బాబు గారి కళ్లలో తృప్తి కోసం... | Kommineni Srinivasa Rao Serious Comments On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

బాబు గారి కళ్లలో తృప్తి కోసం...

May 8 2026 11:38 AM | Updated on May 8 2026 11:42 AM

 Kommineni Srinivasa Rao Serious Comments On Chandrababu And Pawan Kalyan

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లింది? మొదట  చేసిన ఆరోపణ ఏమిటి?  ఆ తర్వాత వేసిన కుప్పిగంతులు ఎన్ని? సీబీఐ విచారణలో నిందితులుగా గుర్తించని వారిపై సైతం కేసులు పెట్టాలని ఎల్లో మీడియా ఎందుకు గొడవ చేస్తోంది? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలం క్రితం తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతుకొవ్వు, బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏదో జరిగిపోయినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా నానా హడావుడి చేశారు. దుర్గగుడి మెట్లు కడిగారు. తిరుపతిలో సభ పెట్టి సనాతన హిందువునని ప్రకటించుకున్నారు కూడా. ఆ తరువాతేమైంది? తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులతో వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు అండ్‌ కో నానా ప్రయత్నాలూ చేసింది. 

అయితే టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో తన ప్రభుత్వ పోలీసు అధికారులు ఇద్దరు ఉండేలా మాత్రం చేసుకోగలిగారు. అయినప్పటికీ జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్‌ నివేదిక స్పష్టం చేసింది. ఫలితంగా కూటమి ప్రభుత్వ పరువు పోయింది. రాజకీయం కోసం నీచమైన ఆరోపణలు చేశారన్న భావన ప్రజలలో ఏర్పడింది. అయితే నెయ్యిలో పామాయిల్ వంటివి కల్తీ అయి ఉండవచ్చని సీబీఐ అభిప్రాయపడి కొందరు డెయిరీ యజమానులపై, టీటీడీ అధికారులపై కేసులు  పెట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం శాంతించలేకపోయింది. ఎలాగైనా నెపం వైఎస్సార్‌సీపీ వారిపై నెట్టాలని మరో కమిషన్‌ ఏర్పాటు చేసింది. సీబీఐ నివేదికలోని అంశాల ఆధారంగా తదుపరి చర్యలపై నివేదిక కోరింది. మొత్తమ్మీద అందులో ఏదో రకంగా అప్పటి ఈఓ ధర్మారెడ్డి పేరు ప్రస్తావించడం ఎల్లో మీడియాకు సంతోషం కలిగించింది. చంద్రబాబు సంతృప్తి చెందారో లేదో తెలియాల్సి ఉంది. 

చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. అధికారులు తన మనసులోని మాటను కనిపెట్టి నిర్ణయాలు చేసేవరకు మీటింగుల పేరుతో తిప్పుతుంటారని చెబుతుండేవారు. పూర్వం ఆయా ఆరోపణలపై తాము కోరుకున్న నివేదికలు ఇచ్చే  విధంగా కొందరు రిటైర్డ్ న్యాయమూర్తులకు బాధ్యత అప్పగిస్తుంటారన్న ప్రచారం ఉంది.  ఇప్పటికీ అదే తరహాలో వ్యవహరిస్తున్నారేమో తెలియదు.అదే  మాదిరి  తాను ఆశించిన రీతిలో  నివేదిక కోసం మరో రిటైర్డ్ ఐఎఎస్  దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ నియమించారన్న భావన అధికారవర్గాలలో ఉంది. ఆ కమిషన్ పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలోని అంశాలు ఎల్లో మీడియాకే లీక్ చేసినట్లుగా ఉంది.  వారు  టీడీపీకి ఉపయోగపడే అంశాలనే ప్రచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ కమిషన్  ఇచ్చిన రిపోర్టులో కీలకమైన  పలు  అంశాలు మిస్ అయినట్లు  అనిపిస్తుంది. 

2019-2024 వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి మీద మాత్రమే ఎందుకు రిపోర్టు ఇచ్చారు? అంతకుముందు 2014-2019 మధ్య టీడీపీ పాలనలో సరఫరా అయిన నెయ్యి గురించి ఎందుకు నివేదికలో ప్రస్తావించలేదు? టీడీపీ పాలనలో నెయ్యి సరఫరా చేసిన సంస్థలే వైఎస్సార్‌సీపీ హయాంలోనూ  నెయ్యి  ఇచ్చాయి కదా! తప్పు జరిగితే అప్పుడు కూడా జరిగి ఉండాలి కదా?తక్కువ రేటుకు ఇస్తే  కల్తీ జరిగినట్లు అన్న నిర్ధారణకు వస్తే,  2014 టర్మ్‌లో చంద్రబాబు  ప్రభుత్వ హయాంలో కూడా జరిగినట్లే అవుతుంది కదా?అప్పుడు కూడా కిలో నెయ్యి ధర  రూ.400 లోపే ఉంది కదా! నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది, లడ్డూ  తయారీలో వాడింది చంద్రబాబు హయాంలోనే అని సీబీఐ నివేదికను ఉటుంకిస్తూ కొద్దికాలం క్రితం మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన  వ్యాఖ్యకు ఇంతవరకు చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేకపోయారు? మరో విశేషం ఏమిటంటే దినేష్ కుమార్ కమిషన్ చాలా విచిత్రమైన  ప్రతిపాదన  చేసింది. 

నెయ్యి సరఫరా కాంట్రాక్టులో తక్కువ ధర ఆధారంగా నిర్ణయం చేసే టెండర్ విధానం వద్దని ఈ కమిషన్ సిఫారస్ చేసిందని ఎల్లో మీడియా రాసింది. ఇలా ఎందుకు చేశారు? అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం తక్కువ రేట్లకే  నెయ్యి కొనుగోలు చేసినా, ఆ తర్వాత తమకు కావల్సిన ఒక సంస్థ ద్వారా అధిక రేటుకు కిలో సుమారు రూ.650లకు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకోవడానికి జరిగిన ప్రయత్నం కాదా? పైగా ఇదే  పద్దతి అన్ని చోట్ల అమలు చేస్తే, ఎవరు  ఎక్కువ రేటు వేస్తే వారికి టెండర్ వస్తుంది కదా! ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా?అమరావతి నిర్మాణ పనుల్లో జరుగుతున్న దోపిడీకి రాజముద్ర వేయడానికి ఏమైనా ఈ సిఫారస్ ఉపయోగపడుతుందా అన్న చర్చ కూడా ఉంది.

 కూటమి ప్రభుత్వ హయాంలో టీటీడీ వారు ఇందాపూర్ డెయిరీకి అధిక ధరకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్న ఆరోపణపై, దానికి హెరిటేజ్ సంస్థకు మధ్య ఉన్న  సంబంధం మొదలైన  అంశాలపై  కూడా దినేష్ కుమార్ కమిషన్ పరిశీలన చేసి, వాస్తవాలు నిగ్గు  తేల్చాలి కదా! మరో చిత్రమేమిటంటే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి నెయ్యి నాణ్యతపై పరిశీలన చేయాలని ఆదేశాలు ఇచ్చారు కాని, ఆ తర్వాత పట్టించుకోలేదట. అందువల్ల ఆయనను బాధ్యుడిని చేయాలని ఈనాడు మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది.  అదే ధీరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర ప్రభుత్వ పెద్దలకు వర్తింప చేయాలని ఈ మీడియా చెబుతుందా?  అధికారిక హోదాలో చంద్రబాబు పలు  ఆదేశాలు ఇస్తుంటారు. 

వాటి ఆయనే చూడాలని, లేకుంటే బాధ్యత వహించాలని ఈ మీడియా ఒప్పుకుంటుందా? అప్పుడేమో అధికారులది తప్పని వీరు చెబుతారు. టీటీడీ విషయానికి వస్తే ఛైర్మన్ ది తప్పంటారన్నమాట. అర్థంపర్థం లేకుండా ఎల్లో మీడియా వార్తలు  ఇస్తున్నదనడానికి ఇదే నిదర్శనం. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్‌లో వందల కోట్ల స్కామ్ జరిగిందని, సంబంధిత ఫైల్ పై చంద్రబాబే అప్పట్లో సంతకాలు చేశారని, ఆయన  ఆదేశాల మేరకే నిధుల విడుదల జరిగిందని, టీడీపీ ఆఫీస్ ఖాతాలోకి కూడా నిధులు వెళ్లాయని గతంలో సీఐడీ ఆరోపణ చేస్తే, ఇదే  ఈనాడు మీడియా ఏమి రాసింది? అబ్బే చంద్రబాబుకు దీనిని ఎలా రుద్దుతారని ప్రచారం చేసిందా?లేదా? అమ్మో చంద్రబాబుపై ఆరోపణ చేస్తారా? అని గగ్గోలు పెట్టిందా? లేదా? వైవి సుబ్బారెడ్డిపై మాత్రం అర్జెంట్ గా చర్య తీసుకోవాలని ఈ ఎల్లో మీడియా ఎందుకు ఏడుపు లంకించుకుందో  తెలియదా! అలాగే  మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి  భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలకు కూడా నెయ్యి టెండర్ల నిబంధనల మార్పుతో సంబంధం ఉందని ఈ కమిషన్ అభిప్రాయపడిందట. 

అయినా వారిపై చర్యకు సిఫారస్ చేయకపోవడం ఏమిటని ఎల్లో మీడియా బాధట. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవాలని కోరవచ్చు. నెయ్యిలో ఎప్పుడు కల్తీ జరిగినా అరికట్టవలసిందే.  కూటమి హయాంలో కల్తీ జరిగితే  సమర్ధించడం, అప్పుడు తక్కువ ధరకు నెయ్యి సరఫరా అయినా కల్తీ లేనట్లు, ఆ తర్వాత అయితే  ఉన్నట్లు సూత్రికరించడం, అలాగే చంద్రబాబు టైమ్ లో వచ్చిన కంపెనీ అయితే  దానిని వదలివేయడం, అదే కంపెనీ జగన్ టైమ్‌లో కొనసాగితే అందుకు ఏకంగా సి.ఎమ్.నే  బాద్యుడిని చేయడం..ఇలా ఉంది దిక్కుమాలిన లాజిక్కుల ప్రచారం.

దీనివ్లలే వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది.కొందరు అధికారుల మీద చర్య తీసుకోవాలని దినేష్ కుమార్ కమిషన్ సిఫారస్ చేసినా ఎల్లో మీడియా సంతృప్తి చెందినట్లు  కనిపించడం లేదు.మరి చంద్రబాబు ఏలా స్పందిస్తారో తెలియదు.ఏది ఏమైనా న్యాయం, ధర్మం అందరికి ఓకే మాదిరి కాకుండా టిడిపి హయాంలో స్కామ్ లు జరిగితే  వాటిని సమర్ధించడం, వైరిపక్షం పాలనలో స్కామ్ జరిగినా, జరగకపోయినా, అబాంఢాలు వేసి రాజకీయ లబ్ది కోసం ప్రచారం చేయడం వల్ల ఏపీ ప్రతిష్ట,అందులోను  తిరుమల ,తిరుపతి దేవస్థానం పరువును  కూటమి నేతలు, ఎల్లోమీడియా దెబ్బతీస్తున్నారని చెప్పక  తప్పదు.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
 
Advertisement
Advertisement