కృష్ణాజలాల పంపిణీపై న్యాయ పోరాటం | Sakshi
Sakshi News home page

కృష్ణాజలాల పంపిణీపై న్యాయ పోరాటం

Published Thu, Oct 19 2023 4:27 AM

Legal battle over black water distribution - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీ కోసం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌(కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్‌ శక్తి శాఖ ఈనెల 6న జారీ చేసిన కొత్త విధి విధా­నాలపై న్యాయపోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ విధి విధానాల అమలును నిలిపే­సేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఎప్పుడు విచారించాలన్నది సుప్రీం కోర్టు నిర్ణయించనుంది.

కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉందని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌ 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది.  ఈ ట్రిబ్యునల్‌ అవార్డు గడువు ముగియడంతో 2004లో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్‌ కృష్ణా జలాల పంపిణీపై 2010 డిసెంబర్‌ 30న ఓ నివేదికను, 2013 నవంబర్‌ 29న తదుపరి నివేదికను అందజేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపుల జోలికి వెళ్లని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌.. 65 శాతం సగటు లభ్యత ఆధారంగా 194 టీఎంసీల మిగులు జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది.

ఈ నివేదికలను సవాల్‌ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, బేసిన్‌లోని రాష్ట్రాలు సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్సెల్పీ)లను దాఖలు చేశాయి. దీంతో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు అమల్లోకి రాలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను విభజన చట్టంలో సెక్షన్‌–89 ప్రకారం బ్రిజేష్‌­కుమార్‌ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది.

ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు చేయని ప్రా­జెక్టులకు నీటిని కేటాయించి, నీటి లభ్యత తక్కువ ఉన్న సంవత్సరాల్లో ప్రాజెక్టులవారీగా జలాల విడుదలకు  నిర్వహణ నియమావళి (ఆపరేషన్‌ ప్రోటోకాల్‌)ని రూపొందించాలని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు విభజన చట్టం నిర్దేశించింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కూడా ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. దీని ప్రకారం 2016 అక్టోబర్‌ నుంచి బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ చేస్తోంది.

విభజన చట్టం ప్రకారం బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన జలాల పునఃపంపిణీ కుదరని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను సెక్షన్‌–3 ప్రకారం పంపిణీ చేయాలని తెలంగాణ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. కృష్ణా జలాల పంపిణీకి కొత్త విధి విధానాలను ఈనెల 4న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆ మేరకు కొత్త విధి విధానాలను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు ఈనెల 6న కేంద్ర జల్‌ శక్తి శాఖ జారీ చేసింది.

ఈ విధి విధానాల ప్రకారం బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీలతోపాటు అదనంగా కేటాయించిన జలాలను ప్రాజెక్టులవారీగా పంపిణీ చేసి, రెండు రాష్ట్రాల వాటాలను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తేల్చాలి. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకూ విస్తృతార్థం ఇస్తూ.. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులుగా కూడా వర్గీకరించింది. ఈ విధివిధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.  

Advertisement
 
Advertisement