ఎలాంటి తవ్వకాలూ చేపట్టడం లేదు | Sakshi
Sakshi News home page

ఎలాంటి తవ్వకాలూ చేపట్టడం లేదు

Published Thu, Nov 23 2023 5:28 AM

Maintain status quo on excavations says high court - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నం, కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై యథాతథస్థితి(స్టేటస్‌ కో) కొనసాగించాలని హైకోర్టు బుధవారం విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ను ఆదేశించింది. తవ్వకాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. పిటిషనర్‌ ఆరోపిస్తున్న విధంగా ఎలాంటి తవ్వకాలు చేయడం లేదని వీఎంఆర్‌డీఏ తరఫు న్యాయవాది వరికూటి సూర్యకిరణ్‌ చెప్పిన విషయాన్ని హైకోర్టు రికార్డ్‌ చేసింది. నిబంధనల ప్రకారం ఈ కొండ కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌)–2 పరిధిలోకి వస్తుంది కాబట్టి, తవ్వకాలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది.

తదుపరి విచారణలో ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామంది. విచారణను డిసెంబర్‌ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సీఆర్‌జెడ్‌ నిబంధనల ప్రకారం తవ్వకాలకు అనుమతులు తీసుకునేందుకు ఈ ఉత్తర్వులు ఎంత మాత్రం అడ్డంకి కాదని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కైలాసగిరి కొండను తవ్వి నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులివ్వాలంటూ జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది.

ఎలాంటి తవ్వకాలు చేయడం లేదని, తెన్నేటి పార్కుకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం కొండ దిగువన ఉన్న చెట్ల తుప్పలను తొలగించి, కార్‌ పార్కింగ్‌కు అనువుగా చదునుచేస్తున్నా­మని వీఎ­ంఆర్‌డీఏ తరఫు న్యాయవాది సూర్యకిరణ్‌ తెలి­పారు. కార్‌ పార్కింగ్‌ ఏర్పాటు ప్రజా ప్ర­యో­జ­నం కిందకే వస్తుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తవ్వకాలకు కేంద్రం నుంచి అనుమతులు తప్పనిసరి కదా.. మీరు అన­ుమతులు తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నించింది. ఇందు­కు సంబంధించిన వివరాలు తన వద్ద సిద్ధంగా లేవని సూర్యకిరణ్‌ తెలిపారు. తదుపరి విచారణ సమ­యంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతాన­న్నారు. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖ­లు చే­యా­లని అధికారులను ధర్మాసనం ఆదేశించింది.    

Advertisement
Advertisement