ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై ఎంపీ అవినాష్ రెడ్డి ధ్వజం
జమ్మలమడుగు: రాజకీయ భిక్ష పెట్టిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయించిన కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పతనం ప్రారంభమైందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వైఎస్సార్ కడప జల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి అనుచరులు ధ్వంసం చేయడం అత్యంత పిరికిపంద చర్య అని, ఇది వైఎస్సార్ అభిమానుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని మండిపడ్డారు. ఈ ఘాతుకానికి నిరసనగా గురువారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ప్రదర్శన చేపట్టాయి. అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ నరేష్ బాబుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అధికారంలో ఉంటేనే ఎగిరెగిరి పడుతూ ఇక్కడ కనిపిస్తావు. అధికారం లేని ఐదేళ్ల కాలంలో కనీసం 20 రోజులైనా ప్రజల్లో ఉన్నావా? ఓడినా, గెలిచినా రామసుబ్బారెడ్డి ధైర్యంగా ఇక్కడే ఉండి రాజకీయం చేస్తుంటే, నువ్వు మాత్రం బెంగళూరు, గోవా క్లబ్బుల చుట్టూ తిరిగావు‘ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ మేకపోతు గాంభీర్యాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడి విగ్రహాన్ని కూల్చడం అన్నం పెట్టిన చేతిని నరకడమేనని, ఈ దుశ్చర్యతోనే నీ పతనం ప్రారంభమైందని ఆదినారాయణ రెడ్డిని హెచ్చరించారు.


