధుకు ఇచ్చినట్టే ఇచ్చాం
మెగా డీఎస్సీపై శాసనసభలో విద్యా శాఖ మంత్రి లోకేశ్
స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను పకడ్బందీగా ఎంపిక చేశాం
కూన రవి, ఎంపీ భరత్ అసోసియేషన్లకు అనుకూలమైన వారికి ఉద్యోగాలు ఇచ్చారనడం తప్పు
ఆధారాలు ఉంటే తీసుకొచ్చి నిరూపించాలి
డీఎస్సీపై సభ బయట, లోపల ఎక్కడైనా చర్చకు సిద్ధం
కాక్రోచ్‌లని చెబుతున్న వారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి
ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం..ఉద్యోగాలు రానివాళ్లు మళ్లీ రాయవచ్చు
సాక్షి, అమరావతి: ‘పీవీ సింధుకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత మాది. మరి కొన్నేళ్లలో ఆమె ఐఏఎస్ అధికారి కాబోతోంది. జ్యోతి యర్రాజి ఉత్తరాంధ్ర బిడ్డ.. ముఖ్యమంత్రికి చెబితే ఆమెకు వెంటనే ఉద్యోగం ఇవ్వమని చెప్పారు. క్రికెటర్ శ్రీచరణికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని సీఎం డైరక్షన్. డిగ్రీ పూర్తయిన వెంటనే గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని చెప్పారు. స్పోర్ట్స్ పర్సన్‌కు టెస్ట్ పెట్టాలని లేదు..’అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ 2025పై వెల్లువెత్తుతున్న విమర్శలకు సోమవారం ఆయన అసెంబ్లీలో సమాధానమిచ్చారు. పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి చివరి శిక్షణ వరకు పారదర్శకంగా 148 రోజుల్లో డీఎస్సీ నిర్వహించామని, ఎక్కడా షార్ట్ కట్‌లో చేయలేదని లోకేష్ చెప్పారు. స్పోర్ట్స్ కోటా గురించి ప్రతిపక్షం అనేక ఆరోపణలు చేస్తోందంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గతంలో 29 కేటగిరీలు ఉంటే 65 కేటగిరీలు తీసుకొచ్చి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ శాప్ ఆధ్వర్యంలో వివిధ దశల్లో నెల రోజులపాటు పూర్తి చేశాకే డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను పకడ్బందీగా ఎంపిక చేశామన్నారు. కూన రవి, ఎంపీ భరత్, మరో ఎంపీ అసోసియేషన్లు బాధ్యతల్లో ఉన్నందున వారికి అనుకూలమైన వారికి ఉద్యోగాలు ఇచ్చారనడం తప్పన్నారు. ఆధారాలు ఉంటే తీసుకువచ్చి నిరూపించాలన్నారు.
కాక్రోచ్‌లని చెబుతున్న వారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి..
‘కాక్రోచ్‌లని చెబుతున్న వారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. ప్రెస్ మీట్ ఎందుకు? హౌస్‌కు రమ్మనండి. టైమ్, డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్‌కు నేను రెడీ. హౌస్ లోపల అయినా బయట అయినా నేను రెడీ. నేను పారిపోవడం లేదు. సభకు రండి.. చర్చిద్దాం’ అంటూ నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం సింగపూర్, ఫిన్లాండ్‌కు శిక్షణ కోసం పంపితే గత ప్రభుత్వం వైన్ షాపుల ముందు నిలబెట్టిందని విమర్శించారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు రిక్రూట్ చేశామని, టెట్‌కు 3,68,661 మంది దరఖాస్తు చేస్తే 1,87,256 మంది క్వాలిఫై అయ్యారని తెలిపారు.
722 మందికి అందుకే ఇవ్వలేదు
సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తర్వాత 16,291 మందికి కాల్ లెటర్స్ పంపామని, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ కారణంగా 722 మందికి ఇవ్వలేకపోయామని లోకేశ్ చెప్పారు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు డీఎస్సీ నిర్వహణ బాధ్యత అప్పగించారని ఆరోపిస్తున్నారని, అది ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిందన్నారు. 148 రోజుల్లో త్వరగా నిర్వహించాలని ఒక వ్యక్తిని నియమించామని, అది చట్ట ఉల్లంఘన కాదని, ఈ ప్రక్రియలో ఆయన కింద 50 మంది పని చేశారని చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్‌లో ఉన్నాడని, అతడికి మొదటి ర్యాంకు వచ్చింది అంటున్నారని, అయితే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్‌లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తికి కాల్ లెటర్ వెళ్లినా, సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు రాలేదన్నారు. 42 వేల ప్రశ్నలు, ర్యాండమైజ్ విధానంలో వెళ్తాయని, ఏదో జరిగిపోయింది అనడం సబబు కాదని, పేపర్ లీకైంది అనడం అవాస్తవమని చెప్పారు.
ఆయనకు ఐఏఎస్ ఎలా వచ్చిందో?
ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు జాబితాలు పెట్టామని, జగన్ ఫోన్ వాడకపోతే ఎవరూ వాడరు అనుకోవడం పొరపాటని, ప్రజాప్రభుత్వం ఫోన్‌కే డైరక్ట్‌గా సమాచారం ఇస్తుంటే పారదర్శకత లేదని ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ కోటాలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆడియో లీక్ వచ్చిందని, సర్టిఫికెట్ డబ్బులకు అమ్ముతున్నారని, అటువంటి వారిని శాప్ రక్షిస్తుందని ఆరోపిస్తున్నారని, ఆ ఆడియో లీక్ వచ్చిన వెంటనే ఆ వ్యక్తిపై విజయవాడ కమిషనర్‌కు శాప్ ఫిర్యాదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించామని లోకేశ్ పేర్కొన్నారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి స్పోర్ట్స్ కోటాలో 372 మంది ఒకే సామాజికవర్గం నుంచి ఎంపికయ్యారని ఆరోపణ చేశారని, ఆ మహానుభావుడికి ఐఏఎస్ ఎలా వచ్చిందో దేవుడికి తెలియాలని లోకేశ్ పేర్కొన్నారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, మరో 3 డీఎస్సీలు నిర్వహిస్తామని, ఉద్యోగాలు రాని వాళ్లు మళ్లీ రాయవచ్చని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


