మా ఆకలి కేకలు చెవికెక్కవా? | Massive protest by contract employees of the Medical Department in Vijayawada | Sakshi
Sakshi News home page

మా ఆకలి కేకలు చెవికెక్కవా?

Jun 18 2026 4:37 AM | Updated on Jun 18 2026 4:37 AM

Massive protest by contract employees of the Medical Department in Vijayawada

విజయవాడలో జరిగిన భారీ ధర్నాలో పాల్గొన్న వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు

కోవిడ్‌లో ప్రాణాలకు తెగించి సేవలందించిన మాపై ఇంత చిన్నచూపా?  

నాలుగు నెలలుగా వేతనాల్లేక అవస్థలు పడుతున్నా పట్టదా? 

చంద్రబాబు ప్రభుత్వంపై చిరుద్యోగుల ఫైర్‌  

విజయవాడలో వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల భారీ ధర్నా

సాక్షి, అమరావతి : ‘కోవిడ్‌లో ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలు అందించిన మేమంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు? నాలుగు నెలలుగా వేతనాల్లేక మా కుటుంబాల్లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. వేతనాలు ఇవ్వమని ఎంతగా  ప్రాథేయపడుతున్నా పట్టించుకోవడంలేదు. మా ఆకలి కేకలు ప్రభుత్వం చెవికెక్కవా?’.. అంటూ స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఇంటి అద్దెలు, కుటుంబ అవసరాలతో పాటు పిల్లల స్కూలు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్‌ కొనుగోలుకు చేతిలో చిల్లిగవ్వలేక నానాపాట్లు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్‌ వేతనాల మంజూరుతో పాటు, ఇతర సమస్యల పరిష్కారం కోసం వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది విజయవాడ ధర్నాచౌక్‌లో బుధవారం భారీ నిరసనకు దిగారు. రాష్ట్రం నలు­మూ­లల నుంచి వేలాది చిరుద్యోగులు ఈ ని­ర­స­న­లో పాల్గొన్నారు. మండుటెండను సైతం లెక్క­చే­యకుండా ప్రభుత్వ మొండివైఖరిని నిరసించారు.

కడుపు మాడుస్తున్నారు..
ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలిస్తామని మేనిఫెస్టోలో హామీలిచ్చి ఇప్పుడు గద్దెనెక్కాక తమ కడుపు మాడుస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పుల పాలవుతున్నామని మహిళా ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. కొత్తగా అప్పు కూడా పుట్టట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులకు వంద శాతం గ్రాస్‌ వేతనం చెల్లింపు ఉత్తర్వుల అమలులోను ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. ఈ ధర్నాకు ప్రభుత్వ వైద్యులు, ఎన్‌హెచ్‌ఎం, వైద్య శాఖలోని ఇతర ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.

పిల్లల చదువులు కష్టమవుతున్నాయి
ప్రభుత్వం  నాలుగు నెలలు­గా వేతనాలు ఆపేసింది. ఇలా అయితే మా కుటుంబాలు ఎలా బతకాలి? ఇప్పు­డు పిల్లల ఫీజులు, యూనిఫాం, పుస్తకాల కొనుగోలుకు రూ.వే­ల­ల్లో ఖర్చు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నెలలకొద్దీ జీతాలు ఇవ్వకపోతే ఎలా? కోవిడ్‌ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తే మమ్మల్ని దేవుళ్లుగా కీర్తించారు. ఇప్పుడు జీతాల కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది.– జె. విజయ, స్టాఫ్‌ నర్సు, పల్నాడు జిల్లా

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి..
కాంట్రాక్టు ఉద్యో­గులపట్ల ప్రభుత్వం ఎంతో వివక్ష చూపు­తోంది. శాశ్వత ఉద్యో­గులతో సమా­నంగా మేం పనిచేస్తున్నాం. కానీ, వేతనాల చెల్లింపులో మాత్రం మాపట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.  – మంగ, స్టాఫ్‌ నర్సు, ఏలూరు జిల్లా

ఎంతో వేడుకున్నాం.. అయినా ఫలితంలేదు..
వేతనాలు అందక చిరు­ద్యోగులందరూ ఎంతో ఇబ్బ­ందిపడుతున్నారని ప్రభు­త్వం దృష్టికి పలు­మార్లు తీసుకెళ్లాం. అధికారుల చుట్టూ తిరిగి నా ఫలితంలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో రోడ్డెక్కాం. ఇప్పటికైనా ప్ర­భుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించాలి . – అజయ్, రాష్ట్ర కన్వీనర్, ఏపీ కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సె­స్, అలైడ్‌ హెల్త్‌ ప్రొఫెషనల్స్‌ యూనియన్‌ 

ప్రధాన డిమాండ్లు..
»  కాంట్రాక్టు నర్సులు, అలైడ్‌ హెల్త్‌ కేర్‌ సిబ్బంది అందర్నీ క్రమబద్ధీకరించాలి. అప్పటివరకూ 100 శాతం గ్రాస్‌ వేతనం వెంటనే అమలుచేయాలి.
» విధుల్లో మరణించిన కాంట్రాక్టు ఉద్యో­గి కుటుంబానికి రూ.15 లక్షల పరి­హారం అందించాలి. అలాగే, ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వో­ద్యోగం ఇవ్వాలి. 
» పరస్పర, స్పౌజ్‌ కోటా బదిలీలకు అవకాశం కల్పించాలి.
» శాశ్వత ఉద్యోగులకు ఇచ్చినట్లే కాంట్రా­క్టు ఉద్యోగులకు పెయిడ్‌ సిక్‌ లీవ్స్, ఈ­హెచ్‌ఎస్‌ కార్డులు మంజూరు­చేయా­లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement