కర్నూలు (హాస్పిటల్): అనారోగ్యంతో ఆరోగ్యశ్రీ కార్డు చేతబట్టుకుని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతికి, “నీకు ఇంకా పెళ్లి కాలేదని సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే ఆపరేషన్ చేస్తాం” అని ఆ ఆస్పత్రి యాజమాన్యం వెనక్కి పంపించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది.
వివరాలు.. ఓ యువతి అనారోగ్యంగా ఉండడంతో కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన వైద్యులు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. తనకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కార్డు ఉందని ఆమె వైద్యులకు చూపించింది. అయితే అందులో ఆమె పేరు తల్లిదండ్రులతో పాటు ఉండటంతో అక్కడి వైద్య సిబ్బందికి అనుమానం వచ్చింది.
చాలామంది వివాహమైనా ఉచితంగా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునేందుకు కార్డులో పేరు తీయించుకోవడం లేదని, నీవు కూడా అలాగే చేసి ఉంటావని భావించారు. అందుకే ముందుగా “నీకు పెళ్లి కాలేదని సర్టిఫికెట్ తెచ్చుకోవాలి” అని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో ఆమె కంగుతింది.
సాధారణంగా వివాహమైతే సర్టిఫికెట్ ఇస్తారు.. కానీ పెళ్లి కాలేదని ఎవరు సర్టిఫికెట్ ఇస్తారని ఆ యువతి ప్రశ్నించింది. అయితే అదంతా తమకు సంబంధం లేదని, పెళ్లి కాలేదని సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే ఉచితంగా ఆపరేషన్ చేస్తామని ఆస్పత్రి నిర్వాహకులు తేల్చిచెప్పారు.


