
తాడేపల్లి: ఎన్నికల సమయంలో హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం.. వేధింపులే లక్ష్యంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. రెడ్‌బుక్ పేరుతో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లని సైతం వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం దెబ్బకి పారిశ్రామిక వేత్తలు కూడా ఏపీ నుండి పరారవుతున్నారని భరత్ స్పష్టం చేశారు.
''చంద్రబాబు గత పాలనలో భారీగా లిక్కర్ స్కాం జరిగింది. రూ.5 వేల కోట్లకు పైగా నిధులను కొల్లగొట్టారు. ఆ కేసులో చంద్రబాబు నిందితుడు. కానీ జగన్ ప్రభుత్వంలో రూ.24 వేల కోట్ల ఆదాయం వచ్చింది. జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరిగి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వచ్చింది?'' అని మార్గాని భరత్ ప్రశ్నించారు.
‘ఇప్పుడు చంద్రబాబు పాలనలో మళ్ళీ తమ మనుషులకు దోచి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. వాట్సప్‌లో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. పర్మిట్ రూములు పెట్టి అమ్ముతున్నారు. మరి ఇంత చేసినా ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు రావటం లేదు?, ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?, దీనిని డైవర్షన్ చేసేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారు’ అని భరత్ వివరించారు.
చంద్రబాబు.. జగన్ చుట్టూ ఉన్న వారిని టార్గెట్ చేశారు. నిజాయితీ కలిగిన అధికారులను పక్కన పెట్టి తమకు కావాల్సిన వారిని సిట్‌లో వేశారు. వారి ద్వారానే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించాలి. ఇప్పుడు చేస్తున్న ప్రతి అక్రమ అరెస్టుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రతిఫలం అనుభవిస్తారు’ అని భరత్ హెచ్చరించారు.
రాష్ట్రంలో ఏ పంటకూ సరైన ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అక్రమ కేసులు ఆపి, ముందు రైతాంగానికి మేలు చేయండి. దావోస్ వెళ్ళి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకు రాలేక పోయారు. జిందాల్ ఏపీ నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఇవి మాత్రమే కాకుండా.. జైళ్లలో అధికారులను కూడా ఉన్నపళంగా బదిలీలు చేయటం వెనుక కారణం ఏంటి?, జైళ్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని భరత్ వెల్లడించారు.