ప్రహసనంగా 1.20 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాల వేల్యూషన్
తొలుత ఆన్‌లైన్ మార్కింగ్ సిస్టంతో మూల్యాంకనం పూర్తి
‘కోఎంప్ట్’ వ్యవహారంతో వేల్యూషన్ రద్దు చేసి మాన్యువల్ విధానం అమలు
ఈసెట్–2026 కోసమంటూ ఐదవ సెమిస్టర్ పేపర్ల వేల్యూషన్ పూర్తి, ఫలితాల వెల్లడి
ఇక్కడా ‘కీ’ పేపర్ లేకుండా ఇష్టానుసారం మార్కులు వేసినట్లు విమర్శలు
పైగా చివరి సంవత్సరం బ్యాక్‌లాగ్స్‌పై ఇంకా వీడని అనిశ్చితి
జూలై చివరినాటికి కూడా మూల్యాంకనం పూర్తయ్యే అవకాశం లేని పరిస్థితి
అయోమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
సాక్షి, అమరావతి: విద్యాశాఖ నిర్లక్ష్యం, అధికారుల తప్పులతో పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడ్డాయి. పరీక్షల మూల్యాంకన ప్రహసనం తమ భవిష్యత్తును ప్రభుత్వం తీవ్ర అనిశ్చితి, గందరగోళంలో పడేస్తోందని పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరి ఏడాది విద్యార్థులకు సంబంధించిన బ్యాక్‌లాగ్స్‌సహా మూడేళ్లకు సంబంధించి మొత్తం 1.20 లక్షల మంది విద్యార్థుల 7.5 లక్షల స్క్రిప్టుల మూల్యాంకనం జూలై చివరినాటికీ పూర్తయ్యే అవకాశం కనిపించడంలేదని పేర్కొంటున్నారు.
నిర్లక్ష్యానికి నిలువుటద్ధం
» ఈ ఏడాది కొత్తగా మొత్తం మూడేళ్ల జవాబు పత్రాల మూల్యాంకనంలో ‘‘ఆన్ స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వేల్యూషన్’’ (వోఎస్‌ఎం) అమలు చేశారు. ఒక్కో ఎగ్జామినర్ 24 గంటల సమయంలో ఎన్ని జవాబు పత్రాలైనా మూల్యాంకనం చేసుకునేలా అవకాశం ఇచ్చిన అధికారులు, మే చివరి నాటికి మొత్తం వేల్యూషన్ పూర్తిచేసి ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు.
» ఆన్‌లైన్ వేల్యూషన్‌ను ‘కోఎంప్ట్’ సంస్థకు అప్పగించి ఇది ఎంతో గొప్ప విధానమంటూ ప్రచారం చేశారు. అయితే, సీబీఎస్‌ఈ ఫలితాల్లో కోఎంప్ట్ సంస్థ తప్పు బయటపడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాంతో నాలుక కరుచుకున్న అధికారులు అప్పటికే కోఎంప్ట్ పూర్తిచేసిన వేల్యూషన్‌ను రద్దు చేసి మాన్యువల్ విధానాన్ని అమలుచేశారు.
» త్వరలో జరగనున్న ఈసెట్–2026 కౌన్సెలింగ్‌కు అనువుగా మొదట పాలిటెక్నిక్ చివరి ఏడాది ఐదో సెమిస్టర్‌కు చెందిన 35 వేల మంది విద్యార్థుల పేపర్లు మూల్యాంకనం పూర్తి చేసి ఇటీవల ఫలితాలు విడుదల చేశారు.
» అయితే, ఈ విద్యార్థులు రాసిన బ్యాక్‌లాగ్స్ అంటే మూడు, నాలుగో సెమిస్టర్లలో ఫెయిలైన విద్యార్థులు రాసిన పరీక్షల సంగతి వదిలేశారు. బ్యాక్‌లాగ్స్ పేపర్లు క్లియర్ చేయకుండా వారు ఈసెట్ కౌన్సెలింగ్‌కు వెళ్లే అవకాశం లేదు. చివరి ఏడాది విద్యార్థుల బ్యాక్‌లాగ్ పేపర్లు ఎన్నో, ఎలా గుర్తించాలో సాంకేతిక విద్యాశాఖకు అంతుచిక్కడం లేదు.
» ఈ నేపథ్యంలో మొదటి ఏడాది పేపర్లతో పాటు, రెండు, మూడు, నాలుగు సెమిస్టర్ల జవాబు పత్రాలను కూడా మూల్యాంకనం చేయాలి. దీనిప్రకారం మొత్తం మూడేళ్లకు సంబంధించిన 7.5 లక్షల స్క్రిప్టుల మూల్యాంకనం జూలై చివరినాటికి పూర్తయ్యే అవకాశం కనిపించడంలేదు.
»మరోవైపు ఎగ్జామినర్లు పేపర్లు మూల్యాంకనం చేయాలంటే సబ్జెక్టుల్లో మార్కుల సమానత కోసం జవాబులతో కూడిన ‘కీ’ పేపర్ తప్పనిసరి. దీని ఆధారంగానే మార్కుల విభజన చేస్తారు.
» కానీ ఐదో సెమిస్టర్ మాన్యువల్ వేల్యూషన్‌లో కీలకమైన ‘కీ’ పేపర్ లేకుండా ఇష్టానుసారం మార్కులు వేసినట్టు విశ్వసనీయ సమాచారం.
» విద్యాశాఖ చరిత్రలో ‘కీ’ పేపర్ లేకుండా జవాబు పత్రాల మూల్యాంకనం గతంలో ఎన్నడూ జరగలేదని, ఈ తరహా విధానంతో విద్యార్థుల జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
సీవోఈపై ‘కోఎంప్ట్ తో కాంట్రాక్టు’ నెపం!
మరోవైపు ‘కోఎంప్ట్’ ఆరోపణలు వెల్లువెత్తడంతోనే ఆ సంస్థతో వోఎస్‌ఎంకు సంబంధించి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కాంట్రాక్టుకు సాంకేతిక విద్యలో పరీక్షల కంట్రోలర్ (సీవోఈ)ని బాధ్యుడిని చేస్తూ బదిలీ వేటు పడింది. కోఎంప్ట్ కు కాంట్రాక్టును కట్టబెట్టిన వారిని వదిలేసి సీవోఈపై చర్యలు తీసుకోవడం శాఖలో చర్చనీయాంశమైంది.
ఆ డబ్బు ఎవరి నుంచి వసూలు చేస్తారు?
పాలిటెక్నిక్ వార్షిక పరీక్షల ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని వోఎస్‌ఎం విధానంలో మూల్యాంకనం పూర్తి చేశారు. వోఎస్‌ఎం విధానంలో 7.5 లక్షల జవాబు స్క్రిప్టులను మూల్యాంకనం పూర్తి చేశారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో విడుదల చేసిన స్వల్ప వ్యవధిలోనే వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. అనంతరం ఆ ఫలితాలను రద్దుచేసి మాన్యువల్ మూల్యాంకనం ప్రారంభించారు. ఇటీవల పాలిటెక్నిక్ చివరి ఏడాది (ఐదో సెమిస్టర్) ఫలితాలను విడుదల చేశారు. తాజాగా చివరి ఏడాది విద్యార్థుల సప్లిమెంటరీ పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు.
అయితే, వీటిపై సరైన స్పష్టత లేకుండా ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఈ స్క్రిప్టుల మూల్యాంకనం సోమవారం నాటికి పూర్తి చేయాలని అధికారులు ఎగ్జామినర్లపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. దీంతో ఎగ్జామినర్లు నచ్చిన రీతిలో మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే, ఆన్‌లైన్ మూల్యాంకనం రద్దు చేసినా ఒక్కో స్క్రిప్టునకు ఎగ్జామినర్‌కు, చీఫ్ ఎగ్జామినర్‌కు రూ.18 చొప్పున రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది.
మాన్యువల్ మూల్యాంకనానికి అదనంగా మరో రూ.150 కోట్లకు పైగా చెల్లించాలి. ఇవిగాక కోఎంప్ట్ కు చెల్లించిన రూ.3 కోట్లు విద్యార్థుల ఫీజుల రూపంలో చెల్లించినవే! ఈ నిధులు ఎవరి నుంచి వసూలు చేస్తారో చూడాలి. తాజా పరిణామాల నేపథ్యంలో ఆన్‌లైన్ మూల్యాంకనం పూర్తిచేసినందున తమ రెమ్యునరేషన్ రూ.1.50 కోట్లు చెల్లించాలని ఎగ్జామినర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇస్తారో? లేదో? అధికారులు స్పష్టతనీయడం లేదు.
సాక్షి చెప్పినా.. పట్టించుకోని పరిస్థితి
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎస్‌బీటీఈటీ) 2025–26 విద్యా సంవత్సరంలో వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఆన్‌లైన్ విధానం అమలు చేసి ఆన్ స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వేల్యూషన్’’ (వోఎస్‌ఎం) సాంకేతిక పరిజ్ఞానాన్ని రూ.3 కోట్లు వెచ్చించి ‘కోఎంప్ట్’ సంస్థ నుంచి కోనుగోలు చేశారు. తద్వారా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడమేకాకుండా, మొత్తం మూడేళ్లకు సంబంధించిన 7.5 లక్షల స్క్రిప్టుల మూల్యాంకన ప్రక్రియను అప్పగించి, 1.20 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఆ సంస్థ చేతిలో పెట్టారు.
ఒక్కో స్క్రిప్టు మూల్యాంకనం చేసేందుకు రూ.18 చొప్పున ఎగ్జామినర్లకు చెల్లించాలని నిర్ణయించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వోఎస్‌ఎం పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో తప్పులు జరుగుతున్నాయని అప్పట్లోనే ఆధారాలతో సహా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అయితే, ఆ కథనాన్ని ఖండించిన అధికారులు కోఎంప్ట్ ఆన్‌లైన్ విధానం ఉత్తమమైనదిగా ప్రకటించారు. పెద్దల సిఫారసుతో కాంట్రాక్టును ఆ సంస్థకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదే సంస్థ సీబీఎస్‌ఈ ఫలితాల్లో చేసిన తప్పులు బయటపడడంతో ఆ సంస్థ ఆన్‌లైన్ మూల్యాంకనాన్ని రద్దు చేసి మాన్యువల్ మూల్యాంకనం చేపట్టారు.


