శ్రీశైలంలోకి కృష్ణమ్మ పరుగులు  | Krishna river flood Into Srisailam project | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలోకి కృష్ణమ్మ పరుగులు 

Aug 9 2020 6:08 AM | Updated on Aug 9 2020 6:08 AM

Krishna river flood Into Srisailam project - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి బళ్లారి: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. శనివారం సాయంత్రం శ్రీశైలంలోకి 98,765 క్యూసెక్కులు చేరుతుండగా.. రాత్రి 12 గంటలకు ఇది రెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ దఫా వస్తున్న వరదకు శ్రీశైలం.. నాగార్జునసాగర్, పులిచింతల నిండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. 

► పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా, ఉప నదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పెరుగుతోంది. 
► ఆల్మట్టిలోకి వస్తున్న వరద పెరుగుతుండటంతో.. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) సూచనల మేరకు నీటి నిల్వలను ఖాళీ చేసి దిగువకు వరదను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. దాంతో జూరాలకు భారీగా వరద చేరుతోంది. జూరాలకు చేరిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. 
► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న జలాలు సాగర్‌లోకి చేరుతుండటంతో నీటి మట్టం 558.20 అడుగులకు చేరుకుంది. 
► కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. అప్పర్‌ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ నుంచి భారీ ఎత్తున వరదను విడుదల చేస్తుండటంతో తుంగభద్ర జలాశయంలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. 
► మరోవైపు.. పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలోనూ వరద ఉద్ధృతి క్రమేణ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.17 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 7 వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేసి, 1.11 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement