
ప్రొద్దుటూరు క్రైం: వృద్ధాప్య పింఛన్‌ను దివ్యాంగుల పింఛన్‌కు మారుస్తానని నమ్మించిన ఓ మోసగాడు 5 తులాల బంగారు నగలతో ఉడాయించాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులోని చోటు చేసుకుంది. బద్వేలి గురివిరెడ్డి, లక్ష్మీదేవి వృద్ధ దంపతులు. నెహ్రూరోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. లక్ష్మీదేవికి వచ్చే వృద్ధాప్య పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సచివాలయం నుంచి వచ్చానని ఒక వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. మీకు వస్తున్న వృద్ధాప్య పింఛన్‌ను దివ్యాంగుల పింఛన్‌గా మార్పు చేయడానికి వచ్చానని నమ్మబలికాడు.
వృద్ధాప్య పింఛన్ కంటే దివ్యాంగుల పింఛన్‌కు ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పడంతో వృద్ధ దంపతులు సంతోషించారు. వెంటనే ఆథార్ కార్డు తీసుకొని వెళ్తే మున్సిపల్ ఆఫీసులో ఒక సర్టిఫికెట్ ఇస్తారని అతను వారితో అన్నాడు. ఆ సర్టిఫికెట్‌ను తెచ్చి సచివాలయంలో ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గురివిరెడ్డి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లాడు. అతను వెళ్లగానే లక్ష్మీదేవి ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు.
ఫొటో అప్‌డేట్ చేయాలని చెప్పి వృద్ధురాలికి ఫోటో తీసేందుకు సెల్‌ఫోన్ బయటికి తీశాడు. ఆమె ఒంటిమీద బంగారు నగలు ఉండటంతో వాటిని తీయమని చెప్పాడు. నగలతో ఫొటో దిగితే పింఛన్ రాదని, నగలను పక్కన పెట్టాలని చెప్పాడు. దీంతో ఆమె బంగారు గాజులు, ఇతర నగలను తీసి కిచెన్ రూంలో పెట్టింది. ఫొటో తీయమని ఆమె చెప్పగా ఇక్కడ చీకటిగా ఉందని ఫొటో సరిగా రాదని చెప్పి ఆమెను బెడ్ రూం సమీపంలోకి తీసుకెళ్లాడు.
ఇదే అదునుగా భావించిన ఆ అగంతకుడు లక్ష్మీదేవిని బెడ్‌రూంలోకి తోసేసి గడియ పెట్టాడు. కిచెన్ రూంలో ఉన్న నగలను తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న వ్యక్తులు గడియ తీశారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి బంగారు నగలను దోచుకెళ్లాడని ఆమె బోరునా విలపించింది. లక్ష్మీదేవి ఐదు తులాల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తి దోచుకెళ్లాడని త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హనుమంతు తెలిపారు.