breaking news
statue destruction
-
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం నీ పతనానికే నాంది
జమ్మలమడుగు: రాజకీయ భిక్ష పెట్టిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయించిన కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పతనం ప్రారంభమైందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వైఎస్సార్ కడప జల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి అనుచరులు ధ్వంసం చేయడం అత్యంత పిరికిపంద చర్య అని, ఇది వైఎస్సార్ అభిమానుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని మండిపడ్డారు. ఈ ఘాతుకానికి నిరసనగా గురువారం వైఎస్సార్సీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ప్రదర్శన చేపట్టాయి. అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ నరేష్ బాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అధికారంలో ఉంటేనే ఎగిరెగిరి పడుతూ ఇక్కడ కనిపిస్తావు. అధికారం లేని ఐదేళ్ల కాలంలో కనీసం 20 రోజులైనా ప్రజల్లో ఉన్నావా? ఓడినా, గెలిచినా రామసుబ్బారెడ్డి ధైర్యంగా ఇక్కడే ఉండి రాజకీయం చేస్తుంటే, నువ్వు మాత్రం బెంగళూరు, గోవా క్లబ్బుల చుట్టూ తిరిగావు‘ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ మేకపోతు గాంభీర్యాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడి విగ్రహాన్ని కూల్చడం అన్నం పెట్టిన చేతిని నరకడమేనని, ఈ దుశ్చర్యతోనే నీ పతనం ప్రారంభమైందని ఆదినారాయణ రెడ్డిని హెచ్చరించారు. -
వైఎస్ విగ్రహ ధ్వంసానికి విఫలయత్నం
వైఎస్సార్సీపీ నేతల ఆందోళన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ పోలీసుల అదుపులో నలుగురు యువకులు తాడికొండ : నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో శనివారం అర్ధరాత్రి కొందరు యువకులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశారు. గ్రామంలో కొద్ది రోజులనుంచి శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు గ్రామంలో కులాల వారీగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం రాత్రి కమ్మ కులస్థులు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఊరేగింపు దాటిన తరువాత స్థానిక జయభారత్ కాలనీ రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద నలుగురు యువకులు మద్యం సేవించి, బండరాయితో విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. విగ్రహం ముఖాన్ని రాయితో కొట్టడంతో పెచ్చులూడాయి. ఆదివారం ఉదయం స్థానికులు తెలుసుకోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఘటనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విగ్రహ ధ్వంసానికి తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులే కారణమని పేర్కొన్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని కొంతసేపు ఆందోళన చేశారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ జె అనూరాధ సంఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామానికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైఎస్సార్సీపీ నాయకులకు హామీ ఇచ్చారు. తమ నాయకుడి విగ్రహం ధ్వంసం చేయడంతో నిందితులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఉయ్యూరు వెంకటరెడ్డి, ఆరేకూటి లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నూతక్కి నరేంద్రబాబుతోపాటు నేతలు షేక్ జానీ, డి నాగేశ్వరరావు, వెంకటరెడ్డి, అధిక సంఖ్యలో ఎస్సీ, ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


