టీడీపీ కబ్జాపై కొరడా!

Most of the land occupiers were TDP leaders with past govt help - Sakshi

విశాఖలో ఏడాదిలో ఏకంగా రూ.4,291 కోట్ల విలువైన భూములు స్వాదీనం 

సిటీ సహా జిల్లాలోని మండలాల్లో 430.81 ఎకరాలకు విముక్తి 

విశాఖ రూరల్‌లోనే రూ.1,691 కోట్ల విలువైన భూమి వెనక్కి 

మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీను చెరలో రూ.669.26 కోట్ల విలువైన భూమి 

కొన్నేళ్లుగా కంపెనీలకు లీజుకిచ్చి కోట్ల రూపాయల అక్రమార్జన 

ఆదివారం ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్న అధికారులు 

కబ్జాదారుల్లో అత్యధికులు టీడీపీ నేతలే; అధికారమే అండగా ఇష్టారాజ్యం 

ప్రభుత్వ కఠిన వైఖరితో కొరడా ఝుళిపిస్తున్న అధికారులు 

తట్టుకోలేక దుష్ప్రచారానికి దిగుతున్న అచ్చెన్న, అయ్యన్న, బండారు 

అధికారాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్ఛగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు. ప్రహరీలు కట్టేసుకున్నారు. కబ్జాదారుల్లో ఎక్కువ మంది టీడీపీ నేతలే కావటంతో అప్పటి ప్రభుత్వం అవేమీ చూడనట్లే నటించింది. దీంతో వారు చెలరేగిపోయారు. కానీ ప్రభుత్వం మారింది. సర్కారు భూముల్ని తిరిగి స్వా«దీనం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఏడాదిగా కొరడా ఝుళిపిస్తోంది. ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదంటూ... దాదాపు రూ.4,300 కోట్ల విలువైన భూముల్ని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. దీంతో ఉత్తరాంధ్ర టీడీపీ త్రయం అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు విషప్రచారానికీ వెనకాడటం లేదు. దీనికి తోడు ఎల్లో మాఫియా... రోజుకో రకం అసత్య ప్రచారాలకు దిగుతోంది. 

సాక్షి, విశాఖపట్నం: ఇవి ప్రభుత్వ భూములు. ఎందుకంటే రికార్డులు అబద్ధాలు చెప్పవు!. అందుకే వాటిని ప్రభుత్వం తిరిగి తన అదీనంలోకి తీసుకుంటోంది. మరి ఇప్పటిదాకా ఇవి ఎవరి అదీనంలో ఉన్నాయి? ఆ ప్రశ్నకు జవాబు తెలిస్తే... టీడీపీ నేతలు ఎంతటి ఘనులో అర్థమయిపోతుంది. తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఎంతటి అర్థం లేనివో, ఎందుకింత కడుపుమంటతో రగిలిపోతున్నారో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే గాజువాక నియోజకవర్గంలో మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువుల కబ్జాలో ఉన్న రూ.669.26 కోట్లు విలువైన 38.45 ఎకరాల్ని రెవెన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ భూముల్ని పల్లా సోదరుడు శంకరరావు, ఇతర బంధువులు ఆక్రమించుకోవటమే కాక... వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చేసి కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో వీటిని తిరిగి స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించారు. పల్లా భూకబ్జాలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
గాజువాక మండలం తుంగ్లాం రెవెన్యూ పరిధిలోని ఆటోనగర్‌ ఎఫ్‌ బ్లాక్‌లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ అధికారులు   

నెలన్నరపాటు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ అనంతరం పల్లా సోదరుడు శంకరరావు గాజువాక మండలం తుంగ్లాం, జగ్గరాజుపేట, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో 38.45 ఎకరాలను కబ్జాచేసినట్లు గుర్తించారు. 15 ఏళ్లకు పైగా ప్రభుత్వ భూములను ఆధీనంలో ఉంచుకుని వీటిని హెచ్‌పీసీఎల్, ఎల్‌అండ్‌టీ, మరికొన్ని ప్రైవేటు కంపెనీలకు లీజులకిచ్చి భారీగా ఆర్జించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు నివేదిక అందటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీవో పి.కిశోర్, గాజువాక తహసీల్దార్‌ లోకేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులు ఆదివారం ఆక్రమిత భూముల స్వా«దీన ప్రక్రియను చేపట్టారు. శంకరరావుకు నోటీసులిచ్చిన అనంతరం నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. పల్లా అనుచరులు అక్కడికి వచ్చి కొంత హడావుడి చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపు చేశారు. 
గతంలో ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది(ఫైల్‌)   

430.81 ఎకరాలు.. రూ.4,291.41 కోట్లు 
విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల సంరక్షణపై జిల్లా రెవిన్యూ అధికారులు ఏడాదికాలంగా చర్యలు చేపట్టారు. కబ్జాదారులు ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం మేరకు.. ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేసి రికార్డుల పరంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ.4,291.41 కోట్లు విలువ చేసే 430.81 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క విశాఖ రూరల్‌ మండలంలోనే అత్యధికంగా రూ.1,691 కోట్ల విలువైన భూముల్ని స్వా«దీనం చేసుకున్నారంటే కబ్జాదారులు ఏ స్థాయిలో చెలరేగిపోయారో అర్థంచేసుకోవచ్చు. అక్కడితో ఆగకుండా పదేపదే ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు సైతం నమోదు చేశారు. స్వా«దీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల చేతుల్లో ఉన్నవే. తమ భూబాగోతం బయటపడటంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగారు. అచ్చెన్న, అయ్యన్న, బండారు ఏకంగా ఆక్రమణలు తొలగిస్తున్న అధికారుల్ని కూడా తిడుతూ శాపనార్థాలు పెట్టారు. ఐఎఎస్‌లు, రెవిన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులు, పోలీసులపై నోటిదురుసుతనం ప్రదర్శించారు.  

టీడీపీ నేతల కబ్జా చెర నుంచి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న కొన్ని భూముల వివరాలు చూస్తే... 
– టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ మూర్తి గీతం విద్యాసంస్థల పేరుతో రుషికొండ, ఎండాడ పరిసరాల్లో సర్వే నంబర్‌ 15, 16, 17, 18, 19, 20, 55, 61లో ఉన్న 18.53 ఎకరాల్ని ఆక్రమించి దాని చుట్టూ ప్రహరీ నిర్మించేశారు. అదేవిధంగా రుషికొండలో సర్వే నం. 34, 35, 37, 38లో 20 ఎకరా>ల్లో గార్డెనింగ్, గ్రావెల్‌ బండ్‌తో పాటు వివిధ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిని గుర్తించిన అధికారులు 2020 అక్టోబర్‌ 24న అక్రమ నిర్మాణాల్ని తొలగించి.. స్వా«దీనం చేసుకున్నారు. 
– ఆనందపురం–శొంఠ్యాం సమీపంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు సహా పలువురు టీడీపీ నేతలు టైటిల్‌ డీడ్‌ నం.1180లో ఆక్రమించుకున్న  రూ.256 కోట్లు విలువ చేసే 64 ఎకరాల భూముల్ని గతేడాది నవంబర్‌లో స్వాదీనం చేసుకున్నారు.  
– టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో సర్వే నం.156లో సుమారు 60 ఎకరాల భూమిని ఆక్రమించేసుకోగా.. గతేడాది డిసెంబర్‌లో రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఈ భూముల మార్కెట్‌ విలువ సుమారు రూ. 300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
– టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆక్రమించిన రుషికొండ బీచ్‌రోడ్డులో సర్వే నం.21లో సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. 
– టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధువర్గం పేరుతో గాజువాక నియోజకవర్గంలో మూడు రెవిన్యూ గ్రామాల పరిధిలోని సుమారు రూ.669.26 కోట్లు విలువ చేసే 38.45 ఎకరాల్ని ఆదివారం రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 
– టీడీపీ హయాంలో ప్రభుత్వ భూమిని ప్లే గ్రౌండ్‌గా మార్చి.. దర్జాగా కబ్జా చేసిన  విశ్వనాధ విద్యాసంస్థల నుంచి  ఆనందపురంలో సర్వే నంబర్‌ 122, 123లోని రూ.15 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల భూమిని గతేడాది నవంబర్‌లో రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top