
గత ఏడాది శివరాత్రిన ప్రియడితో వెళ్లిపోయే ప్రయత్నం
అనూహ్యంగా.. హత్య కేసులో ఆర్నెలు జైల్లో!
తిరిగొచ్చి భర్తతో సజావుగా కాపురం
ఈ యేడు శివరాత్రి ఉత్సవాలలో బలవన్మరణం
పలమనేరు: కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుందని గుర్తు చేసే ఘటన సోమవారం పలమనేరులో వెలుగు చూసింది. ఓ వివాహిత భర్తను, పిల్లలను కాదనుకుని ప్రియుడితో వెళ్లేందుకు ప్రయత్నించింది. అనూహ్యంగా.. ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపింది. బయటకు వచ్చిన ఆమెను భర్త పెద్ద మనసుతో స్వీకరించాడు. అయితే చిన్నపాటి గొడవకే ఇప్పుడు ఆమె బలవన్మరణానికి పాల్పడింది. గత ఏడాది.. ఈ ఏడాది.. శివరాత్రి సందర్భంలోనే ఈ ఘటన జరగడం ఇక్కడ గమనార్హం.
మున్సిపాలిటీ పరిధిలోని బోడిరెడ్డిపల్లికి చెందిన జగన్నాథం భార్య కోమల (36) బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం ఉదయం ఇంట్లో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె జల్లిపేట చెరువులో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో శివరాత్రి పూట ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గత శివరాత్రి నాడు ఏం జరిగిందంటే...
గడ్డూరుకు చెందిన కోమలకు జగన్నాథంతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. కిందటి ఏడాది.. శివరాత్రి పర్వదినాన జాగరణ పేరిట గుడి వెళ్తున్నానని చెప్పి.. కొలమాసనపల్లికి చెందిన గౌతం(26)తో వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. బైక్‌పై గడ్డూరు శివారులోని జగమర్ల అడవి వైపుగా వెళ్లారు. అయితే అప్పటికే జంటలను టార్గెట్ చేసే సైకో వినయ్ కంట వీళ్లు పడ్డారు.
పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన వినయ్.. ఏకాంతం కోసం అడవుల్లోకి, పార్క్‌ల్లోకి వచ్చే జంటను బెదిరించి బంగారం, డబ్బులు, స్మార్ట్‌ఫోన్లు చోరీ చేసేవాడు. అంతటితో ఆగకుండా బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారాలు చేసేవాడు. అలా.. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సైకో వినయ్‌పై కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో.. కోమల, గౌతంలను వినయ్ బెదిరించాడు. అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో రాడుతో దాడికి పాల్పడబోయాడు. అయితే జరిగిన పెనులాగటలో వినయ్ కింద పడిపోగా.. గౌతం పక్కనే ఉన్న బండరాయి పడేశాడు. దీంతో వినయ్ అక్కడిక్కడే మరణించాడు. ఆపై ఏమీ తెలియనట్లు గౌతం, కోమల అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత ఈ హత్యోదంతం వెలుగుచూసింది. దీంతో భయపడిన ఇద్దరూ అతన్ని చంపింది తామేనని పోలీసులకు లొంగిపోయారు.
ఇప్పుడేమైందంటే...
ఆరు నెలల తర్వాత కోమలను ఆమె తల్లిదండ్రులు బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు. మళ్లీ తప్పు చేయనని మాట తీసుకుని భర్త ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అప్పటి నుంచి అంతా హాయిగా నడుస్తోంది. ఈ క్రమంలో చిన్నపాటి గొడవకు తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ప్రాణం తీసుకోవడం ఆ ఇంట విషాదం నింపింది. ఇదంతా ఆ శివుడే ఆడించిన ఆట అంటూ గ్రామస్తులు పలువురు చర్చించుకుంటున్నారు.