కావలి కన్నీటి నివాళి | Madhusudhan funeral completed in Kavali | Sakshi
Sakshi News home page

కావలి కన్నీటి నివాళి

Apr 25 2025 4:54 AM | Updated on Apr 25 2025 4:54 AM

Madhusudhan funeral completed in Kavali

కశ్మీర్‌ ఉగ్రదాడిలో బలైన మధుసూదన్‌ అంత్యక్రియలు పూర్తి  

గుండెలవిసేలా విలపించిన కుటుంబ సభ్యులు  

కావలి: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకల తుపాకీ తూటాలకు బలైపోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సోమిశెట్టి మధుసూదన్‌ అంత్యక్రియలు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో గురువారం సాయంత్రం పూర్తయ్యాయి. కశ్మీర్‌ నుంచి విమానంలో చెన్నైకు, అక్కడి నుంచి అంబులెన్స్‌లో రోడ్డు మార్గంలో కావలి­లోని ఆనాల వారి వీధిలో ఉన్న మధుసూదన్‌ ఇంటి వద్దకు భౌతికకాయాన్ని గురువారం ఉదయం తీసుకువచ్చారు. 

మధుసూదన్‌ పార్థివదేహాన్ని చూడగానే అతడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పట్టణ వా­సులు వేలాదిమంది తరలివచ్చి నివాళి అర్పించారు. డెప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గురువారం మధ్యా­హ్నం కావలి చేరుకుని మధుసూదన్‌ భౌతిక కాయానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళి అర్పించారు. మంత్రులు ఆనం రామ­నా­రాయణరెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ యాదవ్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.   

ఐ లవ్‌ యూ డాడీ 
తండ్రి భౌతికకాయం వద్ద మధుసూదన్‌ కుమారుడు దత్తు, కుమార్తె మేధు ఐలవ్‌ యూ డాడీ అంటూ వెక్కివెక్కి విలపించిన తీరు అందరిచేత కంటతడి పెట్టించింది. ఎక్కడికీ వెళ్లొద్దు డాడీ... మా దగ్గరే ఉండి పో డాడీ అంటూ వారిద్దరూ గుండెలవిసేలా రోదించారు. సాయంత్రం నగర వీధుల్లో మధుసూదన్‌ అంతిమయాత్ర సాగింది. మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ పాడెను మోశారు. అనంతరం బుడంగుంట శ్మశానవాటికలో మధుసూదన్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి.    

Advertisement
 
Advertisement
Advertisement