గిరిజనుల్ని భయపెడుతున్న భూసేకరణ భూతం
ఏజెన్సీలో కూటమి సర్కారు చట్టాల ఉల్లంఘన
పీసా, 1/70, అటవీహక్కుల చట్టాలను పట్టించుకోని వైనం
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కోసం వేల ఎకరాల భూసేకరణకు కసరత్తు
జనావాసాలు, పంట భూములపై కన్ను
కంచే చేను మేసినట్లు ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తుంటే.. జనాందోళనలు తెలియనట్లే వ్యవహరిస్తుంటే.. ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి? పాలకుల తీరు పగబట్టినట్లు ఉంటే సామాన్య ప్రజల గోడు పట్టించుకునేదెవరు? చట్టాలను పట్టించుకోకుండా అటవీ భూమిని అడ్డగోలుగా ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వమే కట్టబెడుతుంటే ఎవరికి చెప్పుకోవాలి?
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల్ని కలవరపెడుతున్న ప్రశ్నలు ఇవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కోసం గిరిజన చట్టాలను ఉల్లంఘించి మరీ పెద్ద ఎత్తున భూసేకరణకు రంగంలోకి దిగడంతో అడవిలో అలజడి తీవ్రమైంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల్ని భూసేకరణ భూతం భయపెడుతోంది. రాజ్యాంగం 5వ షెడ్యూల్‌లో గిరిజనులకు ప్రసాదించిన హక్కులు, వారికోసం ఉద్దేశించిన చట్టాలను కాపాడాల్సిన కూటమి ప్రభుత్వం వాటి ఉల్లంఘనలకు నడుంకట్టింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వేల ఎకరాల భూసేకరణకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లోని ఐదు గ్రామాల్లో నిరి్మంచనున్న ఆయుధ కర్మాగార డిపో కోసం 1,166 ఎకరాలు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ హైడల్ తదితర ప్రాజెక్టుల కోసం వేల ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ చట్టాలు, హక్కులకు విరుద్ధంగా చేసుకున్న హైడ్రోపవర్ ప్రాజెక్టుల ఒప్పందాలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తప్పనిసరైన ప్రాజెక్టులను జనావాసాలకు, పంటలు పండే సారవంతమైన భూములకు ఇబ్బంది లేని విధంగా చేపట్టాలని వారు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీల (ఎక్స్‌టెన్షన్) షెడ్యూల్డ్ ఏరియాలకు (పీసా) చట్టం–1996కు 2011లో చేర్చిన నిబంధనలు, అటవీహక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ)–2006, ఆంధ్రప్రదేశ్ భూమి బదిలీల నియంత్రణ (1/70 నియమం) చట్టాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని గిరిజనులు, రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు.
కూటమి ప్రభుత్వం కుట్రలు సాగనివ్వం
గిరిజన చట్టాలను కాదని గత టీడీపీ ప్రభుత్వం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు పెద్ద ఎత్తున అనుమతి ఇవ్వడంతో గిరిజన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచి్చంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గిరిజన చట్టాలు, వారి హక్కులను కాదని వేల ఎకరాల అటవీ భూమిని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే కుట్రలు చేస్తోంది. షెడ్యూల్డ్ ఏరియాలో అంగుళం భూమి తీసుకోవాలన్నా గ్రామసభ తీర్మానం చేసి దాన్ని గిరిజన సలహా మండలిలో ఆమోదం పొంది గవర్నర్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ఆదివాసీ గ్రామసభ ఆమోదం లేకుండా వేల ఎకరాలను కట్టబెట్టే ప్రభుత్వ చర్యల వల్ల ఆదివాసీల హక్కులు, భూములు, సంస్కృతి, పర్యావరణం దారుణంగా దెబ్బతింటాయి. గిరిజనులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం. – పీడిక రాజన్నదొర, మాజీ ఉపముఖ్యమంత్రి
గిరిజన హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం
గిరిజనుల హక్కులను కాలరాస్తూ వారికి చెందాల్సిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కూటమి ప్రభుత్వం ఎలా కేటాయిస్తుంది? ఇదే విషయంపై ఇటీవల శాసనమండలి సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీశాను. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో హైడ్రోపవర్ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతూ కూటమి ప్రభుత్వం జీవోలు జారీచేసింది.
ఇది ముమ్మాటికి 1/70 చట్టాన్ని ఉల్లంఘించడమే. 20 గ్రామాలతోపాటు వేలాదిమంది గిరిజనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ ప్రాజెక్టులు ఆదివాసీల పూర్వీకుల భూములు, అడవులు, నదులు, సంస్కృతిని, జీవనాధారాలను పూర్తిగా ధ్వంసం చేస్తాయి. – కుంభ రవిబాబు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ


