
రైతులను మగ్గబెట్టి నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కారు ఎదురుదాడి
కిలో రూ.12 చొప్పున కొనుగోలు అంటూ బుకాయింపు
సొంతంగా కిలో కొన్నదీ లేదు.. కనీసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చిందీ లేదు
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రోడ్లపై పారబోస్తున్న ‘తోతాపురి’ పండించిన రైతన్నలు
కర్ణాటకలో మామిడి రైతులకు అండగా నిలిచిన ‘జేడీఎస్’ కుమారస్వామి
కేంద్రమంత్రి ఒక్క లేఖ రాయడంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం
కిలో రూ.16 చొప్పున ఏకంగా 2.50 లక్షల టన్నుల మామిడి సేకరణకు సిద్ధం
ఏపీలో చేష్టలుడిగి చూస్తున్న టీడీపీ – జనసేన ఎంపీలు, కేంద్ర మంత్రులు
కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు ప్రాణ వాయువు అందిస్తున్నా కనీస స్పందనేది?
టీడీపీ కూటమి నేతలకు చేవలేదంటూ మండిపడుతున్న రైతులు, రైతు సంఘాలు
సాక్షి, అమరావతి: మామిడి రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడికి దిగుతోంది. ప్రాసెసింగ్ కంపెనీలతో కిలో రూ.12 చొప్పున కొనుగోలు చేయిస్తున్నామని.. కిలోకు రూ.4 వంతున ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందజేస్తున్నామంటూ బుకాయిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఈ సీజన్‌లో 5.61 లక్షల టన్నుల నాణ్యమైన మామిడి దిగుబడులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
కూటమి సర్కారు నిర్వాకంతో తోతాపురి మామిడి కిలో రూపాయికి కూడా కొనే నాథుడు లేకుండా పోయారు. దీంతో దిక్కుతోచక రైతన్నలు వేలాది టన్నుల మామిడిని రోడ్లపై పారబోస్తున్నారు. ర్యాంపుల వద్ద కిలో రూపాయికి అర్ధ రూపాయికి అడుగుతుండడంతో కూలి ఖర్చులు కూడా రావన్న ఆవేదనతో లక్షలాది ఎకరాల్లో పక్వానికి వచ్చిన మామిడిని కోయకుండా వదిలేస్తున్నారు. కళ్లెదుటే కుళ్లిపోయి రాలిపోతుండడంతో కుమిలిపోతున్నారు. వాస్తవాలకు ముసుగేసి మామిడి రైతులను తామేదో ఉద్ధరిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం నమ్మబలుకుతుండటంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
కదిలించిన కుమారస్వామి..చేతులెత్తేసిన చంద్రబాబు..
ఏపీలో మాదిరిగానే కర్నాటకలో కూడా ధరలు లేక మామిడి రైతులు నష్టపోతున్నారు. దీనిపై స్పందించిన కర్నాటకకు చెందిన కేంద్రమంత్రి కుమారస్వామి రైతులను ఆదుకోవాలంటూ గత నెల 24వ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు.
తమ రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకోవాలని, కేంద్రం కిలో రూ.16 చొప్పున కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని అభ్యర్థించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా క్వింటా రూ.1,616 (కిలో రూ.16) చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. కుమారస్వామి కోరిన విధంగా ఏకంగా 2.50 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తామని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు.
కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు ప్రాణవాయువు అందిస్తున్నా...
టీడీపీ, జనసేన మాదిరిగానే కర్నాటకలో జేడీఎస్ కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతోంది. టీడీపీ – జనసేన రైతులను ఆదుకోవడంలో విఫలం కాగా జేడీఎస్ మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క లేఖతో కదిలించింది. వాస్తవానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ, జనసేన అండదండలతోనే మనుగడ సాగిస్తున్నా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర సాధించిన పాపాన పోలేదు. మొన్న మిర్చి.. నేడు మామిడి రైతుల పట్ల అదే రీతిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
మద్దతు ధరల విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ చూపిన దాఖలాలు లేవు. కేంద్రంలో తమకున్న పలుకుబడిని స్వప్రయోజనాలకు, స్వలాభాలకు మినహా రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు వినియోగించిన దాఖలాలు లేవు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేవలేక.. చేతకాక మామిడి రైతులను నట్టేట ముంచేసింది. మొన్నటికి మొన్న మిర్చి రైతుల విషయంలో కూడా ఇదే రీతిలో వ్యవహరించింది.
కేంద్రానికి లేఖ రాశామని, క్వింటా రూ.11,781 చొప్పున రైతుల వద్ద ఉన్న మిర్చినంతటిని కేంద్రమే కొనుగోలు చేస్తుందంటూ ప్రకటించారు. తీరా కేంద్రం కొనలేదు.. రాష్ట్ర ప్రభుత్వమూ కొనలేదు. 2023–24 సీజన్‌లో క్వింటా రూ.21–27 వేలు పలికిన మిర్చిని కూటమి సర్కారు అసమర్థతతో రూ.6–8 వేలకు తెగనమ్ముకొని రైతులు నష్టాలపాలయ్యారు.
కంపెనీల గోడు పట్టదు.. రైతులను మభ్యపెడుతూ..
ఎగుమతి ఆర్డర్లు లేకపోవడంతో తమవద్ద పేరుకుపోయిన దాదాపు 1.50 లక్షల టన్నుల పల్ప్ నిల్వలను అమ్ముకునేందుకు ప్రభుత్వం చేయూతనివ్వకుంటే ఈ ఏడాది రైతుల నుంచి తోతాపురి మామిడిని కొనుగోలు చేయలేమని కంపెనీలు మొరపెట్టుకున్నాయి. అయితే ఎప్పటి మాదిరిగానే చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పల్ప్ ఉత్పత్తులపై జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కంపెనీలు అభ్యర్థిస్తే.. కేంద్రానికి లేఖ రాశామంటూ పాతపాటే పాడింది.
కంపెనీలు కిలో రూ.8 చొప్పున మామిడిని కొనుగోలు చేస్తాయని, మిగిలిన రూ.4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ తీరా కిలో రూ.2–4 మించి కొనేవారు లేక మామిడి రైతులు అల్లాడుతున్నారు. ర్యాంపుల వద్ద అయితే కిలో రూ.1–2కి మించి ఇవ్వని దుస్థితి నెలకొంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ అయినా జమ చేసిందా అంటే ఏ ఒక్క రైతుకూ రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఆదుకోవాలన్న తపన లేదు
రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి, తపన కూటమి ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక అప్పుల పాలై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చేష్టలుడిగి చూస్తుందే గానీ ఆదుకోవాలన్న తపన ఏ కోశానా లేదు. –జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం
టన్నుల కొద్దీ పారబోస్తున్నారు..
మద్దతు ధరకు కొనుగోలు చేస్తేనే రైతులకు ఎంతోకొంత ఉపయోగం జరుగుతుంది. కిలో రూ.12 చొప్పున ప్రకటించినప్పటికీ ఏ ఒక్క ఫ్యాక్టరీ కిలో రూ.8 కూడా ఇవ్వడం లేదు. మొదటిసారిగా టన్నుల కొద్దీ మామిడి రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి రైతులను కాపాడి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. –ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ అగ్రి మిషన్ మాజీ వైస్ చైర్మన్
రూ.7,796 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన జగన్ సర్కార్
రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
అన్నదాతల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విత్తనాల నుంచి పంట విక్రయాల దాకా ప్రతి అడుగులోనూ వారికి తోడుగా నిలిచింది. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా సీజన్‌కు ముందే పెట్టుబడి సాయాన్ని అందించింది. ఉచిత పంటల బీమాను అమలు చేసి రైతులపై భారం లేకుండా చేసింది. ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే వ్యవసాయదారుల అన్ని అవసరాలను తీర్చింది. ఏటా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి సాగుదారులకు భరోసా కల్పించింది. ధరలు పడిపోయిన ప్రతి సందర్భంలోనూ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది.
సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలోనే పంటల ధరలను పర్యవేక్షించింది. టమాటా, ఉల్లి, బత్తాయి, పొగాకు, పత్తి తదితర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారుల్లో పోటీని పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796 కోట్ల విలువైన 21.73 లక్షల పంట ఉత్పత్తులను (ధాన్యం కాకుండా ఇతర పంటలు) కొనుగోలు చేయడం గమనార్హం.