
ఎంపీ మిథున్‌రెడ్డిని కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు
ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు
రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశం
ఎంపీగా కల్పించే సౌకర్యాలన్నింటినీ మిథున్‌కి కల్పించండి
వెంట మందులు తీసుకెళ్లేందుకు అనుమతించండి
విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టారు
నేను ఎలాంటి తప్పూ, నేరం చేయలేదు
కోర్టుకు నివేదించిన ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు ఆదివారం విజయవాడ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. మిథున్‌రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించింది. ఓ పార్లమెంట్ సభ్యుడికి నిబంధనల ప్రకారం జైలులో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో వాటన్నింటినీ మిథున్‌రెడ్డికి కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. వెంట మందులు తీసుకెళ్లేందుకు మిథున్‌రెడ్డికి అనుమతినిచ్చింది.
ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం అక్రమ కేసులో నాలుగో నిందితునిగా ఉన్న మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘ విచారణ తరువాత శనివారం రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం కోర్టు ఎదుట హాజరుపరిచే ముందు మిథున్‌రెడ్డిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ఈసీజీ, బీపీ, షుగర్ వంటి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయనను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు.
రాజకీయ కక్ష సాధింపుతో నాపై కేసు పెట్టారు
ఈ సందర్భంగా మిథున్‌రెడ్డితో న్యాయాధికారి మాట్లాడారు. ఊరు, పేరు, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబంలో ఎంత మంది ఉంటారు.. వంటి వివరాలు అడిగారు. వాటన్నింటికీ మిథున్‌రెడ్డి సమాధానం చెప్పారు. తనపై దురుద్దేశాలతో, రాజకీయ కారణాలతో ఈ కేసు నమోదు చేశారని మిథున్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. తానెలాంటి తప్పు గానీ, నేరం గానీ చేయలేదన్నారు. కోర్టు ముందు హాజరుపరిచే ముందు వైద్యులు తనకు రెండుసార్లు ఈసీజీ పరీక్షలు నిర్వహించారని, రెండింటికీ తేడాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల తనకు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన కోర్టుకు నివేదించారు.
ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి..
ఆ తర్వాత మిథున్‌రెడ్డి తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. మిథున్‌రెడ్డి మూడు పర్యాయాల నుంచి ఎంపీగా ఉన్నారని తెలిపారు. ఆయన లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కూడా వ్యవహరించారని వివరించారు. ఆయనకున్న ప్రాణహాని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించిందని నాగార్జునరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో జైలులో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే వెంట మందులు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని కోరారు. పిటిషనర్‌కు రిమాండ్ విధిస్తే తగిన సౌకర్యాలు ఉన్న నెల్లూరు కేంద్ర కారాగారానికి గానీ, రాజమండ్రి కేంద్ర కారాగారానికి గానీ పంపాలని కోరారు. జైలులో వీఐపీ బ్యారెక్ కేటాయించాలని అభ్యర్థించారు.
కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు వీలుగా జైలులో ఎక్కువ ములాఖాత్‌లను మంజూరు చేయాలని కోర్టును కోరారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిట్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ మద్యం విధానంలో మిథున్‌రెడ్డిది కీలక పాత్ర అని తెలిపారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మిథున్‌రెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరారు. నెల్లూరు, రాజమండ్రి కేంద్ర కారాగారాలకు కాకుండా, విజయవాడ లేదా గుంటూరు జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి ఆగస్టు 1 వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించింది.

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు మిథున్‌రెడ్డి
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాత్రి 8.38 గంటలకు తీసుకొచ్చారు. జైలు అధికారుల ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఆయనకు కేటాయించిన బ్యారక్‌లోకి తీసుకెళ్లారు. పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కాకినాడ వెళ్లే రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. 144 సెక్షన్, 30 సెక్షన్లు అమలు చేశారు.
మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుపై వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఆయనకు మద్దతుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలి వచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. పార్టీ నేతలు జైలు వద్ద నిరసనకు దిగారు. జైలు గేటు ఎదురుగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ బైఠాయించి, నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.