
ధనుష్ నటించిన తెలుగు సినిమా ‘కుబేర’.. థియేటర్ నుంచి ఇప్పడు ఓటీటీకి వచ్చి అలరిస్తోంది. అమాయకులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ తరహా మోసాలకు కూడా పాల్పడతారని చూపించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే ఈ సినిమా కథాంశం తరహాలోనే నెల్లూరులో ఓ భారీ కుంభకోణం ఇప్పుడు బయటపడింది.
సాక్షి, నెల్లూరు: కుబేర సినిమా తరహాలో జిల్లా కేంద్రంలో బయటపడిన ఓ భారీ స్కామ్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా రూ.10 కోట్ల 60 లక్షల మేర సొమ్మును కేటుగాళ్లు మాయ చేశారు. ఇందుకోసం అమాయక గిరిజనుల ఐడెంటిటీని వాడుకున్నారు.
ఓ ఫేక్ కంపెనీని ఏర్పాటు చేసి.. అందులో కొందరు గిరిజనులను ఉద్యోగులుగా చూపించారు. వాళ్లకు ఆరు నెలలపాటు జీతాలు ఇచ్చినట్లు స్టేట్‌మెంట్లు క్రియేట్ చేశారు. అలా మొత్తం 56 మంది పేరిట నెల్లూరు యాక్సిస్ బ్రాంచ్‌లో లోన్లకు అప్లై చేసి డబ్బు చేజిక్కించుకున్నారు. అయితే.. సకాలంలో రుణం చెల్లించకపోవడంతో గిరిజనులకు నోటీసులు వెళ్లాయి. దీంతో వాళ్లు లబోదిబోమన్నారు.
2022 నుంచి సుమారు రెండేళ్లపాటు ఈ భారీ స్కామ్ జరిగినట్లు తేలింది. కిందటి ఏడాది సదరు బ్రాంచ్ మేనేజర్ ముగ్గురు వ్యక్తుల మీద ముత్తుకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ భారీ స్కాంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.