
ఆస్తి కాజేసి ఉడాయిస్తున్న యువతులు
మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తుల ఫోన్ స్విచ్ ఆఫ్
‘పెళ్లి కాని ప్రసాద్’లనే టార్గెట్ చేస్తున్న మోసగాళ్లు
పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
సాక్షి, పుట్టపర్తి : గతంలో పెళ్లంటే... పెద్దలు కూర్చుని బంధువర్గాల్లో ఈడు, జోడు చూసి సంబంధం కుదుర్చేవారు. ఎక్కువగా బంధువర్గాల్లోని అమ్మయిలతోనే వివాహం జరిపించేవారు. కానీ ప్రస్తుత కాలంలో అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. ఫలితంగా 30 ఏళ్లు దాటి.. 40 ఏళ్లకు సమీపిస్తున్నా.. పెళ్లి సంబంధాలు వెతుకుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. దీంతో ‘పెళ్లి కాని ప్రసాద్’ లను లక్ష్యంగా చేసుకుని కొందరు యువతులు, మ్యారేజీ బ్యూరో నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి పేరుతో బంగారు నగలు, నగదు చేజిక్కించుకుని ఉడాయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఆస్తి రాయించుకుని అడ్డం తిరుగుతున్నారు.
వయసు మీరితే మోసపోయినట్లే..
అప్పట్లో అబ్బాయిలకు 21, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితేనే వివాహం జరిపించే వాళ్లు. అయితే ప్రస్తుతం ఉద్యోగాల వేటలో పడి 30 ఏళ్లు దాటినా పెళ్లి సంబంధాలు చూడటానికి యువకులు మొగ్గు చూపటం లేదు. ఆ తర్వాత ఏదో ఉద్యోగం లభించాక పెళ్లి సంబంధాలకు వెళ్తే...అమ్మాయిల కోర్కెల చిట్టా చూసి ఖిన్నులవుతున్నారు. రూ.లక్షల్లో జీతంతో పాటు అత్తమాత బాదరబందీ ఉండకూడదంటూ షరతులు పెడుతున్నారు. దీంతో యువకులు నచ్చిన భాగస్వామి కోసం మ్యారేజీ బ్యూరోలను సంప్రదిస్తున్నారు. ఇదే అదునుగా మధ్యవర్తులు ఇతర ప్రాంతాల అమ్మాయిలను ఒప్పించి.. ఒకట్రెండు నెలలు కాలయాపన చేసి.. ఆలోపు డబ్బులు, ఆస్తులు లాగేసుకుని పరారవుతున్నారు.
కొన్ని సామాజిక వర్గాల్లో మరీ కష్టం..
కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల సంఖ్య మరీ దారుణంగా ఉంది. మండలానికి నాలుగైదు కుటుంబాలు ఉండే కులాల్లోని యువకులకు పెళ్లి పెద్ద సమస్యగా మారింది. మరోవైపు ఆస్తి తక్కువగా ఉండే అగ్రవర్ణ యువకులదీ ఇదే పరిస్థితి. ఫలితంగా యువకులు... ఎవరైతే ఏంటి..పెళ్లయితే చాలు అనే పరిస్థితికి వచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్లి సామాజికవర్గం ఏదైనా సరే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లిచేసుకుని వస్తున్నారు. అయితే రెండు, మూడు నెలల్లోనే సదరు యువతులు టోకరా వేసి బంగారం, నగదుతో ఉడాయిస్తున్నారు.
⇒ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచుపల్లికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి మ్యారేజీ బ్యూరో ద్వారా భీమవరానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. సంబంధం కుదిర్చిన ఇద్దరు వ్యక్తులకు రూ.4 లక్షలు చెల్లించాడు. అయితే వివాహం తర్వాత సదరు యువతిని రైలులో భీమవరానికి తీసుకువెళ్లగా.. రైల్వే స్టేషన్ నుంచే ఆమె ఉడాయించింది. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. పెళ్లి చేసిన మధ్యవర్తుల నంబర్లూ పనిచేయలేదు. దీంతో బాధితుడు తిరిగివచ్చి.. హిందూపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన 2024 అక్టోబరులో వెలుగు చూసింది.
⇒ నాలుగు నెలల క్రితం ధర్మవరానికి చెందిన ఓ యువతిని పుట్టపర్తిలో పని చేసే ఓ ఉద్యోగి పెళ్లి చూపులు చూశాడు. ఆ వెంటనే సదరు యువతి బంధువులు పెళ్లిపత్రికలు ప్రింట్ చేయించారు. తాను పెళ్లికి అంగీకారం తెలపకుండానే పత్రికలు ఎలా ప్రింట్ చేయించారని అడగ్గా... తనను మోసం చేశాడని రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని సదరు యువతి నాలుగు నెలల క్రితం నానా రభస చేసింది. దీంతో ఆ ఉద్యోగి అప్పటి నుంచి పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.