Mp Mithun Reddy Attend Ysrcp Plenary Meeting Rajampet Details Here - Sakshi
Sakshi News home page

పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలు: ఎంపీ మిథున్ రెడ్డి

Published Wed, Jun 29 2022 11:15 AM

Mp Mithun Reddy Attend Ysrcp Plenary Meeting Rajampet - Sakshi

సాక్షి,రాజంపేట: వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలు, నాయకులే మూలస్తంభాలని రాజంపేట ఎంపీ, లోక్‌సభ ఫ్లోర్‌లీడర్‌ పీవీ మిథున్‌రెడ్డి అన్నారు. మంగళవారం తోట కన్వెన్షన్‌ హాలులో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే కార్యకర్తలే కీలక సూత్రధారులన్నారు.

కార్యకర్తలకు వెన్నంటే ఉంటామన్నారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీచైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలు కూడా నియోజకవర్గంలో కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో తనతోపాటు ముందంజలో ఉంటారన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. రాజంపేట అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయని, త్వరలో తాను, ఎమ్మెల్యే, జెడ్పీచైర్మన్‌ సీఎంను కలిసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.  

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలోని హామీలను మూడేళ్లలో తొంభై ఐదుశాతానికి పైగా అమలు చేసిన సీఎం జగన్‌కు,  ఎన్నికల అనంతరం మేనిఫెస్టోను ఆన్‌లైన్‌లో తొలగించిన చంద్రబాబుకు పోలిక ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు వైఎస్సార్‌సీపీకే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామన్నారు. టీడీపీకి దుష్టచతుష్టయం, ఎల్లోమీడియా మద్దతు ఉంటే వైఎస్సార్‌సీపీకి ప్రజల మద్దతు ఉందన్నారు. పార్టీ కన్నతల్లి లాంటిదని, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్సార్‌సీపీ జెండా కిందనే జీవిద్దామని కార్యకర్తలకు, నాయకులకు గడికోట పిలుపునిచ్చారు.  

కార్యకర్తల కష్టంతోనే జెండా రెపరెపలు
రైల్వేకోడూరు అర్బన్‌: కార్యకర్తలు, వైఎస్‌ అభిమానులు, నాయకుల కష్టంతోనే వైఎస్సార్‌సీపీ ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించి పార్టీ జెండా రెపరెపలాడుతోందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారన్నారు. వారి కష్టాన్ని పార్టీ ఎప్పటికీ విస్మరించదన్నారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


 

Advertisement
Advertisement