100 సవర్ల బంగారం, కేజీ వెండి, రూ.45వేలు నగదు అపహరణ
నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలోని 100 సవర్ల బంగారం, కిలో వెండి, రూ.45వేల నగదు దోచుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గాడిపర్తి సుబ్బారావు, భారతీదేవి దంపతులు ప్రకాష్‌నగర్‌లో నివసిస్తున్నారు. నాదెండ్ల మండలం గణపవరంలోని కుమార్తె వద్దకు ఈనెల 4న వెళ్లారు.
ఆదివారం మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి పరిశీలించగా బీరువా తెరిచి ఉంది. బీరువాలోని బంగారం, వెండి వస్తువులు, నగదు కనిపించలేదు. వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఫిరోజ్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ నమూనాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.


