ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
తెనాలిరూరల్: విడాకుల కోసం పిటిషన్ వేసిన భార్యకు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేయడంతో విడాకులు మంజూరు చేయడంతోపాటు రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. వివరాలిలా ఉన్నాయి. దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన నాగ సౌజన్యకు 2016 ఏప్రిల్ 22న పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామానికి చెందిన యలవర్తి నాగబ్రహ్మంతో వివాహం జరిగింది.
భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని, అతనితో కలిసి జీవించే అవకాశం లేదని, తనకు ప్రాణ హాని ఉందని, విడాకులు ఇప్పించాలని కోరుతూ నాగ సౌజన్య తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో 2023లో పిటిషన్ దాఖలు చేసింది. 2024లో తన భార్యను కాపురానికి పంపుతూ ఆదేశించాలని నాగబ్రహ్మం ఇదే కోర్టులో పిటిషన్ వేశాడు. రెండు పిటిషన్‌లపై లోక్ అదాలత్‌లో రాజీ పడి విడాకులు పొందే విధంగా కోర్టు నుంచి అనుమతులు పొందారు. హడావిడి చేసి తనతో సంతకాలు పెట్టించుకున్నారని, లోక్‌అదాలత్‌లో రాజీని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసి, తెనాలి కోర్టులోని రెండు పిటిషన్లలో ప్రొసీడింగ్స్ జరగకుండా స్టే ఇవ్వాలని కోరగా హైకోర్టు స్టే ఇవ్వలేదు.
రెండు పిటిషన్‌లను కలిపి విచారించిన తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ (సీనియర్ డివిజన్) న్యాయమూర్తి, నాగ సౌజన్య దాఖలు చేసిన విడాకులు పిటిషన్‌ను అనుమతించి విడాకులు మంజూరు చేశారు. నాగబ్రహ్మం దాఖలు పిటిషన్‌ను కొట్టివేశారు. భార్యను మానసిక వేధింపులకు గురిచేయడమే కాకుండా విలువైన కోర్టు సమయాన్ని కూడా వృథా చేసినందుకుగాను రూ.లక్ష నష్టపరిహారం నాగ సౌజన్యకు చెల్లించాలని భర్తను ఆదేశిస్తూ న్యాయమూర్తి ఎస్.వెంకటేశ్వరరెడ్డి తెనాలి న్యాయస్థానాల చరిత్రలోనే సంచలమైన తీర్పును ఈ నెల 14న వెలువరించారు.


