పునాదులు కదులుతాయనే ప్రతిపక్షాల కుట్రలు..

Minister Kodali Nani Fires On Chandrababu - Sakshi

మంత్రి కొడాలి నాని

సాక్షి, గన్నవరం: ప్రతిపక్షనేత చంద్రబాబు కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చిన రోజే.. రాష్ట్ర ప్రజలకు సొంత ఇళ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. గురువారం కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జరిగిన ‘నవరత్నాలు-పేదలకు ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. 2631 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. (చదవండి: చంద్రబాబుపై పోలీస్‌ అధికారుల సంఘం ఆగ్రహం)

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తే.. పునాదులు కదులుతాయని  ప్రతిపక్షాలు కుట్రపన్నాయని దుయ్యబట్టారు. 25 కోట్లు ఖర్చు చేసి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో లాయర్లను పెట్టి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని స్టే తీసుకువచ్చారని మండిపడ్డారు. దుర్మార్గపు ఆలోచనలు చేయడంలో చంద్రబాబు ఆద్యుడు. ఆయనకి కొన్ని డబ్బా చానల్స్ వత్తాసు పలుకుతూ హడావుడి చేస్తున్నాయని కొడాలి నాని ధ్వజమెత్తారు.(చదవండి: ‘బాబు మత రాజకీయాలు.. పతనం తప్పదు..’)

అవన్నీ మెండుగా ఉన్న వ్యక్తి సీఎం జగన్‌: ఎంపీ బాలశౌరి
చర్రితలో నిలిచిపోయే కార్యక్రమాలు చేయాలంటే, గుండె ధైర్యం, కృషి, పట్టుదల ఉండాలని,అవన్నీ మెండుగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎంపీ బాలశౌరి అన్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదల గుండె చప్పుడు అయ్యారని, నేడు సీఎం వైఎస్‌ జగన్‌.. పేదల సొంతింటి కల నెరవేర్చి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు చేయాలంటే ఒక్క వైఎస్సార్‌ కుటుంబానికే సాధ్యమన్నారు. వైఎస్సార్‌ 1 రూపాయికే వైద్యం చేసి.. వృత్తికే వన్నె తీసుకువస్తే.. సీఎం జగన్‌ 1 రూపాయికే 30 లక్షల 70 వేలు టిడ్కో ఇళ్లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: ఎమ్మెల్యే వంశీ
పేదల సొంతింటి కలను సీఎం వైఎస్‌ జగన్‌ సాకారం చేస్తున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గొప్పలు కోసం లక్ష పట్టాలు అని డబ్బా కొట్టుకొని స్థలం చూపించలేకపోయారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. అందరికీ స్థలం,ఇల్లు నిర్మించి ఇస్తున్నారన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించేవారే అసలైన నాయకుడన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు.. పసుపు-కుంకుమ పేరు చెప్పి ప్రజల దగ్గరకు వెళ్తే చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. చెప్పింది చేసే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని వల్లభనేని వంశీ అన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top